ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కోడలు ఉరేసుకుంటే అత్తామామలు వీడియో వీడియో తీశారు. ఈ అత్మహత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు స్మార్ట్ ఫోనులో వీడియో తీసినట్టు చెబుతున్నారు. అనంతరం ఆన్‌లైన్‌లో దానిని అప్‌లోడ్ చేశారు.
కళ్ల ముందే కోడలు చనిపోతున్నా కనికరం లేకుండా వారు పాల్పడ్డ చర్య పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ డాటియానా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోమల్ అనే అమ్మాయితో ఆశిష్ అనే అబ్బాయికి 2019లో వివాహం జరిగింది. ఆ సమయంలో కోమల్ తల్లిదండ్రులు కట్నంగా ఐదు లక్షల రూపాయలను నగదు, ఒక బైక్‌ని ఇచ్చారు.
అయినప్పటికీ ఇంకా కట్నం కావాలని ఆరు నెలలుగా ఆశిష్ తల్లిదండ్రులు కోడలిని వేధిస్తున్నారు. అదనపు కట్నం తీసుకురాకపోతే ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆశిష్‌తో కలిసి ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో కోమల్ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది.
గ్రామ పెద్దలు ఆమెకు నచ్చజెప్పడంతో తిరిగి తన అత్తవారింటికి వచ్చింది. ఆమెను అత్తమామలు మళ్లీ వేధించడంతో తట్టుకోలేకపోయిన ఆమె గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆపకుండా, ఆ దృశ్యాలను కిటికీలో నుంచి చిత్రీకరించిన అత్తామామలను పోలీసులు అరెస్టు చేశారు.