Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిబాబా ఎక్కడ జన్మించారు? షిర్డీలోనా పత్రిలోనా?

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (15:43 IST)
'సబ్ కా మాలిక్ ఏక్' అని బోధించిన సాయిబాబా జన్మస్థలం అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సాయిబాబా జన్మస్థలంగా భావించే పత్రి పట్టణ అభివృద్ధి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులు ప్రకటించింది. కానీ, ప్రభుత్వ నిర్ణయాన్ని షిర్డీ వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదివారం షిర్డీ బంద్ చేపట్టారు.


అందుకు పోటీగా, పత్రి వాసులు కూడా బంద్‌కు పిలుపు ఇచ్చారని కథనాలు వచ్చాయి. సాయిబాబా తమ ఊరిలోనే జన్మించారని పత్రి వాసులు అంటున్నారు. అందుకు సంబంధించి 29 ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, 29 కాదు కదా పత్రి వాసులు సరైన ఆధారం ఒక్కటి చూపించాలని షిర్డీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

 
పత్రి పేరు ఎందుకు వచ్చింది?
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి నాందేడ్‌కు రైలులో వెళ్తుంటే మధ్యలో మన్వత్ రోడ్ అనే స్టేషన్ వస్తుంది. అక్కడ అనేక ఏళ్లుగా ఒక బోర్డు కనిపిస్తోంది. "సాయిబాబా జన్మస్థలాన్ని దర్శించుకునేందుకు ఇక్కడ దిగండి" అని దానిపై రాసి ఉంటుంది. కానీ, అది బాబా జన్మస్థలమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. పత్రి వాసులతో పాటు, ఇక్కడ నివసించే ఇతర ప్రజలు మాత్రం సాయిబాబా జన్మస్థలం పత్రినే అని నమ్ముతారు.

 
అందుకు సంబంధించిన ఆధారాల గురించి అడిగినప్పుడు... "సాయిబాబా పత్రిలో 1838లో జన్మించారు. మాజీ ముఖ్యమంత్రి బాలాసాహెబ్ ఖేర్ కుమారుడు విశ్వాస్ ఖేర్ 30 ఏళ్ల పాటు పరిశోధన చేసి సాయిబాబా జన్మస్థలం పత్రి అని చెప్పారు’’ అని పత్రిలోని సాయిబాబా జన్మస్థల మందిర్ ట్రస్టు అధ్యక్షుడు అటుల్ చౌధరీ వివరించారు.

 
"పత్రికి సమీప గ్రామమైన సేలులో కేశవ్‌రాజ్ మహరాజ్ అలియాస్ బాబాసాహెబ్ మహారాజ్ ఆలయం ఉంది. సాయిబాబాకు బాబాసాహెబ్ గురువు అని మా నమ్మకం. 1974లో షిర్డి సాయి సంస్థాన్ ప్రచురించిన సాయి సచ్చరిత్ర (సాయిబాబా జీవిత చరిత్ర) ఎనిమిదో ఎడిషన్‌లోనూ సాయిబాబా పత్రిలో జన్మించారని పేర్కొన్నారు. ఆ పుస్తకాన్ని గోవింద్ దభోల్కర్ రాశారు. తన తల్లిదండ్రులు తనను ఓ ఫకీరుకు దత్తతకు ఇచ్చారని సాయిబాబా తన శిష్యుడితో సాయిబాబా చెప్పారు" అని చౌధరీ చెప్పుకొచ్చారు.

 
"సాయిబాబా అసలు పేరు హరిభావు భుసారి. ఆయన పెద్ద సోదరుడు కూడా ఒక ఫకీరే, కాబట్టి తన సోదరుడి వల్ల సాయిబాబా ప్రభావితమై ఉండవచ్చు. పత్రి గ్రామంలో ముస్లిం జనాభా ఎక్కువ. ఈ ఊరి చరిత్రలో చాలామంది ఫకీర్ల గురించి ప్రస్తావన ఉంది. ఆ కథలన్నీ వెలుగులోకి వచ్చి ఉంటే పత్రి గ్రామం పేరు ప్రపంచ పటంలో నిలిచేది. ఏది ఏమైనా, అలాంటి ఫకీర్లు సాయిబాబాను ప్రభావితం చేశారు. అందుకే, ఆయన వస్త్రధారణ ముస్లిం ఫకీర్‌ల మాదిరిగా ఉంది" అని చౌధరీ వివరించారు. దాస్ గాను సాధువు రాసిన జీవిత చరిత్రలోనూ సాయిబాబాకు పత్రితో సంబంధం గురించి పేర్కొన్నారని చౌధరి చెప్పారు.

