Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమానా లేక తమిళ సినిమానా? అభిమానులకు అనుమానం ఇప్పుడెందుకు వచ్చింది?

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (19:17 IST)
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్ ఒక ఇంటర్వ్యూలో 'ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ సినిమా కాదు, తమిళ సినిమా' అన్నారు. దీనిపై ట్విట్టర్‌లో విమర్శలు, జోకులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ప్రియాంక చోప్రా అమెరికాకు చెందిన ఒక పాడ్‌క్యాస్ట్ కార్యక్రమం 'ఆర్మ్‌చైర్ ఎక్స్‌పర్ట్ విత్ డాక్స్ షెపర్డ్'లో మాట్లాడారు. బాలీవుడ్‌లో తన అనుభవాలు, సింగర్‌గా ఎదుగుదల, హాలీవుడ్‌లో ప్రవేశం, నిక్ జోనస్‌తో ప్రేమ, వివాహం మొదలైన విషయాలపై తన ఆలోచనలు, భావాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న డాక్స్ బాలీవుడ్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ ఆర్ఆర్ఆర్ పేరు తీసుకొచ్చారు. వెంటనే ప్రియాంక ఆయన్ను సరి చేస్తూ 'ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ సినిమా కాదు, తమిళ సినిమా' అన్నారు.
 
గతంలో బాలీవుడ్ కొందరి చేతిలోనే ఉండేదని, ఆ పెద్ద మనుషులే సినిమాలు తీసేవారని, వారి చిత్రాలే ఆడేవని చెబుతూ, ఇప్పుడు పరిస్థితి మారిందని, చాలామందికి అవకాశాలు వస్తున్నాయని, ప్రయోగాలు చేస్తున్నారని ప్రియాంక ఆ ఇంటర్వ్యూలో అన్నారు. ఆ సందర్భంలో, 'ఉదాహరణకు ఆర్ఆర్ఆర్' అంటూ డాక్స్ మధ్యలో మాట్లాడారు. వెంటనే ప్రియాంక సవరిస్తూ, 'అది తమిళ సినిమా.. భారీ, మెగా బ్లాక్ బస్టర్ తమిళ సినిమా" అని అభివర్ణించారు. ప్రియాంక మళ్లీ మళ్లీ ఆర్ఆర్ఆర్ తమిళ సినిమా అని చెప్పడంతో, సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. విపరీతంగా మీమ్స్ వస్తున్నాయి.
 
ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయిన దగ్గర నుంచి ప్రియాంక చోప్రా ఆ సినిమాను అమెరికాలో ప్రమోట్ చేస్తూ వచ్చారు. అమెరికాలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శనకు హాజరయ్యారు కూడా. ఆ సందర్భంలో రాజమౌళి, కీరవాణిలతో దిగిన ఫొటో పెట్టి "ఈ అపురూపమైన భారతీయ చలనచిత్రానికి నేను అందించగలిగిన కనీస మద్దతు ఇది. అభినందలు, గుడ్ లక్" అంటూ ట్వీట్ చేశారు. గతంలో ఆమె రామ్ చరణ్‌తో జంజీర్ (2013) అనే హిందీ సినిమాలో నటించారు. తమిళ నటుడు విజయ్‌తో కలిసి తమిళన్ (2002) అనే తమిళ సినిమాలో నటించారు. అలాంటి ప్రియాంక ఆర్ఆర్ఆర్ తమిళ సినిమా అనడం హాస్యాస్పదం అంటూ ట్రోల్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
 
అందరూ మద్రాసీలే
సాధారణంగా, ఉత్తరాది ప్రజలకు దక్షిణ భారత రాష్ట్రాల మధ్య ఉన్న భాషా వ్యత్యాసం, ఆహార వ్యవహారాలపై అవగాహన తక్కువగా కనిపిస్తుంటుంది. దక్షిణాది వారందరినీ 'మద్రాసీలు' అనడం పరిపాటి. అమెజాన్ ప్రైమ్‌లో గతంలో విడుదలైన హిందీ వెబ్ సీరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ సీరీస్-2'లో ఈ విషయంపై కొంత సెటైర్ జోడించారు. ముంబైనుంచి తమిళనాడు వచ్చిన పోలీసులు దక్షిణాది వారందరినీ మద్రాసీలని, దక్షిణాదిన అయిదు రాష్ట్రాల భాష, ఆహారం ఒకటేనని అనడంతో విసుగు చెందిన తమిళ పోలీసులు దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తారు. దిల్లీ లాంటి నగరాల్లో సాధారణ ప్రజలు దక్షిణాదివారిని మద్రాసీలని వ్యవహరించడం తరచుగా కనిపించే విషయమే.
 
కానీ, ప్రముఖ సినిమా నటి అయి ఉండి, తెలుగు, తమిళ నటులతో పరిచయం ఉండి, తమిళంలో ఒక సినిమాలో నటించిన ప్రియాంక చోప్రాకు తెలుగు, తమిళం మధ్య వ్యత్యాసం తెలీకపోవడం ఆశ్చర్యమని సోషల్ మీడియాలో పలువురు విమర్శిస్తున్నారు. ఆమె ఇలాంటి తప్పిదం ఎలా చేయగలరని అటు ఆర్ఆర్ఆర్ అభిమానులూ, ఇటు ప్రియాంక అభిమానులూ వాపోతున్నారు. దక్షిణ భారతదేశంలో అయిదు రాష్ట్రాలు ఉన్నాయని ఉత్తరాది భారతీయులు ఎప్పుడు తెలుసుకుంటారు అంటూ ఒక యూజర్ అసహనం వ్యక్తం చేశారు. "తెలియని వారు తెలుసుకోండి.. ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా" అంటూ సంపత్ కుమార్ అనే యూజర్ వికీపీడియా ఫొటో తీసి పెట్టారు.
 
"ఆర్ఆర్ఆర్ సినిమా తమిళ చిత్రమని ఇప్పుడే తెలిసింది. థాంక్స్ ప్రియాంక" అంటూ మరో యూజర్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. "తమిళ, తెలుగు అభిమానులు కొట్టుకోకండి. సౌత్ సినిమా బాలీవుడ్ మీద సాధించిన విజయం ఇది. దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం" అంటూ ఒక యూజర్ పిలుపునిచ్చారు. "ప్రియాంక చోప్రాలా ఉద్దేశపూర్వకంగా తమిళ సినిమా అని చెప్పేవారి కోసమే రాజమౌళి పబ్లిక్‌లో ఇది తెలుగు సినిమా అని ఎలుగెత్తిచాటారు" అని కృష్ణ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
 
దీనిపై ప్రియాంక చోప్రా నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా రాలేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆమె దృష్టికి వచ్చే ఉండవచ్చు. ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లో నటిస్తున్నారు. ఆమె నటించిన సిటడెల్ అనే వెబ్ సీరీస్ ఏప్రిల్‌లో ఓటీటీలో విడుదల కానుంది. లవ్ ఎగైన అనే సీరీస్ మేలో విడుదల అవుతుంది. అంతకుముందు క్వాంటికో(2015) అనే టీవీ డ్రామలో నటించారు. ఈ సీరీస్ ఆమెకు హాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చిపెట్టింది. 2017లో బేవాచ్ అనే సినిమాతో హాలీవుడ్ సినిమాల్లో అరంగ్రేటం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments