Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్.ఎస్.రాజమౌళి: యాడ్ ఫిల్మ్ మేకర్ నుంచి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ దాకా...

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (19:12 IST)
సినిమా రంగంలో సక్సెస్ ముఖ్యం. ఒక బ్లాక్ బస్టర్ వస్తే ఆకాశానికెత్తేసే జనం, రెండు ఫ్లాపులు రాగానే.. మర్చిపోతారు. కానీ, గత 20 సంవత్సరాల్లో ఏడుగురు హీరోలతో 12 సినిమాలు... అన్నీ సూపర్ హిట్లే. ఇదీ రాజమౌళి లెక్క. ఎడిటింగ్ నుంచి, యాడ్ ఫిలిం డైరెక్టర్, ఆ తర్వాత సీరియల్ డైరెక్టర్‌గా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చారు రాజమౌళి. దర్శకుడయ్యాక ఒక్కో సూపర్ హిట్టుతో 20 ఏళ్లకు తెలుగు కమర్షియల్ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చే స్థాయికి చేరారు. వరుస విజయాలతో తెలుగు చిత్రసీమలో, ఆ మాటకొస్తే భారత చలనచిత్ర రంగం మీదనే తనదైన బ్రాండ్ వేసిన దర్శకుడు రాజమౌళి.

 
బిగువైన కథ, ఆసక్తికరమైన కథనం, దాన్ని దృశ్యంగా మలచడంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రమాణాలను నిర్దేశించుకోవడం... ఇదే రాజమౌళి ఫార్ములా. తెర మీద స్టార్లకు బదులు తన పాత్రలే కనిపించాలని కోరుకుంటారు రాజమౌళి. ఇప్పటివరకూ తీసిన 12 సినిమాల్లో ఏ రెండూ ఒకేలా ఉండకపోవడం, విభిన్న జోనర్‌లలో ఉండడం, అయినా అన్నీ విజయవంతం కావడం... రాజమౌళికి మాస్ పల్స్ మీద ఉన్న గ్రిప్‌కు నిదర్శనం.

 
రాజమౌళి సినిమాలు, హీరోలు...

 
ఎడిటింగ్‌తో తొలి అడుగులు
ఇంటర్ తర్వాత ఏమవుతావంటే డైరెక్టర్ అవుతానని తండ్రికి చెప్పిన రాజమౌళి, మిగతా శాఖల్లో అనుభవం సంపాదించమన్న తండ్రి సలహాతో మొదట ఎడిటింగ్ నేర్చుకున్నారు. తర్వాత మిగతా శాఖలపై పట్టు సాధించి దర్శకుడు కె.రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. తండ్రి స్టోరీ రైటర్‌గా ఉన్నప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా కూడా పనిచేశారు రాజమౌళి.

 
తర్వాత రాఘవేంద్రరావు గైడెన్స్‌తో కొన్ని వాణిజ్య ప్రకటనలకు పనిచేసిన రాజమౌళి రాఘవేంద్రరావు ఈటీవీ కోసం నిర్మించిన 'శాంతి నివాసం' సీరియల్‌తో దర్శకుడుగా మారారు. 2001లో 'స్టూడెంట్ నంబర్‌ వన్‌'తో టాలీవుడ్ దర్శకుడు కావాలన్న తన కల నిజం చేసుకున్నారు. ఆ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ రాఘవేంద్రరావు చేశారు. మొదటి అవకాశాన్ని సక్సెస్‌గా మలుచుకోడానికి ఏ అవకాశాన్ని వదులుకోని రాజమౌళి ప్రతి రోజూ ఉదయాన్నే తన యమహా బైక్‌లో రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లి సీన్ చూపించి సజెషన్స్ తీసుకుని.. మళ్లీ సెట్‌కు పరుగులు తీసేవారట.

 
ఎన్టీఆర్‌తో చేసిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాను ఒక విధంగా ఇద్దరూ ఒకరికొకరు చాన్స్ ఇచ్చుకోవడంలాగే భావిస్తారు రాజమౌళి. రెండో సినిమా కోసం రెండేళ్లు వేచిచూసిన రాజమౌళి.. ఎన్టీఆర్‌తోనే సింహాద్రి ప్రారంభించారు. అప్పటికే 'ఆది' సినిమాతో ఎన్టీఆర్‌కు మాస్ హీరో ఇమేజ్ రావడంతో, అతడికి మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ ఇవ్వడానికి రాజమౌళి కొంత ఒత్తిడికి గురయినట్లు చెప్పుకుంటారు. చివరికి తండ్రి అందించిన కథతో మొదటిసారి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు.

 
సింహాద్రి తర్వాత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న రాజమౌళి ఆ తరువాత నితిన్‌తో ‘సై’ చిత్రం తీశారు. అక్కడి నుంచి ‘యమదొంగ’ వరకూ తెలుగు ప్రేక్షకులకు ఏడాదికొక సినిమా అందించారు. ‘సై’ మూవీలో కాలేజీ దోస్తీని, లోకల్ రాజకీయాలను రగ్బీ ఆటతో ముడిపెట్టి యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి, తర్వాత సినిమా ‘ఛత్రపతి’లో ప్రభాస్ మాచో హీరోయిజంను, మదర్ సెంటిమెంటుతో మిక్స్ చేసి మరో సక్సెస్ అందుకున్నాడు. విక్రమార్కుడు లాంటి పక్కా మాస్ మసాలా సినిమాకు పవర్ పుల్ పోలీస్ స్టోరీని యాడ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి.. ఆ సినిమాతో మిగతా ఇండస్ట్రీల కళ్లల్లో పడ్డారు. తమిళం, హిందీ, కన్నడలోకి అది రీమేక్ అయి అక్కడ కూడా హిట్ అయ్యింది. తర్వాత ఏడాదే సోషియో ఫాంటసీ 'యమదొంగ' తీసి తన లక్కీ హీరో ఎన్టీఆర్‌తో హాట్రిక్ హిట్స్, టోటల్‌గా ఆరో హిట్ అందుకున్నారు రాజమౌళి.

ఇండస్ట్రీ రికార్డులు
బాహుబలికి ముందు రాజమౌళి అంటే అభిమానులకు గుర్తొచ్చే సినిమా మగధీర. కానీ, తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసుకున్న మగధీర కథను తెరకెక్కించడానికి 15 ఏళ్లు వెయిట్ చేశానని చెప్పారు రాజమౌళి. శతధ్రువంశ యోధుడు అనే ఒక్క పాయింట్ తీసుకుని దాని చుట్టూ కథ అల్లుకుని ఆ సినిమాతో రామ్‌చరణ్‌కు స్టార్ ఇమేజ్ ఇవ్వడంతోపాటూ ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశారు. అందుకే పోస్టర్ మీద తన ముద్రే కాదు.. ఫొటో కూడా వేసుకోగలిగిన స్థాయికి చేరారు రాజమౌళి. నిర్మాత అల్లు అరవింద్ మగధీర 50వ రోజు సందర్భంగా హీరో రామ్ చరణ్‌తోపాటూ రాజమౌళి కూడా గుర్రపు స్వారీ చేస్తున్న పోస్టర్ వేయించారు.

 
మగధీర లాంటి పెద్ద సక్సెస్ తర్వాత రాజమౌళి ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో సునీల్‌తో ‘మర్యాదరామన్న’ అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన దీన్ని తన ఫేవరెట్ సినిమాగా చెబుతారు. తన అన్ని సినిమాలనూ చూస్తున్నప్పుడు తర్వాత సీన్ కోసం వేచి చూస్తానని, మర్యాద రామన్నలో మాత్రం ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తానన్నారు. తనకు ఇగోలు ఉండవని రాజమౌళి క్లియర్‌గా చెబుతారు. స్టార్‌డమ్‌కు ఉన్న విలువ తనకు తెలుసని, దాన్ని బేస్ చేసుకునే ఈ స్థాయికి వచ్చానని అంటారు.

 
కానీ, ఆయన ‘ఈగ’ టైటిల్ అనౌన్స్ చేసినపుడు అందరూ షాక్ అయ్యారు. ఈగతో అయినా బ్లాక్ బస్టర్ కొట్టగలనని నిరూపించడానికే ఆయన ఆ సినిమా తీశారని రాజమౌళి విమర్శలు కూడా ఎదుర్కున్నారు. కానీ, అది నిజం కాదని, కథ బలంగా ఉంటే ఈగయినా, దోమయినా సినిమా తీయచ్చని ఆయన ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ సినిమాను బాహుబలి కంటే కష్టమైనదిగా భావించే రాజమౌళి, ఈగ సినిమా తనలో కాన్ఫిడెన్స్ కూడా పెంచిందంటారు.

 
కథే హీరో
స్టార్‌డమ్‌కు విలువిస్తానని చెబుతూనే, దానికంటే కథ ముఖ్యమని బలంగా నమ్ముతారు రాజమౌళి. అందుకే రజనీకాంత్, ఆమిర్ ఖాన్ లాంటి హీరోలు ఆఫర్ ఇచ్చినా, మనం తీయాలంటే వాళ్లకు తగిన కథలు ఉండాలి కదా, అందుకే ముందుకెళ్లలేదని చెప్పారు. హీరోల స్టార్‌డమ్‌ను వరుసగా ఉన్న జీరోల్లా వర్ణించే రాజమౌళి, దాని ముందు ఒకటి అనే మంచి కథను పెట్టినప్పుడే ఆ స్టార్‌డమ్‌కు లక్షలు, కోట్ల విలువ వస్తుందంటారు. కథ మీద దృష్టి పెట్టకుండా హీరోల స్టార్‌డమ్‌ను నమ్ముకుని సినిమా చేయలేనని గట్టిగా చెబుతారు ఈ దర్శకుడు.

 
అందుకే, రచయిత ఊహను మించి కథను అద్భుతంగా తెరకెక్కిస్తారని తండ్రి దగ్గరే ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు రాజమౌళి. హీరోల్లో కూడా రాజమౌళి సినిమా చేయాలని అనగానే కథ కూడా వినకుండా ఒప్పుకునేంత నమ్మకం ఉంటుంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే మాట చెప్పారు.
ఆర్ఆర్ఆర్ సినిమా చేయాలని తమ దగ్గరికి రాగానే, అసలు కథేంటో కూడా తెలీకుండా కలిసి ఫొటో దిగేసి ఆర్ఆర్ఆర్ అనౌన్స్ చేశామని చెప్పారు.

 
బాహుబలితో సంచలనం
రాజమౌళి కెరీర్లో ఇప్పటివరకూ భారీ మూవీగా నిలిచింది, భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టింది బాహుబలి ఫ్రాంచైజీ. బాహుబలి-ది బిగినింగ్ తీసిన తర్వాత 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు' అనే ఒకే ఒక్క లైన్‌తో దాదాపు రెండేళ్ల పాటు దాని సీక్వెల్ బాహుబలి-ది కంక్లూజన్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేయించాడు రాజమౌళి. నిజానికి, ఇలాంటి సీన్ శాంపిల్ తన రెండో సినిమా సింహాద్రి ఇంటర్వెల్ బ్లాక్‌లోనే చూపించేశారు రాజమౌళి. అక్కడ భూమిక ఎన్టీఆర్‌ను ఎందుకు పొడిచిందనే సస్పెన్స్‌ను ఓ ఐదు నిమిషాలే ఉంచితే.. ఇక్కడ మాత్రం దాన్ని ఆల్ ఇండియా ప్రేక్షకులకు రెండేళ్లు సమాధానం దొరకని ప్రశ్నలా మార్చేశారు.

 
బాహుబలి 1, 2 సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ఆ పేరుతో ప్రపంచానికి ఏకంగా ఒక సూపర్ హీరోనే పరిచయం చేశారు. తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేది తన ఆలోచన కాదని, బాహుబలిని ఒక ఇండియన్ మూవీగా అనుకున్నానని, అందుకే దానికోసం పూర్తిగా డిఫరెంట్ మార్కెటింగ్ మోడల్లో ముందుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. బాహుబలికి ప్రపంచ స్థాయి ప్రశంసలు దక్కినా, అందులోని ఎమోషన్స్ ఇంకాస్త బలంగా, బాగా తెరకెక్కించుంటే బాగుండేదనే లోటు రాజమౌళి మనసులో ఇప్పటికీ ఉండిపోయింది. చాలా ఇంటర్వ్యూల్లో ఆయనే స్వయంగా ఆ విషయం చెప్పారు. బాహుబలి లాంటి సినిమాను ఎవరైనా సాహసంగా వర్ణిస్తే, రాజమౌళి దానికి అస్సలు ఒప్పుకోరు. అందరూ అరటిపళ్లు అమ్మే చోట తను మామిడిపళ్లు అమ్మితే అవి కచ్చితంగా అమ్ముడవుతాయనేది, అదే తన మార్కెటింగ్ సూత్రం అంటారు.

కుటుంబమే బలం, బలగం
ఎస్.ఎస్.రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. ఈ ఏడాది (2022) అక్టోబర్ 10న రాజమౌళి 50వ ఏట అడుగుపెట్టనున్నారు. ఆయన 1973లో కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో జన్మించారు. కానీ, వారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు. ఈ స్థాయి విజయాలు అందుకోడం వెనుక తన బలం, బలగం తన కుటుంబమే అంటారు రాజమౌళి. ఆయన సినిమాలకు తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుంటారు. రాజమౌళి తొలి సినిమా నుంచీ పెద్దన్న కీరవాణి ఆయనకు సంగీతం అందిస్తూ వస్తున్నారు.

 
ఇక రాజమౌళి భార్య రమా రాజమౌళి ఆయన సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేస్తుంటే.. కీరవాణి భార్య శ్రీవల్లీ కీరవాణి, వారి కొడుకు కాలభైరవ కూడా ఆయన టీమ్‌లో భాగమయ్యారు. శ్రీవల్లి, రమ అక్కచెల్లెళ్లు. రాజమౌళి రమకు రెండో భర్త. ఆమెకు మొదటి భర్త ద్వారా కలిగిన కార్తికేయ కూడా రాజమౌళి టీమ్‌లో లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తారు. అంటే రోజువారీ సినిమా షూటింగ్‌ సాఫీగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవడం వీరి బాధ్యత. రాజమౌళికి మయూఖ అనే దత్తపుత్రిక కూడా ఉన్నారు.

 
ప్రతి సినిమాకు ముందూ, ఆ తర్వాత కుటుంబ సభ్యులందరితో కలిసి చర్చిస్తానని ఆయన చెబుతారు. అందరికీ ఒక కథ నచ్చి సినిమా తీసేద్దాం అనుకుంటేనే అది సెట్స్ పైకి వెళ్తుందని, అది చిన్నదైనా, పెద్దదైనా కామెడీ అయినా, మాస్ అయినా తీసేయాలనుకుంటానని రాజమౌళి చెబుతారు. హీరో గురించి, మార్కెట్ గురించి ఆ తర్వాతే ఆలోచిస్తానని అంటారు. అలాగే ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయందే.. ఇంకో ప్రాజెక్ట్ గురించి ఆలోచించరు రాజమౌళి. ఒక సినిమా పూర్తయి విడుదలైన తరువాతే మరో సినిమా గురించి ఆలోచిస్తానంటారు. అందుకే, ఆలస్యంగా సినిమాలు చేస్తారనే విమర్శలు ఉన్నా కొత్త సినిమా గురించి ఆలోచించాలంటే కనీసం ఏడాదైనా సమయం కావాలంటారు ఈ దర్శకుడు.

 
నిర్మాతలకు లాభాల భరోసాను ఇచ్చే ఈ దర్శకుడు, డబ్బు సంపాదించమే తన లక్ష్యం కాదంటారు. అలాగని, డబ్బు వద్దనుకునే యోగిని కూడా కానని అంటారు. కానీ, తనతో సినిమా చేయాలనుకునే నిర్మాతలు డబ్బు సంపాదనకంటే, తన కథకు కనీసం ఒక్క శాతం అయినా ఎక్కువ విలువ ఇవ్వాలనుకుంటారు. తనతో పనిచేసే నిర్మాతకు మంచి సినిమా తీయాలనే తపన ఉండాలనుకుంటారు. రాజమౌళి రెమ్యూనరేషన్ ఎంత అనేది కూడా అభిమానులకు ఒక అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ, తనకు నిర్మాతలు ఎంతిస్తారో ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఒక ఇంటర్వ్యూలో తను సినిమా లాభాల్లో పర్సంటేజీ తీసుకుంటానని మాత్రం చెప్పారు.

 
జీవితాశయం మహాభారతం
ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు రాజమౌళి. ఇద్దరు స్టార్ హీరోలను ఆయన ఇందులో నిప్పు, నీరుగా చూపిస్తున్నారు. 'రౌద్రం, రుధిరం, రణం' పేరుతో, బ్రిటిష్ కాలం నాటి ఊహాత్మక కథతో రూపొందించిన ఈ చిత్రంపై ఆయన ఇప్పటికే క్రేజ్ పెంచేశారు. కరోనా వల్ల ఈ సినిమాను అనుకున్న సమయం కంటే చాలా లేటుగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారాయన. మొదట 2017 మార్చి 18న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నట్లు రాజమౌళి, తారక్, రామ్ చరణ్ కలిసి ఒక ఫొటో దిగి ప్రకటించారు. ఆ తర్వాత 2018 మార్చి 22న దీన్ని అధికారికంగా ప్రకటించారు.

 
షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడుతూవచ్చింది. ఈ ఏడాది సంక్రాంతితో పాటు ఆరు సార్లు రిలీజ్ అనుకున్న రాజమౌళి టీమ్ చివరికి మార్చి 25న దీనిని తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ. 300 నుంచి 400 కోట్ల వరకు ఉంటుందని అనుకుంటున్నారు. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్ఆర్ఆర్‌కు టికెట్ల రేట్లు పెంచుకోడానికి అనుమతులు కూడా ఇచ్చారు.

 
మహేష్‌ బాబుతో సినిమా చేయాలని రాజమౌళి ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలయ్యాక కాస్త టైం తీసుకుని ఆ సినిమా కోసం కథా చర్చలు ప్రారంభించాలని అనుకుంటున్నట్లు ఆయన ఇటీవల ఒక చానల్లో కూడా చెప్పారు. మహాభారతం తీయాలనేది ఒక విధంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి ఎన్నోసార్లు చెప్పారు. చిన్నతనం నుంచి విన్న మహాభారత కథలు ఒక మెగా ప్రాజెక్టులా తన మైండ్‌లో నిలిచిపోయాయన్నారు. తన మనసులో అనుకున్నట్టు దానిని తీస్తే అది కనీవినీ ఎరుగని హిట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా కూడా ఉన్నారు.

 
కానీ, అంత పెద్ద ప్రాజెక్టుకు కనీసం పదేళ్లైనా పడుతుందనుకుంటున్న రాజమౌళి ఆ సినిమాకు ముందు స్టార్స్ ఎవరూ అనుకోకుండా, తన పాత్రలకు తగ్గట్టు వారిని ఎంచుకోవాలనుకుంటున్నారు. అంత, టైం పెట్టగలనా అనే సందేహం ఉన్నప్పటికీ దాన్ని కచ్చితంగా చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

పని రాక్షసుడు
అయితే, సినీ పరిశ్రమలోనే ఇంత సక్సెస్ అయిన రాజమౌళిపై విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన తన సినిమాల్లో హింసను అతిగా చూపిస్తారనే విమర్శలు వస్తుంటాయి. సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తుంటాయి. లార్జర్ దాన్ లైఫ్‌గా తెరకెక్కే తన సినిమాల్లో రాజమౌళి సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకుంటారనేది కొందరు సినీ విమర్శకుల అభిప్రాయం. అంతేకాదు, తనకు నచ్చిన సినిమాలు, సీన్లను ఆయన చక్కగా కాపీ కొడుతుంటారనే ఆరోపణలూ ఉన్నాయి. మర్యాద రామన్న, ఈగ చిత్రాల సమయంలో ఈ ఆరోపణలు బాగా వినిపించాయి.

 
ఇక రాజమౌళి అంటే అభిమానులతోపాటూ అందరికీ ఉండే ఫిర్యాదు సినిమాల మధ్య టైం ఎక్కువగా తీసుకుంటారనే. సినిమాకు మినిమం ఏడాది తప్పదనే ఈ దర్శకుడు రెండో సినిమా సింహాద్రికి రెండేళ్లు, యమదొంగ తర్వాత మగధీర విడుదలకు రెండేళ్లు పట్టింది. కానీ, ఈగ విడుదలకు, బాహుబలి-ది బిగినింగ్ రిలీజ్‌కు గ్యాప్ సరిగ్గా మూడేళ్లుంది. తర్వాత దాని సీక్వెల్-ది కంక్లూజన్ తెరపైకి రావద్దవడానికి మరో రెండేళ్లు పట్టింది. ఇలా ఒక్కో సినిమా కోసం చాలా టైం తీసుకుంటున్న రాజమౌళి తన సినిమాకోసం నటీనటుల కాల్షీట్స్ కూడా బ్లాక్ చేసేస్తారనే అపవాదు కూడా ఫేస్ చేస్తున్నారు. అంతేకాదు, రాజమౌళి సినిమాకోసం ఎంత ఉవ్విళ్లూరుతారో, అంతే తీయగా ఆయన టార్చర్‌ను భరిస్తామంటారు చాలా మంది నటీనటులు. సన్నివేశం తనకు నచ్చినట్టు వచ్చేవరకూ రాజమౌళి అసలు వదిలిపెట్టడని చెప్పుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments