Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య ఆరోపణలు ఎందుకొచ్చాయి? కారులోనే డెడ్ బాడీ ఎందుకు తీసుకెళ్లారు?

ysrcp flag
, శనివారం, 21 మే 2022 (20:20 IST)
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం మృతి సంచలనంగా మారింది. మృతదేహాన్ని స్వయంగా ఎమ్మెల్సీ తన స్టిక్కర్‌తో ఉన్న కారులో మృతుడి ఇంటికి తీసుకెళ్లడం అనుమానాలు పెంచుతోంది. సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదానికి గురయ్యారంటూ ఎమ్మెల్సీ చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాళ్లు, చేతులు విరిగి ఉన్నాయని, మృతదేహంపై ఇసుక ఉందని చెబుతుండటంతో సందేహాలు పెరుగుతున్నాయి.

 
పైగా మృతదేహం విషయంలో బంధువులతో ఎమ్మెల్సీ తగాదా పడుతున్నట్టుగా సీసీ కెమెరా విజువల్స్‌లో కనిపించింది. కాకినాడ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన పరిణామాలతో శుక్రవారం ఆందోళనలు జరిగాయి. చివరకు పోలీసులు సుబ్రహ్మణ్యానిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాకినాడ టూటౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

 
కారులోకి డెడ్ బాడీ ఎలా వచ్చింది...
మృతుడి(సుబ్రహ్మణ్యం) బంధువులు చెప్పిన వివరాల ప్రకారం.. వీధి సుబ్రహ్మణ్యం (28) కొన్నేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం పెదపూడి మండలం జి.మామిడాడ నుంచి కాకినాడకు వలస వచ్చింది. ఆయన తల్లిదండ్రులు ఓ అపార్ట్‌మెంట్ వద్ద కాపలాగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. సుమారు ఐదేళ్ల పాటు అనంతబాబు వద్ద సుబ్రహ్మణ్యం పనిచేశారు. రెండు నెలల క్రితం మానేశారు. అంతకు కొన్ని నెలల ముందు సుబ్రహ్మణ్యానికి వివాహమైంది. ఆయన భార్య అపర్ణ ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి.

 
"అనంతబాబు వ్యవహారాలన్నీ మా ఆయనకి తెలుసు. అనంత బాబు అక్రమాలు, వివాహాతేర సంబంధాలన్నింటికీ ఆయన ప్రత్యక్ష సాక్షి. అందుకే ఇలా జరిగింది. రాత్రి 10.30 ప్రాంతంలో అనంతబాబు పుట్టిన రోజు వేడుకలకు రమ్మని ఫోన్ వచ్చింది. మణికంఠ అనే వ్యక్తి బైక్ మీద వచ్చి తీసుకెళ్లారు. రాత్రి 12 దాటినా ఇంటికి రాకపోయేసరికి సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేశాం. కాసేపట్లో వస్తానని సమాధానం వచ్చింది. కొంత సేపటికి అనంతబాబు నుంచి ఫోన్ వచ్చింది. బైక్‌పై వెళ్తుండగా కాకినాడ రూరల్‌ మండలం నాగమల్లితోట జంక్షన్‌ వద్ద ప్రమాద జరిగిందని చెప్పారు.

 
12.30 దాటిన తర్వాత డెడ్ బాడీ తీసుకుని మా అపార్ట్‌మెంట్ వద్దకి అనంతబాబు వచ్చారు. ముఖం మీద గాయాలున్నాయి. శరీరం అంతా మట్టి, ఇసుక అంటుకుని ఉంది. అనుమానం వచ్చి నిలదీశాం. మాకు మొదట సర్దిచెప్పారు. తర్వాత తగాదా పడ్డారు" అని బీబీసీతో మృతుని భార్య అపర్ణ తెలిపారు. జరిగిందేదో జరిగిపోయింది, మీకు న్యాయం చేస్తామని అన్నారని... కానీ మళ్లీ వాళ్లు నిలదీయడంతో వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారని అపర్ణ వివరించారు. తన భర్తను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశారని ఆమె ఆరోపిస్తున్నారు.

 
అప్పు తీర్చమని వేధించారు..
తన కుమారుడు రూ. 70 వేలు అప్పుగా తీసుకుని రూ. 50 వేలు తిరిగి చెల్లించారని అయినా తరచుగా బెదిరించేవారని సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఆరోపించారు. "అయిదేళ్లు పనిచేశాడు. ఏ టైమ్ అంటే ఆ టైమ్‌కే వెళ్లేవాడు. ఎక్కడికి అంటే అక్కడికి తీసుకెళ్లారు. అన్నింట్లోనూ ఉపయోగించుకున్నారు. ఆఖరికి రూ. 20వేలు అప్పు ఉందని చెప్పి చాలా సార్లు బెదిరించేవారు. రెండు నెలలుగా కాలుకి దెబ్బ తగిలి ఇంట్లోనే ఉన్నాడు.

 
భార్యకు తోడుగా ఉండాలని పనికి వెళ్లడం మానేశాడు. పుట్టినరోజు ఉందని రమ్మని చెప్పి యాక్సిడెంట్ అంటున్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే మాకు చెప్పాలి కదా.. ఆస్పత్రికి తీసుకెళ్లాలి కదా.. ఏదీ లేకుండా డెడ్ బాడీ మా ఇంటికి తీసుకొచ్చి, మమ్మల్ని కూడా బెదిరించడం ఏంటీ. మాకు న్యాయం కావాలి. మా బిడ్డని ఎవరు చంపారో తేల్చాలి" అంటూ ఆమె బీబీసీతో అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులంతా సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యారని చెబుతున్నారు. అందుకు ఎమ్మెల్సీ అనంతబాబు కారకుడని ఆరోపిస్తున్నారు.

 
రోడ్డు ప్రమాదం జరగలేదు: పోలీసులు
మృతుడి కుటుంబానికి ఎమ్మెల్సీ ఇచ్చిన సమాచారానికి పోలీసుల వాదనకు పొంతన కుదరడం లేదు. నాగమల్లితోట జంక్షన్ సమీపంలో ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ తమతో చెప్పినట్టు కుటుంబ సభ్యులు అంటున్నారు. బైక్ మీద వస్తుండగా కింద పడి మరణించినట్టు అనంతబాబు చెప్పారని మృతుని తల్లిదండ్రులు, భార్య కూడా అంటున్నారు. కానీ ఆ ప్రాంతంలో గురు, శుక్రవారాల్లో ప్రమాదం జరిగిన దాఖలాలు లేవు. ఎటువంటి ప్రమాదాలు జరగలేదని సర్పవరం సీఐ ఆకుల మురళీ కృష్ణ మీడియాకు స్పష్టం చేశారు.

 
రోడ్డు ప్రమాదం జరగలేదని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ చెబుతున్నట్టుగా ప్రమాదం విషయంపై కుటుంబ సభ్యుల అనుమానాలు బలపడుతున్నాయి. ప్రమాదం జరిగితే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కానీ అలా జరగలేదు. కనీసం ప్రభుత్వాసుపత్రికి తరలించాలి. అందుకు విరుద్ధంగా నేరుగా డెడ్ బాడీ తీసుకుని కారులో ఎమ్మెల్సీనే మృతుడి ఇంటికి వెళ్లడం పట్ల అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 
ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ అనంతబాబు వివరణ కోసం బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆయన స్పందించలేదు. కానీ సాక్షి మీడియాలో ఎమ్మెల్సీ వివరణ అంటూ జరుగుతున్న ప్రచారం ప్రకారం... "సుబ్రహ్మణ్యం ఐదేళ్ల నుంచి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల నుంచి సరిగా రావడం లేదు. మద్యం అలవాటు ఉండటంతో అనేకసార్లు ప్రమాదానికి గురయ్యాడు. రాత్రి ప్రమాదం జరిగినట్లు తెలియడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాను. చికిత్స కోసం కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లాం. తల్లిదండ్రులు కూడా వచ్చారు. సుబ్రహ్మణ్యం మృతి చెందడంతో మృతదేహాన్ని కారులో పంపించాను" అని పేర్కొన్నారు.

 
ఎమ్మెల్సీ స్టిక్కర్ ఆ కారుపై స్పష్టంగా కనిపిస్తుండగా, ఎమ్మెల్సీ అనంతబాబు కూడా అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో ఉన్నాయి. డెడ్ బాడీ తీసుకొచ్చిన కారు మాత్రం సామర్లకోటకు చెందిన నీలిమ అనే మహిళ పేరుతో ఉంది. ఆమె అనంతబాబుకి సమీప బంధువుగా దళిత సంఘాల నేతలు చెబుతున్నారు.

 
ఆస్పత్రి వద్ద ఆందోళన, విపక్ష నేతలు సీరియస్
సుబ్రహ్మణ్యం మృతి ఘటనపై పలు దళిత సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు స్పందించాయి. ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించాయి. ఎమ్మెల్సీని అరెస్ట్ చేసిన తర్వాత మాత్రమే శవానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించాలంటూ మృతుని భార్య అపర్ణ సహా పలువురు భైఠాయించారు. మృతదేహాన్ని తరలించే వాహనాన్ని అడ్డుకున్నారు. కొందరు ఆ వాహనం టైర్లలో గాలి కూడా తీసేశారు. చివరకు పోలీసులు మరో వాహనంలో మృతదేహాన్ని మార్చురీకి తరలించాల్సి వచ్చింది.

 
ఆ సమయంలో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వంటి వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతదేహాన్ని పరిశీలించేందుకు కూడా అనుమతించకపోవడం పట్ల మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఈ కేసులో చాలా అనుమానాలున్నాయి. ఎమ్మెల్సీ తీరు సందేహాస్పదంగా ఉంది. పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలి. తక్షణమే అనుమానితులను అదుపులోకి తీసుకోవాలి. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలి. ప్రభుత్వం స్పందించాలి. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఏం చేసినా చెల్లిపోతుందనే రీతిలో వ్యవహరించడం తగదు. మృతదేహాన్ని చూసేందుకు కూడా పోలీసులు అనుమతించలేదు. న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. దళితులకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది" అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.

 
సుబ్రహ్మణ్యం కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నాయకత్వం కూడా స్పందించింది. పలువురు సీనియర్ నేతలతో నిజనిర్ధరణ కమిటీ వేసినట్టు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు ప్రకటించారు.

 
కేసు నమోదైంది.. దర్యాప్తు చేస్తున్నాం
సుబ్రహ్మణ్యాన్ని కాకినాడ బీచ్‌కి తీసుకెళ్లి చంపేశారని అనుమానం వ్యక్తంచేస్తూ తల్లి నూకరత్నం ఫిర్యాదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. తొలుత సర్పవరం పీఎస్‌లో కేసు నమోదు చేశారు. తర్వాత కాకినాడ టూ టౌన్‌కి దానిని బదిలీ చేశారు. ఈ ఘటనపై ఏఎస్పీ శ్రీనివాస్ స్పందించారు.

 
"గురువారం రాత్రి సుబ్రహ్మణ్యం స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లారు. రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో ఉన్నాడని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులకు ఉదయభాస్కర్ సమాచారం ఇచ్చారు. సుబ్రహ్మణ్యం మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధరించిన తర్వాత మృతదేహాన్ని తల్లిదండ్రుల వద్ద ఆయనే వదిలివెళ్లారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం. విచారణ జరుగుతోంది. అనుమానితుల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం" అంటూ ఆయన బీబీసీకి తెలిపారు.

 
శుక్రవారం మార్చురీ వద్ద పెద్ద స్థాయిలో ఆందోళనలు జరగడంతో పోస్ట్ మార్టం జరగలేదు. శనివారం జరిపి, మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భారీ గేట్లు ఏర్పాటు చేశారు. అయితే అనుమానితుడిగా ఉన్న అనంతబాబుని అరెస్ట్ చేయాలని దళిత సంఘాలనేతలు, కుటుంబ సభ్యులు శనివారం కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దళిత నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి ఎంపీకి వీడని కష్టాలు... వారం రోజుల్లో కూల్చివేయాలంటూ...