 
ఎనిమిదో ఎడిషన్ ఎక్కడ ఉంది?
ఎనిమిదో ఎడిషన్ ఆధారంగా సాయిబాబా జన్మస్థలం పత్రి అని ఆ గ్రామస్థులు చెబుతున్నారు. కానీ, షిర్డి సంస్థాన్ గ్రంథాలలో ఆ ఎనిమిదో ఎడిషన్ గురించే లేదని షిర్డి సంస్థానం అధ్యక్షుడు సురేష్ హవారే చెప్పారు. "విశ్వాస్ ఖేర్ సమయంలో విడుదలైన ఎనిమిదో ఎడిషన్‌ను ఆధారంగా చేసుకును పత్రి వాసులు అలా వాదిస్తున్నారు. కానీ, అంతకు ముందటి ఎడిషన్లలో ఆ విషయం ఎక్కడా లేదు. ప్రస్తుత 36 ఎడిషన్‌లోనూ అలాంటి ప్రస్తావన లేదు. దభోల్కర్ రాసిన చేతిరాత పత్రాలు మా దగ్గర ఉన్నాయి. వాటిలోనూ ఆ విషయం గురించి చెప్పలేదు. మరి, ఎందుకు ఎనిమిదో ఎడిషన్‌లో మాత్రమే అది కనిపిస్తోంది" అని హవారే ప్రశ్నిస్తున్నారు.

 
"పత్రి మాత్రమే కాదు, సాయిబాబా తమ ఊరిలోనే జన్మించారంటూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని చోట్ల వాదనలు ఉన్నాయి. సాయిబాబా పట్ల ప్రజలకు ఉన్న భక్తి భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, కానీ వాళ్లు చేస్తున్న వాదనలకు ఎలాంటి ఆధారాలూ లేవు" అని ఆయన వ్యాఖ్యానించారు.

 
'సాయిబాబా జీవిత చరిత్రలను ఆయన భక్తులు రాసినవి మాత్రమే'
జీవిత చరిత్రలను ప్రామాణికంగా చేసుకుని సాయిబాబా జన్మస్థలం ఏదో నిర్ణయించడం సాధ్యమవుతుందా? అంటే... "సాయిబాబా జీవిత చరిత్రల్లో చాలావరకు ఆయన భక్తులు రాసినవే" అని సాయిబాబా జీవితంపై అధ్యయనం చేసిన రాజా కందాల్కర్ చెప్పారు. "చరిత్రకారులు అయితే బలమైన ఆధారాలు, డాక్యుమెంట్లు, అంశాలను, ఘటనలను నిశితంగా పరిశీలించి చరిత్ర రాస్తారు. కానీ, సాయిబాబా జీవిత చరిత్ర పుస్తకాలు రాసినవారు అలాంటి చరిత్రకారులు కాదు. వాళ్లు రాసిన ఉద్దేశం తప్పు అని నేను అనడంలేదు కానీ, వాళ్లు సరైన ఆధారాలను పరిశీలించకుండానే పుస్తకాలు రాసి ప్రచురించారని అనిపిస్తోంది" అని కందాల్కర్ అంటున్నారు.

 
"ఆ కాలంలో 'దీనబంధు' అనే మరాఠీ పత్రిక ఉండేది. సత్యశోధక్ సమాజ్‌కు చెందిన ఉద్యమకారుడు ముకుందరావు పాటిల్ ఆ పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. కానీ, ఆయన సాయిబాబా గురించి ఒక్కసారి మాత్రమే పేర్కొన్నారు. అప్పట్లో వెలువడిన మరో పత్రిక కేసరి కూడా సాయిబాబా గురించి ఏ విషయాలూ రాయలేదు. పత్రి గ్రామంలో పెద్దలు మాత్రం బాలగంగాధర్ తిలక్‌తో పాటు సీనియర్ నాయకులు కూడా సాయిబాబాను కలిసేందుకు తమ ఊరికి వచ్చినట్లు చెబుతారు. కానీ, అందుకు సంబంధించి ఎలాంటి ఆధారమూ లేదు. ఒకసారి మెజిస్ట్రేట్ ముందు సాయిబాబాను విచారించారు. ఆయన తన జన్మస్థలం గురించి ఏమీ చెప్పలేదు. తన పేరు సాయిబాబా అని చెప్పారు" అని ఆయన వివరించారు.

 
పత్రిని సందర్శించిన రామ్‌నాథ్ కోవింద్
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2016లో పత్రిని సందర్శించారు. అప్పుడు ఆయన బీహార్ గవర్నర్‌గా ఉన్నారని చౌధరీ చెప్పారు. "సాయిబాబా జన్మస్థలం పత్రిని అభివృద్ధి చేయాలి" అని సాయిబాబా 100వ వర్థంతి సందర్భంగా షిర్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఆయన సాయిబాబా జన్మస్థలం పత్రి అన్నప్పుడు ఆయనతో చాలామంది ఏకీభవించలేదు. రామ్‌నాథ్ కోవింద్‌కు బహుశా ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని బీజేపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్ అన్నారు.

 
ఈ సమస్యకు పరిష్కారం కోసం చర్చించేందుకు పత్రి, షిర్డి వాసులు సిద్ధంగా ఉన్నారు. "మా దగ్గర 29 రుజువులు ఉన్నాయి. ఈ రుజువులను ప్రభుత్వానికి సమర్పించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈ రుజువులను అధ్యయనం చేసి విశ్లేషించిన తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు" అని చౌధరి అంటున్నారు.

 
"వాస్తవం ఏంటో తెలుసుకోకుండానే సాయిబాబా జన్మస్థలం పత్రి అని ప్రభుత్వం పేర్కొంది. కాబట్టి, ప్రభుత్వం తన లోపాన్ని సరిదిద్దుకోవాలి" అని హవారే అన్నారు. "అధ్యయనం చేసి పక్కా రుజువుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇది సున్నితమైన, విశ్వాసంతో ముడిపడి ఉన్న సమస్య, కాబట్టి జాగ్రత్తగా పరిష్కరించాలి" అని ఆయన సూచించారు.

 
రూ. 100 కోట్ల నిధుల మాట ఏంటి?
పత్రి అభివృద్ధికి వంద కోట్ల రూపాయల నిధుల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 'వంద కోట్ల ఈ నిధి ఒక్క ఆలయానికే అని పుకారు వ్యాప్తి చెందింది' అని ఎమ్మెల్సీ, పత్రి జన్మస్థాన్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు బాబాజని దుర్రానీ అన్నారు. "ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు మంజూరు చేసిందనేది నిజం. కానీ, అందుకు సంబంధించి ప్రతిపాదనలు దేవేంద్ర ఫడ్నవీస్ కాలంలోనే ప్రారంభమయ్యాయి.


రూ.100 కోట్లలో సగం ఇక్కడ ప్రజల పునరావాసం కోసం ఖర్చు చేస్తారు. సాయి ఆలయం పక్కన రహదారి వెడల్పు చేయడం వల్ల చాలామంది ప్రజలు తమ ప్రస్తుత నివాసాలను ఖాళీ చేయాల్సి వస్తుంది. వాళ్లకు పునరావాసం కల్పించే బాధ్యతను మేం తీసుకుంటాం. అందుకోసం మాకు నిధులు కావాలి. భక్తులకు వసతి, ఆహారం, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా డబ్బు అవసరం. భక్తుల వసతి కోసమే 10 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి" అని బాబాజని వివరించారు.

 
పత్రికి వంద కోట్ల రూపాయల గ్రాంట్ అందనున్న తరుణంలో, షిర్డీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షిర్డీ బంద్‌కు కారణం ఇదేనా? ఈ ప్రశ్నకు హవారే స్పందిస్తూ... "అదంతా తప్పు. పత్రికి లేదా అక్కడి ఆలయ అభివృద్ధికి వంద, రెండొందల కోట్ల రూపాయలు ఇస్తే షిర్డీ వాసులకు సమస్య లేదు. కానీ, రుజువు చూపించకుండా పత్రిని సాయిబాబా జన్మస్థలంగా ప్రభుత్వం ప్రకటించడంపైనే వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు" అన్నారు.

 
సాయిబాబాను హిందుత్వ అజెండాలోకి తీసుకుంటున్నారా?
సాయిబాబా పుట్టుకతో హిందువు అని చెప్పుకోవడం ద్వారా, ఆయన్ను హిందుత్వ అజెండాలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. "సాయిబాబా ఏ మతంలో జన్మించినా అది ఆయన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయలేదు. అన్ని కులాలు, మతాల ప్రజలు సాయిబాబా ఆలయాన్ని సందర్శిస్తారు. అందరికీ 'మాస్టర్ ఒక్కరే' అని సాయిబాబా చెప్పారు. ఆయన బోధనలకు విరుద్ధంగా మేము ఎ పనీ చేయబోము" అని చౌధరి అన్నారు.

 
ఇదిలా ఉండగా, సాయి జన్మస్థలం అంశంపై వివాదం భక్తులకు ఆటంకం కలిగించకూడదని కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవాన్ అన్నారు. "సాయిబాబా జన్మస్థలంపై ఎలాంటి వివాదాలు అవసరం లేదు. సాయిబాబా అందరికీ చెందుతారు. ఆయన అన్ని చోట్లా ఉన్నారు. కాబట్టి, ఈ వివాదాన్ని అంతగా పెంచకూడదు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ వివాదాన్ని పరిష్కరించాలి" అని ఎన్సీపీ సీనియర్ నాయకుడు, మంత్రి చాగన్ భుజ్‌బల్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments