Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ కోడెల శివప్రసాద్: ప్రేమాస్పదుడు - వివాదాస్పదుడు

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (22:25 IST)
కోడెల శివప్రసాదరావు చనిపోయారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నట్టు హైదరాబాద్ వెస్ట్ డీసీపీ వెల్లడించారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేగానీ కోడెల మృతి వివరాలు స్పష్టం కావు. కోడెల శివప్రసాదరావు ఒకరు కాదు ఇద్దరని సన్నిహితులు అంటుంటారు. వైద్యునిగా ఆయన రోగులకు గొప్ప ప్రేమాస్పదులు కానీ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదులు.

 
కోడెల బాల్యంలోనే ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు స్మాల్‌ పాక్స్‌తో ఓ వారం వ్యవధిలో చనిపోయారు. ఆ సంఘటన శివప్రసాద రావును కలచివేసిందని, దాని ప్రభావంతోనే ఆయన కసిగా వైద్య విద్యను చదివారని అంటారు. కర్నూలు, గుంటూరు, వారణాసిల్లో వైద్యవిద్యను అభ్యసించిన కోడెల.. నరసరావుపేటలో సర్జన్‌గా స్థిరపడ్డారు. శివప్రసాదరావు స్కాల్పెల్ బ్లేడు పట్టుకుంటే శస్త్ర చికిత్స విజయవంతం అయినట్టేనని జనం చెప్పుకునేవారు. ఆయన హస్తవాసి గురించి నరసరావుపేట పరిసరాల్లో కథలు కథలుగా చెప్పుకునేవారు.

 
ఎన్‌టీ రామారావు 1982లో తెలుగు దేశం పార్టీని పెట్టినప్పటి నుంచీ కోడెల అందులో చురుకైన కార్యకర్తగా ఉన్నారు. వైద్యరంగంలో కోడెలకున్న మంచి పేరును చూసిన ఎన్టీఆర్ ఆయన్ను పిలిచి టిక్కెట్టు ఇచ్చారని అంటారు. రాజకీయాల్లోకి ప్రవేశించాక కోడెల శివప్రసాద్ క్యారెక్టర్ మారిపోయింది. డాక్టరుగా స్కాల్పెల్ బ్లేడు వాడినంత నైపుణ్యం ఆయనకు కత్తులు, కఠార్లు తిప్పడంలోనూ ఉండేదని అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

 
అప్పట్లో నరసరావుపేట నియోజకవర్గం కమ్మ-రెడ్డి సామాజికవర్గాల కుమ్ములాటలకు నిలయంగా ఉండేది. సరసరావుపేట పరిసరాల్లో అనేక ఫ్యాక్షన్ గ్రామాలుండేవి. బాంబు దాడులు, హత్యల సంస్కృతి కొనసాగేది. కోడెల కమ్మ సామాజికవర్గానికి రాజకీయ ప్రతినిధిగా ఉండేవారు. క్రమంగా ఆయన కూడా ఫ్యాక్షన్ నాయకుడనే ముద్రను వేయించుకున్నారు. ఆయన ఇంటి పెరట్లోనే బాంబుల గిడ్డంగి ఉండేదని ఒక దశలో పెద్ద ప్రచారం సాగింది.

 
కోడెల 1987-88లలో రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. ఆ కాలంలో ఆయన పాత్ర మరింత వివాదాస్పదమైంది. ఆయన ఇంటి పెరట్లోనే బాంబులు పేలి నలుగురు చనిపోయిన సంఘటన అప్పట్లో రాజకీయ రంగంలో పెద్ద దుమారం రేపింది. కోడెల హోంమంత్రిగా ఉన్న కాలంలోనే ఆయన మీద ఒకసారి బాంబుదాడి జరిగింది. ఇంకోసారి యాసిడ్ దాడి జరిగింది. ఆ దాడుల్లో ఆయన స్వల్ప గాయాలతో తప్పించుకోగలిగారు. టీడీపీలో ఆయన ఎన్టీఆర్‌కు, ఆ తర్వాత చంద్రబాబుకూ అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఎన్టీ రామారావు హయాంలో పంచాయతీరాజ్, నీటి పారుదల శాల మంత్రిగానూ ఆయన పనిచేశారు.

 
1988 డిసెంబరు 26న విజయవాడలో వంగవీటి మోహన రంగా హత్య జరిగినపుడు కోడెల శివప్రసాదరావే రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. ఎన్టీ రామారావు, కోడెల శివప్రసాద్ కుట్ర చేసి రంగాను హత్య చేసినట్టు కాపు సామాజికవర్గం నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు ఆయన రాజకీయ జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయలేదు. 1983 నుంచి 1999 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఐదు శాసన సభ ఎన్నికల్లోనూ కోడెల నరసరావుపేట నియోజకవర్గం నుంచి వరుసగా ఘనవిజయాలు సాధించారు. అయితే, వైఎస్ రాజశేఖర రెడ్డి గాలి బలంగా వీచిన 2004, 2009 ఎన్నికల్లో ఆయన వరుస పరాజయాలను చవిచూశారు.

 
రాజకీయాల్లో కోడెల ప్రత్యర్ధుల మీద ఒంటికాలితో లేచేవారు. ఎలాంటి సంకోచం లేకుండా తీవ్ర ఆరోపణలు చేసేవారు. రెండు శరీరాలు - ఒకే ఆత్మలా కొనసాగిన వైఎస్ రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావుల మీద తరచూ విరుచుకుపడేవారు. ఒకసారి ఆయన వైఎస్‌ఆర్‌ను జయలలితతోనూ, కేవీపీని శశికళతోనూ పోల్చడంతో పెద్ద దుమారం రేగింది. ఆ తరువాత వైఎస్ కక్షగట్టి తనను వేధించారని కోడెల అనేవారు. వైఎస్ హయాంలోనే కోడెల భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. ఆయితే ఆ కేసు చివరకు న్యాయస్థానాల్లో నిలవలేదు. కోడెలకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

 
2014 ఎన్నికల్లో నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నియోజకవర్గానికి మారిన కోడెలకు విజయం దక్కింది. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వంలో సహజంగానే ఆయన మంత్రి పదవిని ఆశించారు. కానీ చంద్రబాబు ఆయన్ను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. "ప్లేయర్ కావలసినవాడిని అంపైర్‌గా మార్చారు" అని కోడెల కొంచెం నొచ్చుకున్నారని అంటారు.

 
శాసన సభ స్పీకర్‌గా కోడెల హుందాగా వ్యవహరించలేదనే విమర్శలున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కసిని ఆయన కుమారుడు వైఎస్ జగన్ మీద తీర్చుకున్నారనిపిస్తుంది. హోంమంత్రిగా విపక్షాల మీద ఒంటి కాలి మీద లేచినట్లే స్పీకర్‌గానూ ప్రతిపక్షం మీద ఒంటికాలి మీద లేచేవారు. కోడెల వ్యవహారశైలి వల్లే తాము శాసన సభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో జగన్ ప్రకటించారు.

 
రాష్ట్రంలో తెలుగు దేశం పతనం కోడెలతోనే ఆరంభం అయిందంటే అతిశయోక్తి కాదు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును రంగంలోనికి దింపింది వైఎస్సార్‌సీపీ. నరసరావుపేటలో రెడ్డి సామాజికవర్గం కోడెలకు వ్యతిరేకంగా ఏకం అయినట్టే సత్తెనపల్లి నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఆయనకు వ్యతిరేకంగా ఏకం అయింది.

 
పోలింగు రోజు రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామ పోలింగ్ బూతుకు ఓట్ల సరళిని పరిశీలించడానికి వెళ్లిన కోడెల మీద స్థానికులు దాడి చేశారు. ఒక గదిలో ఆయన్ను బంధించారు. చేయిచేసుకున్నారు. ఆ కుమ్ములాటలో కోడెల చొక్కా కూడా చిరిగిపోయింది. ఓ పదేళ్ల క్రితం వరకు తాను గడగడలాడించిన పల్నాడు ప్రాంతంలోనే తనకు ఇంతటి పరాభవం జరుగుతుందని కోడెల కలలో కూడా ఊహించి ఉండరు. ఎన్నికల పండితులు ఆరోజే చెప్పేశారు.. టీడీపీ చిత్తుగా ఓడిపోయి వైసీపీ ఘనవిజయాన్ని సాధిస్తుందని. అదే జరిగింది.

 
అసెంబ్లీలో ఫర్నిచర్ మాయం కేసు కోడెల మెడకు ఎంతగా చుట్టుకుందోగానీ ఆయన పరువును మాత్రం నరసరావుపేట మురుగుకాలవలో పడేసింది. అసెంబ్లీ స్పీకరుగా ఐదేళ్లు పని చేసిన వ్యక్తి మీద ఫర్నిచరు దొంగతనం కేసు రావడం చాలా ఇబ్బందికర వ్యవహారమే. అసెంబ్లీ అధికారులు కోడెల ఇంటిని సోదా చేసేందుకు రావడానికి కొద్ది నిముషాల ముందు ఆయన ఇంటిలోని రెండు కంప్యూటర్లను దుండగులు ఎత్తుకు పోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది.

 
మరోవైపు, గుంటూరు నగరంలో కోడెల కుమారుడికి చెందిన బైక్స్ షోరూమ్ ఇంకో పెద్ద వివాదంలో ఇరుక్కుంది. కొత్త వాహనాలకు టీఆర్ లేకుండానే అమ్ముతున్నారనే అభియోగం మీద ఆ షోరూముపై రవాణాశాఖ అధికారులు దాడులు చేశారు. ఈలోగా ఇంకో స్కామ్ జరిగిందనే వార్తలు గుప్పుమన్నాయి. అసెంబ్లీలోనూ, స్పీకర్ కొడుకు షోరూమ్‌లోనూ ఒకే రకం ఫర్నిచర్, ఏసీ మెషీన్లు ఉండడం ఈ అనుమానాలకు తావిచ్చింది.

 
ఇదిలా ఉండగా, ఆరోగ్యశ్రీ జాబితాలో పెడతానని కోడెల కుమార్తె విజయలక్ష్మి ఒక నర్సింగ్ హోమ్ నిర్వాహకుల వద్ద నాలుగు లక్షల రూపాయలు లంచంగా తీసుకుని మోసం చేశారని 420 కేసు నమోదైంది. తననూ తన సంతానాన్ని సైతం కేసులు చుట్టుముట్టి వీధుల్లోనికి లాగడంతో కోడెల హతాశులైపోయారు. తెలుగు దేశం పార్టీ, నాయకులు సైతం తనకు నైతిక మద్దతునివ్వడానికి ముందుకు రావట్లేదంటూ కోడెల మానసికంగా కుంగిపోయారని సన్నిహితులు చెబుతుంటారు.

 
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కేసుల పేరిట తనను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని ఇటీవల ఆయన బహిరంగంగానే ఆవేదన వెలిబుచ్చారు. అయితే కేసులకు భయపడి జీవితాన్ని చాలించే స్వభావం కాదు ఆయనది. కుటుంబ అంతర్గత వివాదాలు సైతం ఆయనను కుంగదీశాయనే మాట కూడా గట్టిగానే వినపడుతోంది. ఆ వివరాలు బయటికి వచ్చాకే ఆయన మృతి మీద ఒక స్పష్టత వస్తుంది.

 
రాజకీయాల్లో ఆయన పాత్ర ఎంతటి వివాదాస్పదం అయినప్పటికీ వైద్యరంగంలో ఆయన పాత్ర మహత్తరమైనది. నరసరావుపేటలో అప్పట్లో ఆయన అందించిన వైద్య సేవలు ఒక ఎత్తు అయితే, హైదరాబాద్‌లో బసవతారకం కేన్సర్ హాస్పిటల్ ట్రస్టు వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఆయన అందించిన వైద్య సేవలు మరో ఎత్తు. రాజకీయాల్లో వివాదాస్పద నాయకునిగా, వైద్యరంగంలో ఒక సేవాతత్పరునిగా కోడెల గుర్తుంటారు.
 
డానీ
బీబీసీ కోసం
(వ్యాసకర్త అభిప్రాయాలు వ్యక్తిగతం)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments