Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలోని కోవిడ్‌ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు: ‘వార్డు లోపల ఎవరూ లేరు, రాత్రిపూట వార్డ్‌బాయ్‌ కూడా కనిపించలేదు’

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (12:07 IST)
''నా భర్త స్వరూప్‌ రాణి ఆసుపత్రిలో 50 ఏళ్లు వైద్యశాస్త్రాన్ని బోధించారు. కానీ ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆయన దగ్గర చదువుకున్న వారెవరూ వచ్చి కాపాడలేకపోయారు. నా కళ్ల ముందే నా భర్త చనిపోయారు. నేను స్వయంగా డాక్టర్‌ అయినప్పటికీ నిస్సహాయంగా మిగిలిపోయాను'' అని ప్రయాగ్‌రాజ్‌(ఒకప్పటి అలహాబాద్)కు చెందిన ప్రముఖ వైద్యురాలు రమా మిశ్రా ఏడుస్తూ నాకు ఫోన్‌లో వివరించారు.

 
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం, వైద్యుల అలసత్వం, వనరుల కొరత లాంటి కారణాల వల్ల ఆమె భర్త ఆమె కళ్ల ముందే మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో డజన్ల సంఖ్యలో అలా చనిపోయిన వారిని ఆమె చూశారు. 80 ఏళ్ల వయసున్న డాక్టర్‌ రమా మిశ్రా ప్రయాగ్‌ రాజ్‌లో ప్రముఖ మహిళా పాథాలజిస్ట్. ప్రయాగ్‌ రాజ్‌లోని మోతీలాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో ఆమె ప్రొఫెసర్.

 
స్వరూప్‌ రాణి నెహ్రూ హాస్పిటల్ ఈ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉంది. గత వారం కరోనా సోకడంతో ఆమె, ఆమె భర్త డాక్టర్ జేకే మిశ్రా స్వరూప్‌ రాణి నెహ్రూ ఆసుపత్రిలో చేరారు. ''కోవిడ్ పాటిజివ్ వచ్చినప్పటి నుంచి మేం ఐసోలేషన్‌లో ఉన్నాము. కానీ నా భర్తకు ఆక్సిజన్‌ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. మెడికల్ కాలేజీ వైద్యులే ఈ ఆసుపత్రిలో చేరమని చెప్పారు. కానీ ఇక్కడ పడకలు లేవు. అవి ఏర్పాటు చేసే సరికి చాలా ఆలస్యం జరిగింది. తెలిసిన వైద్యులతో బెడ్స్ ఏర్పాటు చేయించగలిగాం. కానీ ఆ తర్వాత పరిస్థితులు భయానకంగా మారాయి.'' అన్నారు డాక్టర్ రమా మిశ్రా.

 
భర్తతో కలిసి రమామిశ్రా ఏప్రిల్ 13న ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ వార్డులో ఒక బెడ్ మాత్రమే ఉంది. రమా మిశ్రా నేల మీదనే పడుకున్నారు. మరుసటి రోజు బెడ్ వస్తుందని ఆమెకు సిబ్బంది చెప్పారు. ''వాళ్లు చెప్పినట్లు మరుసటి రోజు బెడ్ రాలేదు. నాకు ఆక్సిజన్ అవసరం లేకున్నా, ఆరోగ్యం మాత్రం బాగా లేదు. రాత్రిపూట డాక్టర్లు ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే అది ఏ ఇంజెక్షనో చెప్పలేదు. అడిగినా సమాధానం లేదు. అక్కడ ఆ రాత్రి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రోగులంతా బాధతో అరుస్తున్నారు. నర్సులు వారిని విసుక్కుంటున్నారు. తెల్లవారేసరికి అనేకమంది తెల్లటి దుస్తుల్లో చుట్టి పెట్టి కనిపించారు'' అని అన్నారామె.

 
ఆసుపత్రిలో ఏం జరిగింది?
డాక్టర్ జేకే మిశ్రా, ఆయన భార్య రమా మిశ్రా మార్చి 1న కరోనా వ్యాక్సీన్ మొదటి డోసు తీసుకున్నారు. ఏప్రిల్ 7న రెండో డోసు కూడా తీసుకున్నారు. కానీ వీరికి కరోనా సోకింది. ఏప్రిల్ 13న ఇద్దరూ స్వరూపా రాణి ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల తర్వాత ఏప్రిల్ 16న మధ్యాహ్నం జేకే మిశ్రా మరణించారు. స్వరూప్‌ రాణి ఆసుపత్రిలో డాక్టర్ జేకే మిశ్రా మొదటి హౌస్ సర్జన్‌గా పని చేశారు. తర్వాత సర్జరీ విభాగానికి ఛైర్మన్ అయ్యారు. డాక్టర్ రమా మిశ్రా స్వరూప్‌ రాణి నెహ్రూ ఆసుపత్రిలో మహిళా, ప్రసూతి విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేశారు.

 
''ఈ ఆసుపత్రి నోడల్ ఆఫీసర్‌ డాక్టర్ మోహిత్ జైన్ మా జూనియర్. మేం చేరిన మరుసటి రోజే ఇక్కడికి వచ్చారు. మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయారు. మా దగ్గరి నుంచి అనేక వివరాలు తీసుకున్నారు. కానీ మాకు ఇస్తున్న ట్రీట్‌మెంట్ ఏమిటో చెప్పలేదు'' అన్నారు రమా మిశ్రా. ''ఆ తర్వాత ఆయన మావైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇటు వైపు రాలేదు'' అన్నారామె. ఆసుపత్రి వార్డు లోపల ఎవరూ లేరని, రాత్రిపూట వార్డ్ బాయ్‌ కూడా కనిపించ లేదని రమా మిశ్రా చెప్పారు.

 
''ఒక జూనియర్‌ డాక్టర్‌ మాత్రమే రాత్రి పూట వచ్చేవారు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ చూసి వెళ్లేవారు. మొదటి రోజు మా దగ్గరికి జూనియర్‌ అయిన సచ్‌దేవా అనే డాక్టర్ వచ్చారు. అతను మా దగ్గరికి వచ్చి మూడు అడుగుల దూరంలో నిలబడి చూశారు. తర్వాత కాసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. తర్వాత మరో డాక్టర్ వచ్చి మమ్మల్ని మెదాంత ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చాడు'' అని రమా మిశ్రా వివరించారు.

 
రమా మిశ్రా చెప్పిన దాని ప్రకారం ఇలా మూడు రోజుల పాటు వైద్యులు వారిద్దరికీ చికిత్స విషయంలో సీరియస్‌గా వ్యవహరించ లేదు. దీంతో ఏప్రిల్ 16 నాటికి జేకే మిశ్రా పరిస్థితి క్షీణించింది. ''ఆక్సిజన్‌ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఏదో పరికరం అమర్చారు. అది ఆయన శ్వాసకు అడ్డంకిగా మారింది. నేను వెంటనే దానిని తొలగించాను. కానీ అప్పటికే ఆయన ముక్కు నుంచి రక్తం రావడం ప్రారంభమైంది. నేను వెంటనే అక్కడి డాక్టర్‌కి విషయం చెప్పాను. ఈ జబ్బులో ఇలాంటివి సర్వ సాధారణమే అంటూ అతను చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

 
వార్డ్ బాయ్స్... ఏదో ఒకటి చేయండి, వెంటిలేటర్ అమర్చండి అంటూ నేను అరిచాను. కానీ ఇక్కడ వెంటిలేటర్లు లేవని డాక్టర్ చెప్పారు. మా జూనియర్‌ అయిన డాక్టర్ శక్తి జైన్ ఆయన్ను తరలించేందుకు బెడ్‌ను లిఫ్ట్‌ దగ్గర సిద్ధం చేశారు. ఆయన్ను లిఫ్ట్ దగ్గరకు తీసుకెళ్లేటప్పటికే ఆయన శ్వాస తీసుకుంటున్నట్లు కనిపించలేదు. చివరకు మాకు వెంటిలేటర్ దొరికి, దాన్ని ఆయనకు అమర్చేలోగానే ఆయన ప్రాణాలు పోయాయి'' అని అన్నారామె. ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని రమామిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు.

 
వనరుల కొరత నిజం కాదా?
ఆసుపత్రిలో వనరుల కొరత ఆరోపణలు నిజం కాదని, అయితే రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఆసుపత్రి నిర్వహణ కష్టంగా ఉందని స్వరూప్‌ రాణి ఆసుపత్రి కోవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ మోహిత్‌ జైన్ బీబీసీతో అన్నారు. ''ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం 500 మంది రోగులు ఉన్నారు. వీరిలో చాలామంది ఆరోగ్యం విషమంగా ఉన్న సమయంలో వచ్చారు. వారి ఆక్సిజన్‌ లెవెల్స్ 25-30 మధ్య ఉంటున్నాయి. చికిత్స అందించడానికి సమయం దొరకడం లేదు. రోగులు సరైన సమయంలో మా వద్దకు వస్తే, మేము చికిత్స చేయగలం'' అని ఆయన చెప్పారు.

 
అయితే ఇక్కడ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ప్రజలు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. కానీ వారి రిపోర్టులు రావడానికి మూడు నాలుగు రోజుల సమయం పడుతోంది. ఈ లోగా రోగి పరిస్థితి క్షీణిస్తోంది. రిపోర్టులు ఆలస్యం కావడం వల్ల అది ఇతరులకు వ్యాపించడం కూడా పెరుగుతోంది. అయితే డాక్టర్ జేకే మిశ్రా గుండెపోటుతో మరణించారని కోవిడ్‌ నోడల్ అధికారి మోహిత్ జైన్ చెబుతున్నారు. కొందరు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మరణిస్తున్నారని, భర్త చనిపోయిన బాధలో రమా మిశ్రా ఉన్నారని, ఆమె ఆవేదనను అర్థం చేసుకోగలమని మోహిత్ జైన్ చెప్పారు.

 
ప్రయాగ్‌ రాజ్‌లో పరిస్థితి ఎలా ఉంది?
లఖ్‌నవూ తర్వాత ఉత్తర్‌‌ప్రదేశ్‌లో కరోనా అత్యధికంగా ఉన్న జిల్లాల్లో ప్రయాగ్‌ రాజ్ ఒకటి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇక్కడ రోజుకు సగటున 10 మంది మరణిస్తున్నారు. వందల మంది వైరస్ బారిన పడుతున్నారు. ఇక్కడ ప్రతి అయిదుగురిలో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. ఒక్క ఆదివారమే 1711 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించగా, 15 మంది మరణించారు. ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్‌ కొరత వల్ల చాలామంది చనిపోతున్నారని తేలింది.

 
ప్రయగ్‌ రాజ్‌ కోవిడ్ ఆసుపత్రికి చెందిన ఒక వైద్యుడు.. వాస్తవానికి, అధికారులు చెబుతున్న దానికీ చాలా తేడా ఉందని బీబీసీకి చెప్పారు. అయితే ఆయన తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ప్రతి రోజు వివిధ శ్మశానాలలో వందకు పైగా శవాలను దహనం చేస్తున్నారని, వీటిలో ఎక్కువ భాగం కోవిడ్ మరణాలేనని ఆయన చెప్పారు. కానీ అధికారులు మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. పరిస్థితులు బాగానే ఉన్నాయని మోహిత్ జైన్ చెబుతుండగా, ఇలాంటి పరిస్థితుల్లో రోగిని బతికించడం చాలా కష్టమని రమా మిశ్రా అభిప్రాయపడ్డారు.

 
''సిబ్బందిలో నిర్లక్ష్యం ఉంది. వనరులు సరిగా లేవు. కేవలం మూడు వెంటిలేటర్లు మాత్రం ఉన్నాయి. అవి కూడా సరిగా పని చేయవు. ఉన్న ఒకరిద్దరు డాక్టర్లకు రోగులకు మందులివ్వడమే సరిపోతోంది. కనీసం 15-20 మంది డాక్టర్లతో ఇక్కడ పని చేయించాలి. అప్పుడు కనీసం ఆసుపత్రిలో ఉన్నవారికైనా చికిత్స జరుగుతుంది'' అన్నారామె. ఏప్రిల్ 17న డాక్టర్ రమా మిశ్రా రెండోసారి కోవిడ్ టెస్టు చేయించుకోగా నెగెటివ్ అని తేలింది. దీంతో ఆమె ఇంటికి చేరుకున్నారు. స్వరూప్‌ రాణి ఆసుపత్రిలో కోవిడ్ వార్డులు మూసివేసి ఉంటున్నాయని, లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదని, అద్దాలు ఏర్పాటు చేస్తే బంధువులు చూడటానికి వీలుగా ఉంటుందని రమా మిశ్రా అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య 45 లో, RJ బాలాజీ చిత్రంలో హీరోయిన్ గా త్రిష ఎంపిక

చియాన్ విక్రమ్, మడోన్ అశ్విన్, అరుణ్ విశ్వ కాంబినేషన్ లో చిత్రం

సాయి కుమార్ కీ రోల్ చేసిన ప్రణయ గోదారి చిత్రం రివ్యూ

Ram gopal varma: పుష్కరాల్లో తొక్కిసలాట భక్తులు చనిపోతే.. దేవతలను అరెస్టు చేస్తారా?

Pawan Kalyan: హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. నమ్మలేకపోతున్నానన్న రష్మిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments