ఏపీ అసెంబ్లీలో టీడీపీ సీనియర్ నేత దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని గళం విప్పారు. సభలో మద్య నియంత్రణపై మాట్లాడినందుకు తనను వైకాపా కార్యకర్తలు టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. అసభ్యకరమైన పోస్టులు పెడుతూ, కామెంట్స్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం తనతోనే ప్రారంభంకావాలని ఆమె పిలుపునిచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా భవాని మంగళవారం సభలో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. దిశ చట్టం అమలును తనతోనే మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. మద్య నియంత్రణపై తాను సభలో మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
తనపై అసత్యప్రచారం చేస్తున్నవారిలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని సభాముఖంగా హోంమంత్రికి తెలిపారు. దిశ చట్టం తనతోనే మొదలవ్వాలని అసెంబ్లీ ముఖంగా ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆదిరెడ్డి భవాని శాసనసభలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి అయిన తనకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాగా, ఈమె రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.