Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్: ఆంధ్రా నుంచి వస్తున్నారా? అయితే నో ఎంట్రీ - పొరుగు రాష్ట్రాల భయాలకు కారణమేంటి?

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (16:39 IST)
కోవిడ్ మొదటి దశలో ఉత్తరాంధ్రలో ప్రభావం తక్కువగా ఉంది. దాంతో తమ ఆహార అలవాట్లు, వాతావరణం, జీవన శైలి కరోనాను కూడా దరిచేరనివ్వలేదని ఉత్తరాంధ్రలో కొందరు చెప్పుకున్నారు. కానీ సెకండ్‌ వేవ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం 2021, ఏప్రిల్ 21న ఏపీలో మొత్తం 9716 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఉత్తరాంధ్రలోనే 2819 కేసులున్నాయి.

 
ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రం మొత్తం కేసుల్లో ఉత్తరాంధ్ర వాటా 29 శాతమని తేలింది. అలాగే ఏప్రిల్ 20న 26%, ఏప్రిల్ 19న 24.7% ఏప్రిల్ 18న 27.5% కేసులు ఉత్తరాంధ్రలో నమోదయ్యాయి. అంటే రాష్ట్రంలోని 13 జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో పావు వంతు కేసులు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలలోనే నమోదువున్నాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి.

 
ఏపీలో గతేడాది నుంచి ఇప్పటివరకు కేసుల్లో 17%, మరణాల్లో 16% ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. రాష్ట్రంలో 60208 యాక్టివ్ కేసులుండగా... ఉత్తరాంధ్రలో 14550 (24%) కేసులున్నాయి. తొలి దశలో ఉత్తరాంధ్రలో మొదటి కేసు 2020, మార్చి 20న విశాఖలో నమోదైంది. ఆ తర్వాత ఏప్రిల్ 24న శ్రీకాకుళం, మే 7న విజయగనం జిల్లాలో తొలి కేసులు నమోదయ్యాయి. ఆహార అలవాట్లు, వాతావరణం, ప్రజల జీవన శైలి వంటి కారణాలతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కరోనా వ్యాప్తి చెందడం లేదంటూ అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు.

 
ఆంధ్రా నుంచా.... అయితే నో ఎంట్రీ...
ఉత్తరాంధ్రలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు ఒడిశాతో అనేక సరిహద్దులున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాకు ఒడిశాకు మధ్య నిత్యం వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. శ్రీకాకుళంలో 7420 (ఏప్రిల్ 21 నాటికి) యాక్టివ్ కేసులున్నాయి. దీంతో శ్రీకాకుళం నుంచి ఒడిశాలోకి ప్రవేశించే పాతపట్నం, పర్లాకిమిడి సరిహద్దులను ఒడిశా అధికారులు మూసేశారు.

 
అలాగే పర్లాకిమిడి మరో సరిహద్దు వద్ద తనిఖీలు నిర్వహిస్తూ... ఒడిశా గుర్తింపు కార్డులు ఉన్నవారికి మాత్రమే పర్లాకిమిడిలోనికి అనుమతి ఇస్తున్నారు. దీంతో ఒడిశాలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే ఉత్తరాంధ్రవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ''మాది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు. 12 కి.మీ. దూరంలో ఉన్న పర్లాకిమిడిలోని గ్యాస్ కంపెనీలో పని చేస్తున్నాను. కోవిడ్ నిబంధనలు అన్నీ పాటిస్తున్నాను. అయినా ఒడిశా పోలీసులు విధులకు వెళ్లనివ్వడం లేదు'' అని ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న నరసింగరావు బీబీసీతో చెప్పారు.

 
వలంటరీ లాక్‌డౌన్స్
గతేడాది మే నెల రెండో వారం వరకు కోవిడ్ కేసులు నమోదు కానీ విజయనగరం జిల్లాలో సైతం ఇప్పుడు సెకండ్ వేవ్‌లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2105 (ఏప్రిల్ 21 నాటికి) యాక్టివ్ కేసులున్నాయి. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో పలు వ్యాపార సంఘాలు, కొన్ని మండలాలు, గ్రామాలు స్వచ్ఛందగా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. కురుపాం మండల కేంద్రంలో ప్రజలు స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించుకుంటున్నారు.

 
మందుల దుకాణాలు మినహా మరే షాపులైనా మధ్యాహ్నం 2 గంటల దాకా తెరవకూడదని నిర్ణయించారు. కరోనా నియంత్రణ కోసం వివిధ ప్రాంతాల్లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖ మన్యంలో కూడా వర్తక సంఘాలు స్వచ్చంధ లాక్‌‌డౌన్ ప్రకటించాయి. అరకు లోయ వర్తక సంఘం, గిరిజన సంఘం ప్రతినిధులు ఈ నెల 20వ తేదీ నుంచి ఒక పూట లాక్‌‌డౌన్ పాటించాలని నిర్ణయించారు.

 
ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుస్తామని గిరిజన, వర్తక సంఘం నాయకుడు కిల్లో రాంజీ చెప్పారు. ''శ్రీకాకుళం జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో ఎక్కువ మంది కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. బస్సుల్లో ప్రయాణ సమయంలో మాస్కులు ధరిస్తున్నారా లేదా? బస్సులో శానిటైజేషన్ వ్యవస్థ, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సీటింగ్ ఉందా? అనే విషయంలో కూడా తనిఖీలు చేస్తున్నాం'' అని పాలకొండ డీఎస్పీ శ్రావణి చెప్పారు.

 
10 వేల పడకలు...710 వెంటిలేటర్లు....
విశాఖ జిల్లాలోని కోవిడ్ పరిస్థితులపై మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. "జిల్లాలో ఏప్రిల్ 21 నాటికి 5025 యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ ఆసుపత్రుల్లో 2 వేల పడకలు అందుబాటులో ఉన్నాయి. వివిధ ఆసుపత్రుల్లో 10 వేల పడకలు ఉండగా... వాటిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,548 పడకలు కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేశాం. ఐసీయూలో 1,022 పడకలు, ఆక్సిజన్ ఏర్పాటుతో 2650 అందుబాటులో ఉన్నాయి'' అని మంత్రి చెప్పారు. జిల్లాలో ఆక్సిజన్‌ కొరత లేదని, రోజుకు 40 నుంచి 50 టన్నుల అవసరం కాగా.. వివిధ పరిశ్రమల నుంచి రోజుకు 100 నుంచి 150 టన్నుల ఆక్సిజన్ వస్తోందని, స్టీల్ ప్లాంటు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ నేరుగా ప్రభుత్వానికే వెళ్తోందని మంత్రి వెల్లడించారు.

 
వలసలు, నిర్లక్ష్యమే కారణం
కోవిడ్-19 ఫస్ట్‌ వేవ్ సమయంలో చాలా కాలం గ్రీన్ జోన్‌గా ఉన్న ఉత్తరాంధ్రలో... సెకండ్ వేవ్ ప్రారంభంలోనే చాలా ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న జిల్లాల్లో శ్రీకాకుళం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ''గత ఏడాది కోవిడ్ మొదలైయ్యాక... లాక్ డౌన్ కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రభుత్వం వలస కార్మికులను స్వస్ధలాలకు పంపింది. ఆ సమయంలో కోవిడ్ కేసులు పెరిగాయి.

 
అయితే ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్ భయాల కారణంగా సెకండ్ వేవ్ ప్రారంభంలోనే హైదరాబాద్, ముంబాయి, కోల్‌కతా వంటి నగరాల నుంచి సొంత గ్రామాలకు చేరుకున్నారు. అప్పటికే కొందరిలో కరోనా పాజిటివ్ ఉండటంతో వారి వల్ల గ్రామాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది'' అని ఆంధ్రా యూనివర్సిటీ సోషల్‌ సైన్స్‌ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ దేవి ప్రసాద్ బీబీసీతో అన్నారు. గతంతో పోల్చుకుంటే కరోనా అంటే ప్రజల్లో భయం పెద్దగా కనిపించడం లేదని, చాలామంది కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని ఆయన అన్నారు.

 
ఏ ప్రాంతమైనా... జాగ్రత్తలే ముఖ్యం
అన్ని జిల్లాల్లో కోవిడ్ ప్రభావం కనిపిస్తోంది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ విషయాల్లో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోందని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ అన్నారు. ''కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఒక సామాజిక బాధ్యత. ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యాక్సినేషన్ జరుగుతోంది. అందరూ వ్యాక్సీన్ వేయించుకోవాలి'' అని డాక్టర్ సుధాకర్ చెప్పారు. ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

 
నో స్టాక్స్... బ్లాక్‌లో రెమిడెసివీర్
ప్రభుత్వం కరోనా విషయంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా...ఆసుపత్రుల్లో రోగులను దోచుకోవడం ఆగడం లేదని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా రోగులకు చికిత్సలో అవసరమయ్యే ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివీర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. రీజినల్ విజిలెన్స్ ఆఫీసర్ స్వరూపరాణి తన టీంతో ఒక ఆసుపత్రి మందుల దుకాణం దగ్గరకు వెళ్లి రెమ్‌డెసివీర్‌ ఇంజక్షన్‌ కావాలని అడిగారు. దుకాణం బయట ఉన్న వ్యక్తి అనధికారికంగా రూ. 10 వేలకు ఆ ఇంజక్షన్‌ను విక్రయించబోగా, వారిని ఆమె రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 
ఆసుపత్రికి చెందిన ముగ్గురు నర్సులు, ఇద్దరు హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగులను విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ''ఆసుపత్రిలో రెమ్‌డెసివీర్‌ ఉపయోగించాల్సిన వ్యక్తులకు ఇంజక్షన్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో రాసుకుని వాటిని బ్లాక్‌లో అమ్ముతున్నట్లు నిందితులు చెప్పారు. ఈ ఇంజక్షన్‌ ధర రూ.5,400 కాగా.. రూ.10 వేలకు విక్రయిస్తున్నారు'' అని ఏసీపీ హర్షిత తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments