Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌లు.. ప్రపంచం మొత్తానికీ పాకుతాయా? మరో సంక్షోభం ముంచుకొస్తుందా?

చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌లు.. ప్రపంచం మొత్తానికీ పాకుతాయా? మరో సంక్షోభం ముంచుకొస్తుందా?
, శుక్రవారం, 18 మార్చి 2022 (20:27 IST)
యుద్ధం. ద్రవ్యోల్బణం. ఇప్పుడు చైనాలో లాక్‌డౌన్. ప్రపంచమంతటా సరకులను సరఫరా చేసే వ్యవస్థకు ఇది పెను తుపాను. చైనాలో ఏవైనా సమస్యలు మొదలైతే అది చాలా కీలకమైన విషయమవుతుంది. ఎందుకంటే ప్రపంచ తయారీ సామర్థ్యంలో మూడో వంతు ఈ దేశంలోనే నెలకొని ఉంది. మనం ఏదైనా ఆన్‌లైన్‌లో కొంటున్నామంటే.. అది షెన్‌జెన్‌లో తయారయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆగ్నేయ చైనాలోని 1.75 లక్షల మంది జనాభా గల ఈ నగరంలోనే.. చైనా ఆన్‌లైన్ రిటైల్ ఎక్స్‌పోర్టర్లు సగం మంది ఉన్నారు.

 
కోవిడ్ కేసులు భారీగా పెరగటంతో గత ఆదివారం నుంచి షెన్‌జెన్‌లో ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. ఇది ప్రపంచ వాణిజ్య వర్గాల్లో ప్రకంపనలు పుట్టించింది. ఈ కోవిడ్ ఆంక్షలను ఆ తర్వాత షాంఘై, జిలిన్, ఘ్వాంఘ్జో వంటి ప్రధాన నగరాలు, ప్రావిన్సులకూ కూడా విస్తరించారు. ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిపివేయాల్సి వచ్చింది. నగరాలు నిర్మానుష్యంగా మారాయి.

 
చైనాలోని కొన్ని ఓడరేవుల్లో నిరీక్షిస్తున్న నౌకల సంఖ్య ఇప్పటికే పెరిగిపోయిందని.. ప్రపంచ వ్యాప్తంగా సరకు రవాణా ఎలా జరుగుతోందో పరిశీలించే ప్రాజెక్ట్44 అనే సంస్థ చెప్తోంది. ''యూరప్, ఉత్తర అమెరికాలకు ఎగుమతులు జరిగే ప్రధాన నౌకాశ్రయం యాంతియాన్ ఓడరేవు వెలుపల వేచివున్న నౌకల సంఖ్య 28.5 శాతం పెరిగింది'' అని ప్రాజెక్ట్44 సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆడమ్ కాంపెయిన్ చెప్పారు. ఇదే యాంతియాన్ పోర్టును గత ఏడాది కోవిడ్ కారణంగా మూసివేసినపుడు.. క్రిస్టమస్ సమయంలో సరఫరాలు చాలా ఆలస్యమయ్యాయి.

 
ఫిబ్రవరిలో చైనా చాంద్రమాన నూతన సంవత్సర వేడుకల తర్వాత.. చైనా ఉత్పత్తి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో మళ్లీ లాక్‌డౌన్లు అమలులోకి తెచ్చారు. చైనా కోవిడ్ ఆంక్షలు కఠినంగా ఉన్నప్పటికీ.. కనీసం చాలా లాక్‌డౌన్లు మరీ ఎక్కువ కాలం కొనసాగవు. ''అది రెండంచుల పదునున్న కత్తి. చైనా చాలా వేగంగా స్పందిస్తుంది. అది వ్యవస్థలకు భారీ ఆటంకాలు కలిగిస్తుంది. మళ్లీ అదే రీతిలో పరిస్థితులు కూడా చాలా వేగంగా సాధారణ స్థితికి తిరిగొస్తాయి'' అంటారు బ్రిటిష్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైనా మేనేజింగ్ డైరెక్టర్ స్టీవెన్ లించ్.

 
ఈసారి కంపెనీలు కూడా కొంచెం మెరుగ్గా సంసిద్ధమై ఉన్నట్లు కనిపిస్తోంది. ''మేం ఇంతకుముందు కూడా ఈ లాక్‌డౌన్లు చవిచూశాం. కాబట్టి కంపెనీలు సరఫరా వ్యవస్థ నిర్వహణను బలోపేతం చేశాయి'' అని లించ్ వివరించారు. ఉదాహరణకు.. ఇంతకుముందు ఒమిక్రాన్ కేసులు పెరిగినపుడు ఏవైనా ఆటంకాలు ఎదురయ్యేటట్లయితే దానిని పూడ్చటానికి.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, చైనాలో తయారయ్యే సరకులను మరింత ఎక్కువగా కొనుగోలు చేసి పెట్టుకుంది. కాబట్టి తాజా ఆంక్షల వల్ల తన సరఫరా వ్యవస్థకు పెద్ద ఇబ్బందులేవీ రాబోవని ఆ సంస్థ భావిస్తోంది.

 
''అందుబాటులో ఉన్న మా సరకులను ఈ ప్రాంత పరిసరాల్లోని గిడ్డంగులకు మళ్లించటం ద్వారా.. ఈ లాక్‌డౌన్లను మేం ఎదుర్కోగలిగాం'' అని అమెజాన్ అధికార ప్రతినిధి ఒకరు బీబీసీకి చెప్పారు. యాపిల్ సంస్థ కోసం ఐఫోన్లు తయారు చేసే ఫాక్స్‌కాన్ మరో ఉదాహరణ. ఆ సంస్థ ఉత్పత్తిని ఇతర తయారీ కేంద్రాలకు మార్చటానికి ప్రయత్నించింది. పనిచేసే దగ్గరే నివసించే కార్మికులను.. షిఫ్టుల వారీగా పనిచేస్తూ ఉత్పత్తిని నిరంతరం కొనసాగించాలని కోరింది.

 
అయితే.. ''ఫాక్స్‌కాన్ సంస్థకు అది సులభం కావచ్చునేమో. కానీ చాలా మంది ఉత్పత్తిదారులు ఇతర విభాగాలు వచ్చే వరకూ ఆగాల్సి ఉంటుంది. ఆ భాగాలు ఎక్కువగా అదే ప్రాంతం నుంచి వారికి అందాల్సి ఉంటుంది. కాబట్టి వారు ఉత్పత్తిని వేరే చోటుకు మార్చటం చాలా కష్టం. ఎందుకంటే చైనా లోపలి రవాణా వ్యవస్థకు కూడా ఆటంకాలు ఎదురుకావచ్చు'' అని హాంగ్ సెంగ్ బ్యాంక్ చైనా చీఫ్ ఎకానమిస్ట్ డాన్ వాంగ్ పేర్కొన్నారు.

 
చైనా నుంచి ‘మారుతున్న’ ఆలోచనలు
ఈ పరిస్థితి కారణంగా.. జీరో-కోవిడ్ - అంటే కరోనావైరస్‌ను సమూలంగా నిర్మూలించాలనే చైనా వ్యూహం మరోసారి చర్చనీయాంశంగా మారింది. చైనా ఈ విధానానికి కట్టుబడి ఉంటుందని దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్ గురువారం నాడు ఉన్నతస్థాయి నాయకుల సమావేశంలో చెప్పారు. అయితే.. కోవిడ్ కట్టడి చర్యలు ఆర్థికరంగాన్ని బాధించకూడదని కూడా ఆయన ఉద్ఘాటించారు. చైనా తన జీరో కోవిడ్ వ్యూహాన్ని కొనసాగించినట్లయితే.. చైనా ఆర్థిక వ్యవస్థకు, దాని సరఫరాలు అందుకోవాల్సిన ప్రపంచ వినియోగదారులకు నిజమైన నొప్పి కలుగుతుంది.

 
ఈ వ్యూహం వల్ల దీర్ఘకాలిక మూల్యాలూ చెల్లిస్తున్న సంకేతాలు కూడా ఉన్నాయి. దీంతో కొన్ని కంపెనీలు చైనా మార్కెట్‌లో తమ స్థానాల గురించి పునరాలోచనలో పడ్డాయి. చాలా సంస్థలు తమ వనరులు, ప్రణాళికల్లో కొన్నిటిని చైనా వెలుపల ప్రత్యామ్నాయ ప్రాంతాలకు మళ్లిస్తున్నారని.. దీనివల్ల తయారీ, సరఫరా రంగం బలోపేతమైందని.. సింగపూర్‌కు చెందిన అతిపెద్ద కంటెయినర్ రవాణా సంస్థ హాలియో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆల్విన్ ఇయా చెప్పారు.

 
''తూర్పు ఆసియా కోణంలో చూసినపుడు.. వియత్నాం, మలేసియా, ఇండొనేసియాల్లోని ఫ్యాక్టరీలకు ఆర్డర్లు పెరుగుతాయని మాకు కనిపిస్తోంది'' అని చెప్పారు. ఈ విషయంతో గ్జెనెటా చీఫ్ ఎనలిస్ట్ పీటర్ శాండ్ ఏకీభవిస్తున్నారు. ''కంపెనీల ప్రత్యామ్నాయ ప్రణాళికల్లో.. తమ సరకుల నిల్వలను పెంచటం మొదలుకుని.. పొరుగు దేశాల్లో ఉత్పత్తి సుదపాయాలను నెలకొల్పటం వరకూ చాలా ప్లాన్లు ఉంటాయి. లేదంటే ఖర్చు ఎక్కువయినా కానీ.. తమ ప్రధాన వినియోగదారులున్న ప్రాంతాలకే ఉత్పత్తిని కూడా తరలించే అవకాశమూ ఉంటుంది'' అన్నారాయన.

 
అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ చైనా సభ్యులు కొంతమంది.. తమ కార్యకలాపాలను తరలించాలనే ఆలోచనలో ఉన్నారని ఆ సంస్థ ప్రతినిధి మైఖేల్ హార్ట్ చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి వారి సంఖ్య చాలా తక్కువగానే ఉందన్నారు. ''కానీ కార్యకలాపాలను తరలించాలని ఆలోచిస్తున్న వారిలో 22 శాతం మంది గత ఏడాది కోవిడ్ సంబంధిత ఆంక్షల వల్లే ఆ ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. ఆ ముందటి సంవత్సరంతో పోలిస్తే ఇది 5 శాతం పెరిగింది'' అని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యుక్రెయిన్ యుద్ధం: ‘జెలియెన్‌స్కీతో ఫేస్‌ టు ఫేస్’ - శాంతి ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిమాండ్లు ఇంకా ఏంటంటే..