Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తింటే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి, నపుంసకత్వం వస్తుందా? ఈ ప్రచారంలో నిజమెంత?

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (13:48 IST)
మనలో చాలామందికి 'బిర్యానీ' అనే మాట వింటేనే నోరు ఊరుతుంది. ఈ బిర్యానీలో హైదరాబాద్ బిర్యానీ, దిండిగల్ బిర్యానీ, అంబూర్ బిర్యానీ, మలబార్ బిర్యానీ, తాళప్పకట్టి బిర్యానీ, మండీ బిర్యానీ లాంటి అనేక రకాలు ఉన్నాయి. కుండ బిర్యానీ, బొంగు బిర్యానీ, కొబ్బరి చిప్ప బిర్యానీ వంటి కొత్త రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పర్షియాలో పుట్టిన బిర్యానీ, ఇప్పుడు కేవలం ఇండియాలోనే కాక, అమెరికా, అప్గానిస్తాన్, ఇరాన్, థాయిలాండ్, దక్షిణాఫ్రికాలలో కూడా ప్రాచుర్యం పొందింది.

 
ఇండియాలో జొమాటో, స్విగ్గీలాంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లలో బిర్యానీయే మోస్ట్ ఫేవరేట్ ఫుట్ ఐటమ్ అని నివేదికలు చెబుతున్నాయి. నగరాల నుంచి గ్రామాల వరకు బిర్యానీ ఇప్పడు అందరికీ ప్రియమైన వంటకం. కేవలం బిర్యానీ పాయింట్లు పెట్టి ధనవంతులైన వాళ్లు ఉన్నారు. మటన్, చికెన్ బిర్యానీ రకాలను చాలామంది ఇష్టపడుతుంటారు. పనీర్, వెజిటబుల్, మష్రూమ్, ఫిష్ బిర్యానీ రకాలు కూడా ఉంటాయి. కానీ, ఇక్కడ బిర్యానీ గురించి చెప్పబోతున్న విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే బిర్యానీ రుచికి మైమరిచిపోయి తినడమేగానీ, దాని సైడ్‌ ఎఫెక్ట్స్ గురించి చాలామంది పట్టించుకోరు.

 
బిర్యానీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
గత కొన్నిరోజులుగా, సోషల్ మీడియాలో బిర్యానీ గురించి తెగ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా బిర్యానీ తింటే నపుంసకత్వం వస్తుందన్నఅంశంపై ఈ చర్చ ఎక్కువగా నడుస్తోంది. దీనిపై బీబీసీ కొంతమంది వైద్య నిపుణులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని సేకరించింది. ''మనం బిర్యానీ తయారు చేసేటప్పుడు 1:1 నిష్పత్తిలో అంటే కేజీ చికెన్‌కు, కేజీ బియ్యం వేసి వండుతాం. అంటే ఒక ప్లేట్ మటన్ బిర్యానీ తింటే మనం 943 కేలరీలు, అదే ప్లేట్ చికెన్ బిర్యానీ తింటే 850 కేలరీలు మన శరీరంలోకి వెళతాయి'' అని పోషకాహార నిపుణురాలు ధరణి కృష్ణన్ అన్నారు.

 
''ఇవన్నీ మనం బిర్యానీలో వాడే మాంసం, నూనె, మసాల దినుసులలోని ఫ్యాట్ నుంచి వస్తాయి. కానీ రెస్టారెంట్లలో, మాంసం తక్కువగా, మసాలాలు, బియ్యం ఎక్కువగా వేస్తారు. రుచి కోసం బిర్యానీని బయట తింటే ఎక్కువ కేలరీలు, తక్కువ ప్రొటీన్లు అందుతాయి. చికెన్‌తో పోలిస్తే, మటన్‌లో ఎక్కువ కొవ్వు, తక్కువ ప్రొటీన్ ఉంటుంది. ఎక్కువ మాంసం కలిపితే ప్రొటీన్లు ఎక్కువ వస్తాయి. కానీ హోటల్ బిర్యానీల్లో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఎక్కువగా లభిస్తాయి'' అని ఆమె అన్నారు.

 
మనకు రోజుకు 1500-1800 కేలరీలు అవసరమని, బిర్యానీ తింటే మనకు 900 కేలరీలు లభిస్తాయని కృష్ణన్ వెల్లడించారు. "బిర్యానీతో పాటు జీర్ణక్రియ కోసం మనం కూల్‌డ్రింక్స్ కూడా తీసుకుంటాం. దానివల్ల ఎక్కువ కేలరీలు జోడవుతాయి. ఇవి సమస్యాత్మకం కావచ్చు"అని ధరణీ కృష్ణన్ అన్నారు. ప్రజలు అన్ని కేలరీలు తిని దాన్ని బర్న్ చేయడానికి తగినంత వ్యాయామం చేయరని ఆమె అన్నారు. "ఈత కొట్టడం, నడవడం ద్వారా మనం గరిష్టంగా 300 కేలరీలు బర్న్ చేయవచ్చు. వ్యాయామం చేయకపోతే శరీరపు బరువు పెరిగి గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి'' అని ఆమె వెల్లడించారు.

 
'వీర్యకణాలు తగ్గుతున్నాయి'
ప్రస్తుత ఆహారపు అలవాట్లలో సమతుల ఆహారం, కూరగాయలు, పండ్లు తక్కువగా ఉండటం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల స్థూలకాయం తద్వారా వీర్యకణాల క్షీణత వంటి సమస్యలు సహజంగా సంభవిస్తాయి. ''ఒకప్పుడు పెళ్లిళ్లు, పండగల సమయంలోనే కనిపించే బిర్యానీ, ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. కొందరికి వారంలో రెండు మూడుసార్లు తినే అలవాటుంటే, మరికొందరికి వారమంతా తినే అలవాటు ఉంటుంది. అందువల్ల అదనపు కేలరీలను బర్న్‌ చేయకపోతే ఊబకాయం వస్తుంది. దీని వల్ల వీర్యకణాలు తగ్గుతాయి. అయితే వీర్యకణాలలో తగ్గుదల కేవలం బిర్యానీ వల్లనే రాదు. కాకపోతే ఎక్కువగా బిర్యానీ తినేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి బిర్యానీ తింటే పెద్దగా సమస్య ఉండదు. వారానికి రెండుసార్ల కంటే ఎక్కువగా బిర్యానీ తినేవారు జాగ్రత్త పడాలి'' అని ధరణీ కృష్ణన్ అన్నారు.

 
''శాస్త్రీయ ఆధారాలు లేవు''
''బిర్యానీ తినడం నపుంసకత్వానికి, వీర్యకణాల క్షీణతకు కారణం అనే దానిపై శాస్త్రీయ లేదా పరిశోధన ఆధారిత డేటా లేదు. ఇందులో వాస్తవం లేదు. బిర్యానీలో కూడా ఇతర ఆహార పదార్థాలలో ఉండే పదార్ధాలే ఉంటాయి. వీర్య కణాలు తగ్గిపోయే అవకాశం ఉండదు'' అని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సెక్సువల్ ఫిజీషియన్స్ అధ్యక్షుడు డాక్టర్ డి.కామరాజ్ బీబీసీతో అన్నారు. ''ఊబకాయం వల్ల వీర్యకణాలు తగ్గిపోతాయి. ఇది వివిధ అధ్యయనాలలో రుజువైంది. అందువల్ల ఊబకాయం ప్రమాదకరమని చెప్పవచ్చు. అంతే తప్ప బిర్యానీ తింటే వీర్యకణాలు తగ్గిపోతాయని, నపుంసకత్వం వస్తుందని చెప్పడానికి లేదు. శాకాహారం తినేవారు కూడా స్థూలకాయులవుతారు. వారికి కూడా వీర్యకణాలు తగ్గే అవకాశం ఉంది'' అని కామరాజ్ అన్నారు.

 
"స్థూలకాయానికి అవకాశం"
''స్థూలకాయం మహిళలలో గర్భం దాల్చే అవకాశాన్ని 3 రెట్లు తగ్గిస్తుంది. పురుషులలో స్పెర్మ్‌కౌంట్ పై ప్రభావం చూపుతుంది. అయితే స్థూలకాయానికి చాలా కారణాలున్నాయి. బిర్యానీ ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం వస్తుంది'' అని డాక్టర్ కామరాజ్ చెప్పారు. అదే విధంగా ఇటలీ ఆహారం అత్యుత్తమం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు డాక్టర్ కామరాజ్. ''ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాంటిదేమీ చెప్పలేదు. కూరగాయలు, పండ్లతో సహా మధ్యధరా ఆహారాన్ని తీసుకోవడం మంచిది'' అని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం