Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి ఎందుకు ఒప్పుకొన్నారు? ఇప్పుడు ఏం చేస్తారు?

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (14:18 IST)
2017 మొదట్లో ఉప రాష్ట్రపతి పదవికి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేరును పరిశీలిస్తున్నట్లు చాలా వార్తలు వచ్చాయి. దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. దీంతో మీరు ఉప రాష్ట్రపతి పదవికి రేసులో ఉన్నారా? అని మీడియా ఆయన్ను ప్రశ్నించింది. దీనిపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. ‘‘నేను రాష్ట్రపతినో లేదా ఉప రాష్ట్రపతినో కావాలని అనుకోవడం లేదు. ఉషాపతిగా ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, వెంకయ్య నాయుడు భార్య పేరు ఉష అని ఇప్పటికీ చాలా మందికి తెలియదు.

 
‘‘ఉషాపతి’’ లాంటి చతుర్లు, కవితాత్మక పదప్రయోగాలకు వెంకయ్య నాయుడు పెట్టింది పేరు. రాజకీయ వర్గాల్లో దీని గురించి తరచూ మాట్లాడుకునేవారు. దక్షిణ భారత దేశం నుంచి వచ్చినా పార్టీలోని నాయకులు, జర్నలిస్టులతో ఆయన హిందీలో చక్కగా మాట్లాడుతుంటారు. ఈ విషయంలో ఆయనకు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. ఉప రాష్ట్రపతి పదవికి రేసులో ఉన్నారా? అనే ప్రశ్నకు ఆయన సరదాగా సమాధానం ఇచ్చి ఉండొచ్చు. అయితే, నిజానికి అసలు ఆయనకు ఉప రాష్ట్రపతి పదవిపై ఎలాంటి ఆసక్తీ లేదన్నమాట వాస్తవం. తన పుస్తకం ‘‘లిజనింగ్, లెర్నింగ్, లీడింగ్’’ ఆవిష్కరణ సమయంలో ఈ విషయాన్ని ఆయన అంగీకరించారు కూడా. ‘‘రెండోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. నేను క్యాబినెట్‌లో ఉండాలని కూడా అనుకోలేదు. నానాజీ దేశ్‌ముఖ్ అడుగు జాడల్లో నడుస్తూ పార్టీ కోసం పనిచేయాలని భావించాను. ఇదే విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా చెప్పాను’’అని ఆనాడు వెంకయ్య నాయుడు అన్నారు.

 
ఉప రాష్ట్రపతి పదవికి ఎలా ఒప్పుకొన్నారు?
వెంకయ్య నాయుడి 50ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని దగ్గర నుంచి గమనించిన వారిలో రాజ్యసభ మాజీ ఎంపీ డాక్టర్ యలమంచిలి శివాజీ కూడా ఒకరు. ఉప రాష్ట్రపతి పదవి విషయంలో వెంకయ్య నాయుడికి, తనకు మధ్య జరిగిన సంభాషణను బీబీసీకి శివాజీ వివరించారు. ‘‘ఉప రాష్ట్రపతి పదవి విషయంలో వెంకయ్య నాయుడికి ఎలాంటి ఆసక్తీ లేదు. ఆయన క్యాబినెట్ మంత్రిగానే ఉండాలని అనుకున్నారు. అయితే, ఏమీ ఆలోచించకుండా ఎన్డీయే ప్రతిపాదనకు ఓకే చెప్పాలని ఆయనకు నేను సూచించాను’’అని శివాజీ చెప్పారు. ‘‘ఒకసారి ఉపరాష్ట్రపతి అయితే, రాష్ట్రపతి అయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇదివరకు ఇలానే ఉప రాష్ట్రపతులు.. రాష్ట్రపతి అయిన సందర్భాలున్నాయి. ఇదే విషయాన్ని ఆయనకు చెప్పాను’’అని శివాజీ వివరించారు.

 
‘‘సర్వేపల్లి రాధాకృష్ణ, జాకిర్ హుస్సేన్, వీవీ గిరి, ఆర్ వెంకట్రామన్, శంకర్‌దయాల్ శర్మ, కేఆర్ నారాయణన్ లాంటి వారిని ఉదాహరణగా చెప్పాను. ఎందుకంటే 2019 ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని మేం అప్పటికే అంచనా వేశాం. బీజేపీ గెలిస్తే, ఆయనకు రాష్ట్రపతి పదవి ఖాయమని మేం భావించాం’’అని శివాజీ అన్నారు. వెంకయ్య నాయుడికి మరికొంత మంది సన్నిహితులు కూడా ఇలాంటి సూచనలే చేశారు. దీంతో మొత్తానికి ఆయన ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు అంగీకరించారు. మరోవైపు పార్టీ నుంచి ఆయనకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో ఉప రాష్ట్రపతి పదవికి సరేనని చెప్పడం మినహా ఆయన ముందు మరో మార్గం లేకుండా పోయింది.

 
రాష్ట్రపతి కల చెదిరిపోయింది
ఏ లక్ష్యంతో ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టాలని స్నేహితులు, ఆప్తులు వెంకయ్య నాయుడుకు సూచించారో.. అది ఇక నెరవేరనట్టే. రాష్ట్రపతి పదవిని పక్కన పెడితే, రెండోసారి ఉప రాష్ట్రపతి పదవి చేపట్టే అవకాశమూ వెంకయ్య నాయుడికి దక్కలేదు. ప్రస్తుతం ఆయనతోపాటు ఆయన సన్నిహితులు కూడా ఈ విషయంలో ఎలాంటి ఆశాభావంతో లేరు. రాష్ట్రపతి అవ్వాలనే కోరికను వెంకయ్య నాయుడు ఏ బహిరంగ వేదకపైనా వెల్లడించలేదు. అయితే, ఈ విషయంలో ఆయనలో కచ్చితంగా ఆశ ఉండే ఉండొచ్చు. గతంలో ఉదాహరణలను పరిశీలిస్తే, రాష్ట్రపతి పదవి విషయంలో ఆయన మనసులో ఆలోచనలు కలగడం సాధారణం. ప్రస్తుతం వెంకయ్య నాయుడి వయసు 73ఏళ్లు. దీంతో క్రియాశీల రాజకీయాల నుంచి ఆయన తప్పుకునే రోజులు కూడా దగ్గరపడుతున్నట్లే భావించాలి.

 
విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి..
1949 జులై 1న నెల్లూరులో వెంకయ్య నాయుడు జన్మించారు. అంటే, స్వాతంత్రం వచ్చిన రెండేళ్ల తర్వాత ఆయన పుట్టారు. అప్పట్లో నెల్లూరు.. మద్రాస్ ప్రెసెడెన్సీ కింద ఉండేది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా జన్మించలేదు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్య నాయుడు.. నెల్లూర్‌లోని వీఆర్ హైస్కూల్‌లో చదువుకున్నారు. డిగ్రీ కూడా నెల్లూరులోనే పూర్తి చేశారు. ఆ తర్వాత పొలిటికల్ సైన్స్, లాలో ఉన్నత విద్య అభ్యసించారు. విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

 
రాజకీయాల్లో తొలి అడుగులు..
1971లో వీఆర్ కాలేజీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఆయన గెలిచారు. యూనియన్ ప్రెసిడెంట్‌గా ఆయన పనిచేశారు.
1973-74 మధ్య ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగానూ కొనసాగారు.
1974లో విద్యార్థి సంఘర్షణ సమితి రాష్ట్ర కన్వీనర్‌గా వెంకయ్య నాయుడిని జయప్రకాశ్ నారాయణ్ నియమించారు.
1970లలోనే ‘‘జై ఆంధ్రా’’ ఉద్యమం మొదలైంది. అభివృద్ధి మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే ఎందుకంటూ కొనసాగిన ఈ ఉద్యమంలో వెంకయ్య నాయుడు కూడా పాలుపంచుకొన్నారు.
1975లో ఎమర్జెన్సీ కాలంలో వెంకయ్య నాయుడు జైలుకు కూడా వెళ్లారు.
1977-80లలో జంతర్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా వెంకయ్య నాయుడు నియమితులయ్యారు.
1978లో తొలిసారి ఉదయగిరి నియోజకవర్గం నుంచి వెంకయ్య నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు.
1980-83 మధ్య బీజేపీ యువ మోర్చాకు అధ్యక్షుడిగానూ వెంకయ్య పనిచేశారు.
1985లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు.
1998లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడిగా మారారు.

 
70, 80లలో విజయవంతంగా..
70, 80ల కాలంలో ఆయన రాజకీయ ప్రస్థానం విజయవంతంగా నడిచింది. విద్యార్థి దశలో జన్ సంఘ్, ఏబీవీపీలో చేరినప్పుడు, తన స్నేహితుల దగ్గర నుంచి ఆయన హిందీ నేర్చుకోవడం మొదలుపెట్టారు.
 
అయితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనకు పెద్దగా హిందీతో అవసరం పడలేదు. తెలుగుతోపాటు ఇంగ్లిష్‌లోనూ మంచి మంచి పదాలు, వాక్యాలను వెంకయ్య ఉపయోగించేవారు.
 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు, హిందీలోనూ ఆయన ఇలాంటి ప్రయోగాలే చేయడం మొదలుపెట్టారు.

 
జాతీయ రాజకీయాల్లో అలా..
1993లో బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి వెంకయ్య నాయుడు అడుగుపెట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు.
1996-2000 మధ్య పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా వెంకయ్య నాయుడు పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ కమిటీ కార్యదర్శిగా, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగానూ కొనసాగారు.
1998లో కర్నాటక నుంచి రాజ్యసభలో వెంకయ్య నాయుడు అడుగుపెట్టారు. 2004, 2010లోనూ ఆయన్ను రాజ్యసభకు బీజేపీ పంపించింది. ఎందుకంటే దక్షిణ భారత దేశంలోని అగ్ర నాయకుల్లో ఆయన ఒకరని పార్టీ భావించేది.
2000లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖను వెంకయ్య నాయుడుకు అప్పగించారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనను దేశంలోని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లే బాధ్యతను అప్పట్లో వెంకయ్య తీసుకున్నారు.
2002లో పార్టీ అధ్యక్ష బాధ్యతలను వెంకయ్య తీసుకున్నారు. అయితే, 2004 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత 2004, 2010లో కర్నాటక నుంచి ఆయన్ను బీజేపీ రాజ్యసభకు పంపించింది.
2014లో మోదీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు బాధ్యతలు తీసుకున్నారు.
2016లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఆయన్ను పంపించారు.
2017లో ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు బాధ్యతలు తీసుకున్నారు.

 
2004లో ముందస్తు ఎన్నికలకు..
‘‘ఉప రాష్ట్రపతి పదవిని చేరుకోడానికి వెంకయ్య నాయుడుకున్న క్లీన్ ఇమేజే కారణం’’అని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు దినేశ్ ఆకుల చెప్పారు. '‘అయితే, వెంకయ్య నాయుడు చుట్టూ కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. కానీ, ఆ ఆరోపణలకు సరైన సాక్ష్యాలు లేవు’’అని ఆయన అన్నారు.

 
‘‘వెంకయ్య నాయుడిపై చంద్రబాబు నాయుడి ప్రభావం ఎక్కువగా ఉండేదని అప్పట్లో అందరూ భావించేవారు. ఆ ప్రభావం వల్లే 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అటల్ బిహారీ వాజ్‌పేయీకి వెంకయ్య నాయుడు సూచించారని చెప్పేవారు’’అని దినేశ్ వివరించారు.

 
‘‘2003లో చంద్రబాబు నాయుడిపై తీవ్రవాద దాడి జరిగింది. దీన్ని ఉపయోగించుకొని సానుభూతి ఓట్లు పొందొచ్చని వెంకయ్య నాయుడు భావించినట్లు విశ్లేషణలు వచ్చాయి. అంతకుముందే కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచింది. దీంతో లోక్‌సభ ఎన్నికలు ముందుగా నిర్వహించాలని వెంకయ్య నాయుడు సూచించారు’’అని దినేశ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజనలో వెంకయ్య నాయుడి పాత్ర గురించి విమర్శకులు.. ప్రత్యేక హోదా లాంటి ప్రధాన అంశాలను ప్రస్తావిస్తుంటారు.

 
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఈ డిమాండ్‌కు అంగీకరించలేదు. ‘‘వెంకయ్య నాయుడు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఆయన తలుచుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాగలరు. కానీ, అలా జరగలేదు’’అని ఎలమంచిలి శివాజీ వ్యాఖ్యానించారు. ‘‘అయితే, వెంకయ్య నాయుడుపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే, ఇలాంటి డిమాండ్లు మరిన్ని వస్తాయని అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఇది సాధ్యంకాదు’’అని ఆంధ్రజ్యోతి పత్రిక సీనియర్ జర్నలిస్టు కృష్ణా రావు అభిప్రాయపడ్డారు.

 
మోదీతో సంబంధం ఎలా ఉండేది?
ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడి పేరును పరిశీలించినప్పుడు ఆయనకు 68 ఏళ్లు. నరేంద్ర మోదీ, అమిత్ షా కావాలనుకుంటే.. వెంకయ్య నాయుడు క్రియాశీల రాజకీయాల్లో మరికొన్ని ఏళ్లు కొనసాగేందుకు అవకాశం ఇచ్చుండేవారు. ఇటీవల కాలంలో రాజ్యసభ ప్రధాన కార్యదర్శి నియామకం సమయంలో ప్రధాన మంత్రి మోదీ స్పందించిన తీరుపై కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. వెంకయ్య నాయుడు చేపట్టిన ఈ నియామకాన్ని రెండు నెలల్లోనే మరో వ్యక్తితో భర్తీ చేయించారు.

 
దీనిపై ద ప్రింట్ న్యూస్ వెబ్‌సైట్ ఒక కథనం ప్రచురించింది. ‘‘2021 సెప్టెంబరులో రాజ్యసభ ప్రధాన కార్యదర్శి పదవికి పీపీకే రామాచార్యులను వెంకయ్య నాయుడు నియమించారు. ఇప్పటివరకు ఈ పదవికి తగిన వ్యక్తులను సాధారణంగా రాజ్యసభ చైర్మనే (ఉప రాష్ట్రపతే) నియమిస్తూ వచ్చారు. కానీ, రెండు నెలల్లో ఆ పదవి నుంచి రామాచార్యులను తొలగించారు. పీసీ మోదీకి ఆ పదవి అప్పగించారు. రాజ్యసభ చైర్మర్‌కు సలహాదారుగా రాజ్యసభ ప్రధాన కార్యదర్శి పనిచేస్తారు’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

 
ఈ విషయంలో రాజ్యసభ మాజీ ప్రధాన కార్యదర్శి వివేక్ అగ్నిహోత్రి బీబీసీతో మాట్లాడారు. ‘‘ఈ పదవి ఉప రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. దీని నియామకానికి సంబంధించి ఎలాంటి నిబంధనలూ తీసుకురాలేదు’’అని చెప్పారు. వెంకయ్య నాయుడుకు సన్నిహితుల్లో రామాచార్యులు కూడా ఒకరు. అయితే, ఆయన్ను రెండు నెలల్లోనే ఎందుకు తొలగించారు? ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో చాలా చర్చ జరిగింది. అయితే, ప్రధాన మంత్రి కార్యాలయం అనుమతి తీసుకోకపోవడం వల్లే ఈ నియామకాన్ని రద్దు చేశారని చాలా విశ్లేషణలు వచ్చాయి.

 
ఈ వివాదంపై రాజ్యసభ సచివాలయం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కానీ, వెంకయ్య నాయుడు పదవీ కాలం ఎనిమిది నెలలు ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని చాలా ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. అయితే, అంతకుముందు 2020 ఫిబ్రవరి 6న రాజ్యసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో పది నిమిషాల నిడివి ఉన్న వీడియోను తొలగించారు. వివాదం నడుమ రాజ్యసభ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యసభ సచివాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

 
హిందీ భాష వివాదమూ..
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంగ్లిష్‌కు ప్రత్యామ్నాయంగా హిందీని ఉపయోగించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల తర్వాత వెంకయ్య నాయుడు దీనిపై స్పందించారు. ‘‘ఏ భాషనూ ఎవరిపైనా రుద్ద కూడదు. అలానే ఏ భాషనూ వ్యతిరేకించకూడదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను అమిత్ షా వివాదంలోనే చూడాలా? రాష్ట్రపతి లేదా ఉప రాష్ట్రపతి పదవుల్లో ఉండేవారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి నిరాకరిస్తుంటారు. అసలు ఎందుకు వారు వ్యాఖ్యలు చేయకూడదు?

 
‘‘ఇక్కడ మీడియా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. రాష్ట్రపతి లేదా ఉప రాష్ట్రపతి అనే పదవులు సాధారణ ఎంపీ, లేదా స్పీకర్ లాంటి పదవులు కాదు. ఇవి రాజ్యాంగ పదవులు. రాజ్యాంగం ప్రకారం, ఉపరాష్ట్రపతి.. రాజ్యసభ చైర్మన్. అలాంటి ఉన్నత పదవుల్లో ఉండేవారు.. దేశంలోని ప్రతి అంశంపై స్పందించాలని ఆశిస్తున్నారా?’’అని వివేక్ అగ్నిహోత్రి ప్రశ్నించారు.

 
తర్వాత ఏం చేస్తారు?
ఈ వివాదాల నడుమ వెంకయ్య నాయుడుకు రాష్ట్రపతి అభ్యర్థిత్వం దక్కబోదని ముందుగానే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి. మరి ఇప్పుడు వెంకయ్య నాయుడు ఏం చేస్తారు? దీనిపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. ‘‘స్వర్ణ భారతి ట్రస్టు కోసం ఆయన పనిచేస్తారు. స్నేహితులతో కలిసి ఆయనే ఈ ట్రస్టును మొదలుపెట్టారు. దీన్ని ప్రస్తుతం ఆయన కుమార్తె నడిపిస్తున్నారు’’అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments