చెన్నైలో తెలుగు ఉపాధ్యాయిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తరగతి గదిలోనే ఫ్యానుకు ఉరేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. చెన్నై, అరుంబాక్కంలోని డీజీ వైష్ణవ పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని ఆత్మహత్యకు పాల్పడటం చెన్నైలోని తెలుగు వారికి షాకిచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా కారపాక్కంకు చెందిన హరిశాంతి (32) రెండేళ్ల క్రితం డీజీ వైష్ణవ కళాశాల తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
పెరంబూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం రావడంతో ఆమె ఆ కళాశాలలో ఉద్యోగం వదిలేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తూ.. హరిశాంతి అప్పుడప్పుడు డీజీపీ వైష్ణవ కళాశాలలోని తన స్నేహితులను కలుసుకునేందుకు వెళ్తుండేవారు. అలా మంగళవారం మధ్యాహ్నం ఆ కళాశాలకు వెళ్లిన హరిశాంతి తెలుగుశాఖ అధ్యక్షుడు మందలపు నటరాజ్, మరికొందరు స్నేహితులతో మాట్లాడినట్లు సమాచారం.
సాయంత్రం కళాశాల మూసేశారు. అయితే బుధవారం ఉదయం కళాశాల తెరిచిన తర్వాత సిబ్బంది తెలుగుశాఖ గదిని తెరిచారు. ఆ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని హరిశాంతి శవంగా వేలాడటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అరుంబాక్కం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉరేసుకున్న హరిశాంతి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆమె ఎడమచేతి మణికట్టుపై కత్తితో బలంగా కోసుకున్న గాయాన్ని గమనించారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. ఈ ఘటనపై హరిశాంతి స్నేహితుల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. హరిశాంతి మృతిపై పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పోస్టు మార్టం నివేదిక అందిన తర్వాత దర్యాప్తును మరింత వేగవంతం చేస్తామని పోలీసులు తెలిపారు.