Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప్పు నీరు, అల్లం, హెర్బల్ టీ.. ఉత్తర కొరియాలో కోవిడ్ రోగులకు ఇవే మందులు

north korea president kim
, శనివారం, 21 మే 2022 (23:43 IST)
ఉత్తర కొరియాలో కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తోంది. దేశ జనాభా వ్యాక్సిన్ వేయించుకోలేదు. సమర్థమైన యాంటీ-వైరల్ ఔషధాలు సైతం అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో జనం హెర్బల్ టీ తాగటం, ఉప్పు నీళ్లతో పుక్కిలించటం వంటి ప్రత్యామ్నాయ నివారణ పద్ధతులను పాటించాలని ప్రభుత్వం సలహా ఇస్తోంది.

 
కరోనావైరస్ మహమ్మారి తమ దేశాన్ని తాకకుండా ఉండటం కోసం ఉత్తర కొరియా 2020 ఆరంభంలో దేశ సరిహద్దులన్నిటినీ మూసివేసింది. బయటి నుంచి ఎలాంటి వైద్య సాయమూ అవసరం లేదంటూ ఉత్తర కొరియా నాయకత్వం ఇప్పటివరకూ తిరస్కరిస్తోంది. ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియాను మేం పరిశీలిస్తూ ఉన్నాం. కోవిడ్ వ్యాధిని పరోక్షంగా 'జ్వరం' అని వ్యవహరిస్తూ దానిని ఎదుర్కోవటానికి వివిధ సంప్రదాయ చికిత్సలను ఉపయోగించాల్సిందిగా ప్రభుత్వ మీడియా సిఫారసు చేస్తోంది.

 
హెర్బల్ టీలు
తీవ్రంగా జబ్బుపడని వారు అల్లంతో కానీ హనీసకల్ అనే ఓ విధమైన పూలతో కానీ చేసిన తేనీరు, విల్లో ఆకుల పానీయం వంటివి తాగాలని అధికార పార్టీ వార్తాపత్రిక రోడాంగ్ సిన్మున్ సిఫారసు చేసింది. గొంతులో మంట, దగ్గు వంటి కొన్ని కోవిడ్ లక్షణాలకు టీ తాగటం కొంత ఉపశమనం కలిగించవచ్చు. రోగులు మామూలుగా కన్నా ఎక్కువ ద్రవాలను కోల్పోతున్నపుడు వారి శరీరానికి అవసరమైన నీటిని అందించగలదు. కానీ ఇవి వైరస్‌ను తగ్గించే చికిత్సలు కావు. అల్లం, విల్లో ఆకుల పానీయాల్లో తాపాన్ని, నొప్పిని తగ్గించగలిగే అంశాలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఎటువంటి వేడి పానీయం తాగినా ఇదే ఉపశమనం లభిస్తుంది.

 
ఉప్పు నీటితో పుక్కిలించటం
ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఇటీవల ఒక జంటను ఇంటర్వ్యూ చేసింది. వారు ఉదయం, రాత్రి వేళల్లో ఉప్పునీటితో పుక్కిలించాలని సిఫారసు చేశారు. ఓ 'యాంటీసెప్టిక్ సొల్యూషన్' తయారు చేయటానికి 'వేలాది టన్నుల ఉప్పు'ను ప్యాంగ్యాంగ్‌కు పంపించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ ఒక కథనంలో చెప్పింది. ఉప్పునీటితో పుక్కిలించటం, నాశికా రంధ్రాలను శుభ్రం చేసుకోవటం వల్ల సాధారణ జ్వరానికి కారణమయ్యే వైరస్‌లపై పోరాడటానికి సాయపడవచ్చునని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

 
కానీ దానివల్ల కోవిడ్ వ్యాప్తి నెమ్మదిస్తుందని చెప్పటానికి ఆధారాలు లేవు. కోవిడ్ ప్రధానంగా గాలిలోని సూక్ష్మ బిందువులను నోటి నుంచి కానీ ముక్కు నుంచి కానీ పీల్చుకోవటం వల్ల సోకుతుంది. కాబట్టి ఉప్పునీటిని పుక్కిలించటం అనేది కేవలం ఒక ప్రవేశ మార్గం మీద మాత్రమే దాడి చేస్తుంది. ఈ వైరస్ ఒకసారి లోపలికి ప్రవేశించిన తర్వాత అది రెట్టింపు వేగంతో పెరుగుతూ అవయవాల లోపలివరకూ వ్యాపిస్తుంది. ఎంతగా ఉప్పునీటిని పుక్కిలించినా ఆ నీరు అక్కడి వరకూ చేరదు.

 
పెయిన్‌కిల్లర్లు, యాంటీబయోటిక్స్
రోగులు ఇబూప్రోఫెన్ వంటి నొప్పినివారుణులను, అమోక్సిసిలిన్ వంటి యాంటీబయోటిక్స్‌ను ఉపయోగించాలని ప్రభుత్వ టెలివిజన్ సలహా ఇచ్చింది. ఇబుప్రొఫెన్ (పారాసెటమాల్ కూడా) జ్వరాన్ని తగ్గించగలదు. తలనొప్పి, గొంతు మంట వంటి లక్షణాలకు ఉపశమనం కలిగించగలదు. కానీ అవి వైరస్‌ను తుడిచిపెట్టవు. లేదా వైరస్ పెరగకుండా అడ్డుకోలేవు. యాంటీబయోటిక్స్ అనేవి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు ఉద్దేశించినవి. వైరస్‌ల మీద ఉపయోగించటానికి కాదు. వీటిని ఉపయోగించటం వల్ల బ్యాక్టీరియాలు మందులను తట్టుకునే విధంగా అభివృద్ధి చెందుతాయనే ఆందోళన వల్ల.. యాంటీబయోటిక్స్ ఉపయోగాన్ని నిపుణులు సిఫారసు చేయటం లేదు.

 
కొన్ని యాంటీబయోటిక్స్.. కోవిడ్ సహా కొన్ని రకాల వైరస్‌ల వ్యాప్తిని నెమ్మదింపజేయవచ్చునని లేబరేటరీ పరిశోధనలు సూచిస్తున్నాయి. కానీ ఈ ఫలితాలు వాస్తవ వినియోగంలో కనిపించలేదు. అజిత్రోమైసిన్ అనే యాంటీబయోటిక్ మీద చేసిన ఒక అధ్యయనంలో.. కోవిడ్ లక్షణాల మీద అది ఏమాత్రం ప్రభావం చూపలేదని, ఏదైనా చూపినా అతి స్వల్పంగానే ఉందని గుర్తించారు. కోవిడ్ సోకిన వారు ఆస్పత్రి పాలవకుండా నివారించటానికి కొన్ని ఔషధాలను అనుమతించారు: పాక్సలోవిడ్, మోల్నపిరావిర్, రెమిడిసివిర్ వంటి యాంటీ-వైరల్ ఔషధాలు, మన సొంత రోగనిరోధక వ్యవస్థ తరహాలో పనిచేసే యాంటీబాడీ థెరపీలు. అయితే వాటి ప్రభావశీలతలో తేడాలుంటాయి.

 
బలహీనమైన వైద్య వ్యవస్థ
ఉత్తర కొరియా వైద్య వ్యవస్థను.. గ్రామ స్థాయి నుంచి పట్టణ కేంద్రాల వరకూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రాధమిక సేవలు మొదలుకుని స్పెషలైజ్డ్ చికిత్సల వరకూ అన్నీ ఉచితంగా అందించేలా ఏర్పాటు చేశారు. కానీ ఇటీవలి సంవత్సరాల్లో అంతర్జాతీయ ఆంక్షలు, కరవు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోయింది.
దేశ సరిహద్దులను మూసివేయటం, కఠినమైన లాక్‌డౌన్ చర్యలు కూడా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపాయి.

 
ముఖ్యంగా ప్యాంగ్యాంగ్ నగరం వెలుపల బలహీనంగా ఉండే వైద్య వ్యవస్థలో వైద్య సిబ్బంది, ఔషధాలు, పరికరాల కొరత తీవ్రంగా ఉందని భావిస్తున్నారు. ఉత్తర కొరియాలోని ''ఔషధాల, వ్యాక్సీన్ల, వైద్య పరికరాల తయారీ కర్మాగారాల్లో కొన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేవు. స్థానిక డిమాండ్‌ను కూడా తీర్చటం లేదు'' అని గత ఏడాది ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి చెప్తోంది. దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చిన చాలా మంది ఉత్తర కొరియా పౌరులు.. తమ దేశంలో మందుల కోసం, చికిత్స కోసం డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని కానీ అవి అధికార పార్టీలో ప్రముఖులకే పరిమితమని చెప్పారు. అయితే ఇప్పుడు ఉత్పత్తి పెంచుతున్నామని ప్రభుత్వ మీడియా చెప్తోంది.

 
ఉత్తర కొరియాకు సాయం అందుతోందా?
చైనా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సీన్ 30 లక్షల డోసులను ఉత్తర కొరియా గత ఏడాది తిరస్కరించింది. ప్రపంచ వ్యాక్సీన్ల పంపిణీ పథకమైన కోవాక్స్ కింద అంతర్జాతీయ సమాజం ఇవ్వజూపిన సాయాన్ని కూడా నిరాకరించినట్లు చెప్తున్నారు.
ఉత్తర కొరియాకు వ్యాక్సీన్లు, వైద్య పరికరాలు, సిబ్బందిని అందిస్తామని తాము ప్రతిపాదన పంపించామని, దానికి అటునుంచి ఏ సమాధానమూ రాలేదని దక్షిణ కొరియా తెలిపింది. ఇదిలావుంటే.. చైనాలోని షెన్యాంగ్ నుంచి వైద్య సరఫరాలను తీసుకురావటానికి ఉత్తర కొరియా ఇటీవల మూడు విమానాలను పంపించిందని వార్తలు వచ్చాయి.

 
అందులో ''కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే సరఫరాలు లేవు. కరోనావైరస్ మీద పోరడటానికి ఉత్తర కొరియాతో కలిసి పనిచేయటానికి చైనా సిద్ధంగా ఉంది'' అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్: ‘‘మా టీచర్లను దిల్లీకి పంపిస్తాం.. అక్కడ విద్యా విధానం చాలా బావుంది’’