Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి జిల్లా

Webdunia
శనివారం, 18 జులై 2020 (10:42 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్ సడలింపుల తర్వాత జూన్‌లో కొంత నిలకడగా కనిపించినప్పటికీ జులైలో మాత్రం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గడిచిన పది రోజుల్లో కేసుల సంఖ్య సగటున 2వేలకు పైగా ఉంది. దాంతో పాటుగా మృతుల సంఖ్య కూడా గణనీయంగా నమోదవుతోంది. రాష్ట్రంలో తాజాగా తూర్పు గోదావరి జిల్లా హాట్ స్పాట్‌గా మారింది. ఆ జిల్లాలో కొత్తగా బుధవారం 500 కేసులు, గురువారం 643 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ మళ్లీ అమలులోకి వచ్చింది.

 
పది రోజుల క్రితం ఎలా ఉంది..
పది రోజుల క్రితం.. అంటే జూలై 6వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో నమోదయిన మొత్తం కేసులు 17,365. ఇక 16వ తేదీ నాటికి (17వ తేదీ మధ్యాహ్నం విడుదల చేసిన బులెటిన్ 218 ప్రకారం) ఆ కేసుల సంఖ్య 40,646కి పెరిగింది. అంటే ఈ కాలంలో పెరిగిన కేసుల సంఖ్య 23వేలకు పైనే ఉన్నాయి. సగటున ప్రతిరోజూ 2వేల కేసులు చొప్పున పెరుగుతున్నాయి. ఇక మృతుల సంఖ్యను గమనిస్తే 6వ తేదీ నాటికి 239 మంది మృతులు నమోదయ్యారు. ప్రస్తుతం ఆ సంఖ్య 534. అంటే పది రోజుల వ్యవధిలో 295 మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పాజటివ్ కేసులు వేగంగా పెరగడం, మృతుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుండడం అందరినీ కలచివేస్తోంది. తాజాగా అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా మృతుల సంఖ్య కనిపిస్తోంది.

 
‘సరిహద్దులు తెరవడం వల్లే ఎక్కువ కేసులు’
లాక్ డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రాల సరిహద్దులు తెరిచిన మూలంగానే ఏపీలో కేసులు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కరోనా నివారణ చర్యలపై గురువారం నాడు క్యాంప్ ఆఫీసులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.

 
ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతి రాష్ట్ర సరిహద్దులను తెరిచారు. కాబట్టి రాకపోకలు పెరుగుతాయి. ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌ కూడా తిరుగుతున్నాయి. కేసులు పెరుగుతాయి. అది తప్పదు. ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఎలా అవగాహన కలిగించగలం? వారిలో అవేర్‌నెస్‌ కలిగించామా? లేదా? అన్నదానిపై యంత్రాంగం దృష్టిపెట్టాలి. కోవిడ్‌ రాగానే ఏం చేయాలన్నదానిపై ప్రతి మనిషికీ అవగాహన ఉండాలి. దానికోసం కలెక్టర్లు స్పెషల్‌ డ్రైవ్స్‌ చేయాలి. కోవిడ్‌ నివారణా చర్యలపట్ల కలెక్టర్లు మరింత దృష్టి పెట్టాలి. వ్యాక్సిన్‌ వచ్చేంత వరకూ మనం కోవిడ్‌తో కలిసి జీవించాల్సి ఉంటుంది. కోవిడ్‌ పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయన్న దానిపై అవగాహన కలిగించాలి. 85 శాతం మంది ఇంట్లోనే ఉండి మందులను తీసుకుంటే తగ్గిపోతుంది. కోవిడ్‌ రాగానే వెంటనే మందులు తీసుకుంటే తగ్గిపోతుంది. మన ఇళ్లలో ప్రత్యేక గది లేకపోతే కోవిడ్‌ కేర్‌ సెంటర్లో ఉండొచ్చు’’ అన్నారు.

 
ప్రైవేటు ఆసుపత్రులకు పెరిగిన తాకిడి
కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ విధానం కూడా మారింది. అనేక చోట్ల లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలతో ఉన్న వారిని హోం క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తున్నారు. అయితే బాధితుల్లో ఆందోళన మాత్రం కలవరపెడుతోంది. దాంతో అనేక మంది ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. కానీ అక్కడ మాత్రం చేర్చుకోవడానికి బెడ్లు ఖాళీ లేవని చెబుతున్నారు.

 
ఆసుపత్రులకు వచ్చిన వారిని వెనక్కి తిప్పి పంపితే అనుమతులు రద్దు చేస్తామని సీఎం జగన్ హెచ్చరించారు. కానీ విశాఖలో మూడు ఆసుపత్రులు తిరిగినా తమకు బెడ్ ఇవ్వలేదని సీహెచ్ పద్మారెడ్డి అనే వ్యక్తి బీబీసీకి తెలిపారు. ‘‘మా ఇంట్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. మూడు రోజులుగా హోం క్వారంటైన్ లో ఉన్నారు. కానీ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దాంతో ఆసుపత్రిలో చేర్చాలని మూడు ఆసుపత్రులకు తీసుకెళ్లాం. అన్ని చోట్లా బెడ్స్ ఖాళీ లేవని చెబుతున్నారు. ఏం చేయాలో తెలియక అధికారులను సంప్రదిస్తే విమ్స్ లో చేరాలని సూచించారు’’ అని పద్మారెడ్డి చెప్పారు. విశాఖ కేర్ ఆస్పత్రి పీఆర్వోని బీబీసీ సంప్రదిచినప్పుడు తమ ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీ లేవని ఆయన స్పష్టం చేశారు.

 
హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా కేసు నెల్లూరులో నమోదయ్యింది. ఆ తర్వాత విశాఖలో ఎక్కువ కేసులు వచ్చాయి. కానీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేగంగా పెరిగాయి. ఆ తర్వాత కర్నూలుకి మళ్లింది. ఒక్కసారిగా పెరిగిన కేసులతో ప్రస్తుతం ఆ జిల్లా 4,816 కేసులతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది.

 
కానీ ఇప్పుడు తూర్పు గోదావరి తల్లడిల్లిపోతోంది. పది రోజుల క్రితం.. 6వ తేదీ నాటికి ఆ జిల్లాలో 1778 పాజిటివ్ కేసులున్నాయి. 17వ తేదీ శుక్రవారం ఉదయం రాష్ట్ర కోవిడ్ కంట్రోల్ సెంటర్ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం ఇప్పుడు అవి 4505కి పెరిగాయి. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ విడుదల చేసిన బులిటెన్‌లో తూర్పు గోదావరి జిల్లాలో కేసుల సంఖ్య 4674కి చేరింది. రాష్ట్రంలో కర్నూలు తర్వాత అత్యధిక కేసులున్న జిల్లాగా నిలిచింది.

 
ఒక్కరోజులో 792 పాజిటివ్ కేసులు రాగా గురువారం నాడు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 182గా ఉందని జిల్లా కలెకర్ట్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘జిల్లాలో కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వలసలే. దానిని అదుపు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షలు పెంచాము. సంజీవిని బస్సుల ద్వారా అన్ని ప్రధాన పట్టణాల్లో పరీక్షలు జరుగుతున్నాయి.


కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటుగా జిల్లా అంతటా లాక్ డౌన్ అమలు చేస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకూ మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. బ్యాంకులు, ప్రభుత్వ కార్యకలాపాలు మినహా ఇతర సంస్థలన్నీ మూతపడతాయి. ప్రజలందరూ సహకరిస్తే కరోనా నియంత్రణ సాధ్యం అవుతుంది. ఇప్పటికే జి మామిడాడ లాంటి కొన్ని గ్రామాల్లో హఠాత్తుగా పెరిగిన కేసులను అదుపులోకి తీసుకొచ్చాం. ఆ అనుభవంతో ఇప్పుడు మిగిలిన ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్న తరుణంలో అదుపుచేయడానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నాం అని వివరించారు.

 
యాక్టివ్ కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాదే మొదటి స్థానం
మొత్తం కేసులలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ యాక్టివ్ కేసుల్లో మాత్రం తూర్పు గోదావరి ప్రధమ స్థానంలో ఉంది. కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రానికి మరో 202 మంది డిశ్చార్జ్ కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3008కి పెరిగింది. ఆ జిల్లాలో యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2691గా ఉన్నాయి. కానీ తూర్పు గోదావరిలో మాత్రం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1132మాత్రమే. దాంతో ఏపీ ప్రభుత్వ బులిటెన్ 218 ప్రకారం ఆ జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 3339గా ఉంది. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

 
ఇప్పటికైనా కరోనా నియంత్రణ కోసం తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తం కావాలని రాజమహేంద్రవరానికి చెందిన సామాజికవేత్త తాళ్లూరి రవిరాయల్ వ్యాఖ్యానించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు.మొన్న ఒకే బ్యాంకులో 16 కేసులు వచ్చాయి. గురువారం ఒక్కరోజే రాజమహేంద్రవరంలో 78 కేసులు వచ్చాయి. సామాజిక వ్యాప్తి దిశగా పయనిస్తోందా అనే ఆందోళన అందరిలో మొదలయ్యింది. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక వారం లేదా పది రోజులు పూర్తి లాక్ డౌన్ చేయాలి.. లేకపోతే పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. మొబైల్ వ్యాన్ లు ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచారం చేయాలి. పోలీసులు పెట్రోలింగ్ పెంచాలి. అప్పుడు మాత్రమే జిల్లాలో పరిస్థితి అదుపులోకి వస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments