Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం .. చంద్రబాబు హెచ్చరిక :: ప్రెస్ రివ్యూస్

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (12:15 IST)
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు ఎమ్మెల్యేలు పురమాయించారని పోలీసులు టీడీపీ శ్రేణులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, వాటన్నిటికీ వడ్డీతో బదులు తీర్చుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. రిటైరైనా అధికారులను వదలనని హెచ్చరించారు. తాను మూడుసార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తినని కూడా చూడకుండా మార్షల్స్‌ చేత అసెంబ్లీ బయట ఆపేయడం సిగ్గుచేటన్నారు.
 
చంద్రబాబు బుధవారం అనంతపురంలో టీడీపీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము వ్యతిరేకం కాదని, ఆ పేరుతో రాజధానులు మార్చడం సరికాదని తప్పుపట్టారు. ''రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిని చేసి విశాఖను ఆర్థిక కేంద్రంగా తయారు చేసే ప్రణాళిక రచించాను. అక్కడ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయడానికి కొందరు ముందుకొచ్చారు. అదే వచ్చి ఉంటే హైదరాబాద్‌ కంటే మించిపోయేది. లక్షల్లో ఉద్యోగాలొచ్చేవి. దానిని వైసీపీ వాళ్లు తరిమేశారు'' అని విమర్శించారు.
 
ఆనాడు హైదరాబాద్‌లో అన్నీ ఒకేచోట ఉంచి అభివృద్ధి చేశామన్నారు. ఐటీ రంగం, సైబరాబాద్‌, హైటెక్‌ సిటీ, ఔటర్‌ రింగ్‌రోడ్‌ వంటివి వచ్చాక గణనీయంగా అభివృద్ధి జరిగిందని తెలిపారు. అమరావతిలో తాను ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తాను చట్టాన్ని వ్యతిరేకించాననుకుంటే దిక్కున్నచోట చెప్పుకోవాలన్నారు. వారు అన్నట్లు నాలుగు వేల ఎకరాల భూమి ఎక్కడో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడు పరిశ్రమల కోసం కాంగ్రెస్‌ హయాంలో 500 ఎకరాలు కొన్నారని.. వాటి అవసరం లేకపోవడంతో వెనక్కి ఇచ్చేశారని తెలిపారు.
 
జగన్‌ పనికిమాలిన ముఖ్యమంత్రి అని, ఆయనకు ఓనమాలు కూడా రావని చంద్రబాబు విమర్శించారు. తనకు ఇంగ్లీషు రాదని ఆయన అసెంబ్లీలో అన్నారని.. తాను ఎస్వీ యూనివర్సిటీలో చదివానని గుర్తు చేశారు. జగన్‌ ఎక్కడ చదివాడో ఎవరికి తెలుసని ప్రశ్నించారు. అమరావతిలో రూ.7 కోట్లతో నిర్మించిన ప్రజావేదికను కూల్చేశారని, ఆ హక్కు వారికెవరిచ్చారని ప్రశ్నించారు. మనుషుల్ని తినే మనుషులుగా వైసీపీ నేతలను అభివర్ణించారు.
 
నేను ఎమ్మెల్యేనా.. రౌడీషీటర్‌నా?: రాజాసింగ్ 
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు రౌడీషీట్‌ నమోదు చేశారని.. మంగళ్‌హాట్‌ పోలీసుల రౌడీషీటర్స్‌ జాబితాలో రాజాసింగ్‌ పేరును చేర్చారని ఓ తెలుగు పత్రిక ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన కొందరు బీజేపీ కార్యకర్తలు ఇది గమనించి రాజాసింగ్‌కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
 
దీనిపై రాజాసింగ్‌ స్పందిస్తూ.. ఇంకా తన పేరు రౌడీషీటర్‌ జాబితాలో ఉండటంపై మండిపడ్డారు. తాను అన్నీ వదిలేసి ప్రజా సేవలోకి వచ్చానని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై, మంత్రులపై గతంలో రౌడీషీట్లు ఉన్నాయని.. వాటిని ఇప్పుడు కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. తనపై రౌడీషీట్‌ పెట్టినందుకు బాధలేదని చెప్పారు. తాను ఇప్పుడు ఎమ్మెల్యేనా, రౌడీషీటర్‌నా అనే దానికి ముఖ్యమంత్రి, హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
 
మీడియా ఆంక్షల జీవోను ఉపసంహరించండి: ఏపీ ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ ఆదేశం 
మీడియాపై ఆంక్షలు విధించేలా జారీచేసిన 2430 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించినట్లు 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. ఆ జీవో జారీపై కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ సి.కె.ప్రసాద్ అధ్యక్షతన బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో విచారణ జరిగింది.
 
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) తరఫున ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేశ్ విచారణకు హాజరయ్యారు. సమాచార, పౌరసంబంధాల శాఖ తరఫున అదనపు డైరెక్టర్ కిరణ్ తమ వాదనను కౌన్సిల్‌కు వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్నాక.. జీవోను ఉపసంహరించుకోవాలని జస్టిస్ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
 
వరంగల్‌కు మెట్రో నియో... కేటీఆర్ ఆహ్వానంతో నగరంలో అధ్యయనం 
ప్రపంచంలోని దాదాపు వంద దేశాల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రజారవాణాలో తనదైన ముద్ర వేసిన మెట్రో నియో.. భారతదేశంలో మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోని వరంగల్ నగరంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో పేర్కొంది.
 
ఆ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పుణె, నాసిక్ నగరాల్లో అక్కడి ప్రభుత్వం మెరుగైన ప్రజారవాణా సౌకర్యం కోసం చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించిన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లోనూ ఈ మెట్రో నియోను అందుబాటులోకి తేవాలని భావించారు.
 
కేటీఆర్ ఆహ్వానంతో మహా మెట్రో ప్రతినిధులు, హెచ్‌ఎండీఏ అధికారులు బుధవారం వరంగల్‌లో పర్యటించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఇక్కడి రోడ్ నెట్‌వర్క్, జనాభా, రోజువారీ ప్రయాణ సదుపాయాలు మొదలైన అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనంచేశారు.
 
ముందుగా హెచ్‌ఎండీఏ ట్రాన్స్‌పోర్ట్ హెడ్ విజయలక్ష్మి, కుడా ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డితో కలిసి కాజీపేట నుంచి పెట్రోల్ బంక్, అక్కడినుంచి పోచమ్మమైదాన్ మీదుగా వెంకట్రామ టాకీస్ నుంచి రైల్వేస్టేషన్, అక్కడినుంచి తిరిగి వరంగల్ చౌరస్తా మీదుగా పోచమ్మమైదాన్ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
 
అనంతరం మహా మెట్రో డిప్యూటీ డైరెక్టర్ ఎస్కే సిన్హా తమ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టుల వివరాలను, మెట్రో నియో పనితీరు ఏ విధంగా ఉంటుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
 
మెట్రో నియో ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 శాతం నిధులు సమకూర్చుకోవచ్చని, లేదా పీపీటీ పద్ధతిలోగానీ లేదా గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థల్లో 60 శాతం నిధులను రుణాలుగా తీసుకొని, మిగతా 40 శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 శాతం చొప్పున సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
 
ఈ ప్రాజెక్టు అధ్యయనం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే దాదాపు రూ.1,100 నుంచి 1,200 కోట్లతో వరంగల్ మహానగరానికి మెట్రో నియో సేవలు అందుబాటులోకి వచ్చే అవకశాశం ఉన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments