Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్ఞాన్‌వాపి మసీదు: ఫౌంటైన్‌లు కరెంటు లేకుండా ఎలా పని చేస్తాయి, వాటి చరిత్ర ఏంటి?

Webdunia
సోమవారం, 23 మే 2022 (17:11 IST)
వారణాసిలో జ్ఞాన్‌వాపి మసీదు సర్వే విషయంలో మొదలైన వివాదం అక్కడితో ఆగేలా లేదు. మసీదు లోపల శివలింగం ఉందని హిందువుల పక్షం అంటోంది. అది శివలింగం కాదని, వజూ (ప్రార్థనకు ముందు శుద్ధికి ఉపయోగించే కొలను) వద్ద ఉన్న ఫౌంటైన్ అని ముస్లిం వర్గం అంటోంది. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈలోగా, ఇరుపక్షాలూ వాదోపవాదాలు ప్రారంభించాయి. "400 ఏళ్ల క్రితం కరెంటు లేదు. ఔరంగజేబు నోటితో ఊదుతూ ఫౌంటైన్‌లు నడిపించాడా" అంటూ బీజేపీకి చెందిన నిఘత్ అబ్బాస్ ట్వీట్ చేశారు.

 
గురుత్వాకర్షణ శక్తి వలన విద్యుత్తు లేకుండా కూడా ఫౌంటైన్లు నడవడం సాధ్యమని అనీష్ గోఖలే సహా చాలా మంది ఆమెకు సమాధానమిచ్చారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజంగానే విద్యుత్తు లేకుండా ఫౌంటైన్లు పనిచేస్తాయా? ఈ వాదనలో నిజమెంత? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

 
ఫౌంటైన్లు ఎలా పనిచేస్తాయి?
నీరు పల్లానికే ప్రవహిస్తుందన్నది మనకు తెలిసిన విషయమే. దీనికి కారణం గురుత్వాకర్షణ శక్తి. చిన్నపిల్లలు నీళ్ల పైప్‌తో ఆడుకోవడం చూసే ఉంటారు కదా. పైపులోంచి నీళ్లు వస్తున్నప్పుడు ఒకవైపు గట్టిగా నొక్కితే మరో వైపు ఫౌంటైన్‌లా నీరు పైకి ఎగిసి కిందకు పడుతుంది. రబ్బరు పైపుని నొక్కితే, నీళ్ల వేగం పెరుగుతుంది. దాంతో, గొట్టం చివర ఒత్తిడి పెరుగుతుంది. నీళ్లు ఫౌంటైన్‌లా విచ్చుకుని బయటకు వస్తాయి.

 
ఈ టెక్నిక్ ద్వారా తాజ్ మహల్, కాశ్మీర్‌లోని మొఘల్ గార్డెన్స్ లేదా ఎర్రకోటలో ఫౌంటైన్లు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవచ్చు. వీటిలో కొన్ని మీరు చూసే ఉంటారు. ఇవన్నీ కూడా కరెంట్ లేని కాలంలో కట్టినవి. మనకు విద్యుత్ రావడానికి ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినవి. ఫౌంటైన్ తయారీలో, మొదట నీళ్లు ఒకచోట నిల్వ ఉండేలా చూస్తారు. అక్కడి నుంచి ఇరుకైన మార్గాల్లో నీరు ప్రవహించే ఏర్పాటు చేస్తారు. దాని వలన నీటి పీడనం పెరుగుతుంది. వేగంగా ప్రవహించి రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. అదే ఫౌంటైన్. నీటి వేగం, ఫౌంటైన్ డిజైన్ వలన అది ఎంతో అందంగా కనిపిస్తుంది.

 
ఫౌంటైన్ నిర్మాణం
అర్బన్ ప్లానర్ శుభమ్ మిశ్రా ఫౌంటైన్ ఎలా నిర్మిస్తారో వివరించారు. "మొఘలుల కాలంలో ఫౌంటైన్ తయారీకి టెర్రకోట పైపులు ఉపయోగించేవారు. దీనిలో వంపులు ఎంత కచ్చితంగా పెట్టేవారంటే నీటి ప్రవాహానికి ఏ అడ్దంకి ఉండేది కాదు. నేరుగా ఫౌంటైన్ కన్నాల్లోంచి ఎగిసి పడేది. ఫౌంటైన్ నిర్మాణంలో నీటి వేగాన్ని గణించడం చాలా ముఖ్యం. దీనిలో లెక్కలు, క్రమం తప్పకుండా నీరు ప్రవహించడం, ఫౌంటైన్‌లోంచి బయటకు చిమ్మడం.. చాలా అద్భుతమైనది" అని ఆయన వివరించారు. టెర్రకోట అంటే నిప్పుల్లో కాల్చిన మట్టి.

 
"మొఘల్ చక్రవర్తుల భవనాలలో నిర్మించిన ఫౌంటైన్లలో గురుత్వాకర్షణ శక్తి, హైడ్రోలాజికల్ సిస్టంలను ఉపయోగించారు" అని చరిత్రకారుడు రానా సఫవీ చెప్పారు. నీటి వనరుల లభ్యత, వినియోగంపై ఆధారపడే వ్యవస్థ ఇది. నీటి ప్రవాహ ప్రక్రియ (ఫ్లో ప్రోసెస్), భూమి వినియోగం, నేల, వర్షపాతం, బాష్పీభవనం లాంటి అంశాలను పరిగణిస్తారు. "మొఘలుల ఆర్కిటెక్చర్‌లో సమాధి అయినా, మసీదు అయినా దానిలో నీటి కాలువ చాలా ముఖ్యమైనది. సమాధి నాలుగు తోటల మధ్యలో ఉంటుంది. అక్కడక్కడా ఫౌంటైన్లు ఉంటాయి. హుమాయున్ సమాధి, కశ్మీర్‌లో తోటలు ఇలాగే నిర్మించారు. ఎర్రకోటలో నహర్-ఎ-బహిష్ట్ ఉండేది. ఇది ఎర్రకోట అంతటా ప్రవహించేది. దీనికి మధ్య మధ్యలో ఫౌంటైన్లు ఉండేవి. దీని కోసం యమునా నది నుంచి నీటిని సేకరించేవారు. నహర్-ఎ-బహిష్ట్ నుంచి ఫౌంటైన్లలోకి నీరు చేరేది. జామా మసీదులో హౌజ్ (కొలను)కు నీటిని తీసుకురావడానికి రహట్ బావి ఉండేది. అది నేటికీ ఉంది" అని రానా సఫవీ వివరించారు.

 
ఫౌంటైన్ల చరిత్ర
భూమిపై 70 శాతం నీరు ఉంది. కానీ, ఇప్పటికీ నీటి గురించి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మానవులు పరిణామ క్రమంలో నీటిని పలు విధాలుగా ఉపయోంచుకుంటూ వచ్చారు. అవసరానికే కాక అందానికీ నీటిని వినియొగించడం ప్రారంభించారు. ఫౌంటైన్ దీనికి పెద్ద ఉదాహరణ. ప్రపంచంలో తొలి ఫౌంటైన్ల ఆనవాళ్లు మెసొపొటేమియా నాగరికతలో లభ్యమయ్యాయి. ఇవి క్రీ.పూ 3000 కు చెందినవి. మెసొపొటేమియా ప్రాంతం అంటే నేటి ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియా దేశాలున్న భూభాగం. ఇక్కడ ఒక ప్రధాన వనరును ఉపయోగించిన సహజసిద్ధమైన నీటి చెలమ ఏర్పాటుచేశారు. గోర్డాన్ గ్రిమ్లీ రాసిన 'ది ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్' పుస్తకంలో గ్రీకు, రోమన్ శిథిలాలలో కూడా ఇలాంటి వ్యవస్థను కనుగొన్నట్లు చెప్పారు. 15వ శతాబ్దంలో ఇటలీలో యాంత్రికంగా ఫౌంటైన్లు తయారుచేయడం ప్రారంభమైంది.

 
ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఫౌంటైన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి?
ఫౌంటైన్‌లకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఫ్రాన్స్ రాజు 14వ లూయిస్.. రాజకుటుంబాన్ని, తన ఆస్థానంలోని మంత్రులను, శ్రేయోభిలాషులను కూడా కలవరపరిచే నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. ఫ్రాన్స్ అధికార కేంద్రాన్ని పారిస్ నుంచి సుదూరంగా తరలించేందుకు నిర్ణయించుకున్నాడు. అది పారిస్ లాంటి తళుకుబెళుకులేవీ లేని మారుమూల ప్రాంతం. ప్యాలెస్ ఆఫ్ వెర్సైల్స్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన బెంజమిన్ రింగ్ట్ నేషనల్ జియోగ్రఫీ ఛానెల్‌తో ఈ విషయాన్ని పంచుకున్నారు.

 
"లూయిస్ తన కేంద్రాన్ని మార్చాలనుకున్న ప్రాంతం చుట్టూ సముద్రంగానీ, నదులుగానీ లేవు. అక్కడ తన భవనంలో లూయీస్ తోటలు, ఫౌంటైన్లు నిర్మించాలనుకున్నాడు. కానీ, దానికి సరిపడా నీరు లేని ప్రాంతం అది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి బెల్జియం నుంచి ఇంజనీర్లను పిలిపించాడు. పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లు సహాయంతో సుదూరంలో ఉన్న సీన్ నది నుంచి నీటిని తెప్పించారు. ఆ నీటితో ఫౌంటైన్లు నిర్మించారు. వెర్సైల్స్ అద్దాల మహలుతో పాటు లుయీస్ నిర్మించిన ఈ తోట, ఫౌంటైన్ కూడా ప్రసిద్ధి చేందాయి. పర్యటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి" అని బెంజమిన్ రింగ్ట్ వివరించారు.

 
ఇటలీ ఫౌంటైన్‌లకు ప్రసిద్ధి. 'ఫోర్ ఆఫ్ ది ఫోర్ రివర్స్' ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫౌంటైన్. వీటిలో నాణేలు విసిరితే పుణ్యమని, ఆశీర్వాదం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. దీనిని కింగ్ లూయిస్ 14 నిర్మించాడు. ఈ ఫౌంటైన్లు చాలా అందమైనవిగా ప్రసిద్ధి చెందాయి. "ఇటలీలో పూర్వకాలపు ఫౌంటైన్లు చాలా ఉన్నాయి. వాటిలో 'పియజ్జా నవోనా' ఫౌంటైన్ ఒకటి. ఫ్రాన్స్, జర్మనీల్లో కూడా పూర్వ కాలపు ఫౌంటైన్లు చాలా ఉన్నాయి" అని చరిత్రకారుడు ఫిరోజ్ బఖ్త్ అహ్మద్ వివరించారు. కొత్తగా నిర్మించిన పెద్ద పెద్ద ఫౌంటైన్లలో దుబాయ్ ఫౌంటైన్ చెప్పుకోదగ్గది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments