బీబీసీ '100 వుమెన్' సిరీస్ ఏటా స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన 100 మంది మహిళల గాథలను ప్రపంచవ్యాప్తంగా పాఠకులు, వీక్షకుల ముందుకు తెస్తోంది. విభిన్న రంగాల్లో కృషి చేస్తున్న మహిళల కథలను వినిపిస్తోంది.
2013లో మొదలైన ఈ సిరీస్ ఇప్పుడు ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
మేకప్ ఆంట్రప్రెన్యూయర్ బాబీ బ్రౌన్, ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మొహమ్మద్, బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్, అథ్లెట్ సిమోన్ బైల్స్, సూపర్ మోడల్ అలెక్ వెక్, మ్యుజీషియన్ అలీసియా కీస్, ఒలింపిక్స్ చాంపియన్ బాక్సర్ నికోలా ఆడమ్స్- ఇలా వేర్వేరు రంగాలకు చెందిన మహిళలు గత ఆరేళ్లలో 'బీబీసీ 100 వుమెన్'కు ఎంపికయ్యారు.
తొలిసారిగా ఈ కార్యక్రమం దేశ రాజధాని దిల్లీలో మంగళవారం (22.10.2019) జరిగింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన స్ఫూర్తిమంతమైన మహిళలు ఇందులో పాల్గొని మాట్లాడారు.
భారత సమాజంలో చర్మం రంగు గురించి ఏర్పడిన వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న బాలీవుడ్ నటి నందితా దాస్ దిల్లీలో జరిగిన బీబీసీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీబీసీ 100 విమెన్-సీజన్ 2019 ఫ్యూచర్ కాన్ఫరెన్స్‌కు వచ్చిన వారితో కలిసి నందిత ఫిల్మ్ ఇండస్ట్రీలో రంగు గురించి ఉన్న వివక్షపై తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.
నల్లగా ఉన్న నటులు, నటీమణుల కమర్షియల్ సినిమాలో ఎలాంటి సమస్యలు వస్తాయో ఆమె చెప్పారు.
సినిమాల్లో చదువుకున్న, ఉన్నత వర్గం మహిళ పాత్ర పోషించడానికి చర్మం తెల్లగా కనిపించేలా మేకప్ వేసుకోమని చెబుతారు. కానీ, ఏదైనా గ్రామీణ నేపథ్యం ఉన్న రోల్ చేయాలంటే మాత్రం, మీరు ఎంత నల్లగా, అందంగా ఉన్నారో అని ప్రశంసిస్తారు అని నందితా దాస్ చెప్పారు.
నల్లగా ఉన్న నటి కమర్షియల్ సినిమాల్లో తెల్లగా కనిపిస్తుంది. రియలిస్టిక్ సినిమాల్లో మాత్రం డార్క్‌గా కనిపిస్తారు.
ఎవరైనా యాక్టర్ తెల్లగా ఉంటే, రియలిస్టిక్ సినిమా లేదా పేద, లేద గ్రామీణుడుగా చూపించడానికి వారిని నల్లగా చూపిస్తారు అని నందిత చెప్పారు.
తెల్లదనం వ్యామోహం
నందితా దాస్ భారత్‌లో తెల్ల రంగు అంటే ఉన్న మోజు సర్వ సాధారణం అన్నారు.
తెల్ల రంగు అంటే మోజు ఎంత తీవ్రంగా ఉందనే దాని గురించి నందితా దాస్ ఒక ఉదాహరణ కూడా చెప్పారు. "ఇదే విషయంపై వచ్చిన ఒక ఆర్టికల్లో ఒక దగ్గర నా ఫోటో ప్రచురించారు. దానిని కూడా వాళ్లు ఫొటోషాప్ ద్వారా తెల్లగా చేశారు" అన్నారు.
"మొదట తెల్లబడతారని వచ్చే ప్రకటనలు ఇప్పుడు కనిపించడం లేదు. "అడ్వర్టైజ్‌మెంట్ అసోసియేషన్ గైడ్‌లైన్స్ కఠినంగా ఉన్నాయి" అని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రకటనల్లో తెల్లదనం బదులు "గ్లోయింగ్ అండ్ బ్రైటనింగ్ స్కిన్ కోసం" అని చెబుతున్నారు అన్నారు నందిత
కొంతమంది "డార్క్ స్కిన్ ఉన్నప్పటికీ మీరు ఇంత కాన్ఫిడెంట్‌గా ఎలా ఉన్నారు" అని కూడా అడుగుతుంటారు. ఆత్మవిశ్వాసం, అర్హతలకు కూడా చర్మం రంగును ఎలా జోడించారో దీనితో తో తెలుస్తుంది".
"రంగు ఎలా ఉండాలి, ఎత్తు ఎంత ఉండాలి అని మన సమాజంలో మొదటి నుంచే అందం గురించి చెప్పడం మొదలుపెడతారు. దాంతో మనం అవే ప్రమాణాలను అందుకోవాలని ప్రయత్నిస్తాం. 'అందం' అనే భారాన్ని మహిళలు ఎందుకు మోయాలి? మనం అన్ని రకాల వైవిధ్యాన్ని గౌరవించాలి" అని నందితా దాస్ అన్నారు.
అందంగా కనిపించడం అవసరమా?
తెల్లరంగును అందానికి కొలతగా మార్చేశారని నందితా దాస్ చెప్పారు. "అందంగా కనిపించడంలో తప్పేం లేదు. కానీ దానికి మీరు ప్రాధాన్యం ఇవ్వాలా?" అని ప్రశ్నించారు.
"నల్లగా ఉన్న మహిళల్లో ప్రతిభ లేకపోతే, వారు నిలబడగలరా. వారిని ఎవరైనా తెల్లగా ఉన్న వారితో పోలిస్తే, నల్లగా ఉన్న వారు సర్వైవ్ కాగలరా. ఆలోచించండి" అన్నారు.
2030లో మహిళల నేతృత్వంలో భవిష్యత్తు గురించి తన విజన్ చెప్పిన నందిత "మొట్టమొదట పక్షపాతాన్ని దూరం చేయాలని" చెప్పారు.
మహిళలు నిర్ణయం తీసుకునే పాత్ర గురించి మాట్లాడుతూ 'వేలిముద్ర' వేసే సంస్కృతిని అంతం చేయాలి అన్నారు.
"సమాజంలో వ్యాపించిన విద్వేషాలు, హింసను అంతం చేయాలి. ఇలాంటి విషయాలు ఎక్కువగా పురుషుల తప్పిదం వల్లే జరుగుతాయి" అని చెప్పారు.
"లించింగ్, యుద్ధం, రేప్, అల్లర్లు, వేధింపులు ఎక్కువయ్యాయి. ఎక్కువ మంది మహిళలు చురుకుగా ఉంటే, ప్రపంచం మొదటి నుంచే ప్రశాంతంగా ఉండేది" అన్నారు.
శక్తికి గుర్తింపు తీసుకొచ్చిన మహిళలు
యోగా టీచర్, మోటివేషనల్ స్పీకర్ నటాషా నోయెల్ బాడీ పాజిటివిటీ గురించి మాట్లాడారు. మనను మనం ప్రేమించుకోవాలని చెప్పారు.
మూడేళ్ల వయసులో తన తల్లిని కోల్పోవడం గురించి, ఏడేళ్ల వయసులో తనపై లైంగిక వేధింపులు జరగడం గురించి నటాషా మాట్లాడారు.
"నేను ఇప్పటికీ పోరాటం చేస్తున్నా.. కానీ, రోజూ నన్ను నేను ప్రేమించడం కూడా నేర్చుకుంటున్నా" అని ఆమె చెప్పారు.
నటాషా ఇతరులకు ఒక ఉదాహరణగా నిలిచారు. బాల్యంలో భరించిన వేధింపులతో పోరాడి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు.
వేదికపై యోగాసనాలు
బాల్యంలో చెడు అనుభవాల నుంచి బయటపడిన తర్వాత తనకు యోగా వల్ల సాయం లభించిందని ఆమె చెప్పారు. "మీ బాధను స్వీకరించండి, దానిని అర్థం చేసుకుని పోరాడండి. దానిని మీ జీవితం నుంచి దూరంగా తరిమికొట్టండి, దానినే తలచుకుంటూ కూర్చోకండి" అన్నారు.
నాటాషా వేదికపై వేసిన కొన్ని యోగాసనాలు కూడా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
"వేగం మెల్లగా ఉండచ్చు. కానీ మహిళలు మన శక్తికి గుర్తింపు ఇస్తున్నారు. ఒక మెరుగైన మనిషిగా మారడానికి, మనకు మంచి ఐక్యూ ఉండడమే కాదు, సీరియస్ ఐక్యూ (భావోద్వేగ లక్షణాలు) ఉన్న మహిళల అవసరం కూడా ఉంది" అని నటాషా చెప్పారు.
మహిళలు చదువుకుంటే ప్రపంచానికే మేలు - అరణ్య జోహర్
'కవిత్వం, సమానత్వం, భవిష్యత్తు' అనే అంశంపై కవయిత్రి అరణ్య జోహర్ మాట్లాడారు.
100విమెన్ దిల్లీ సదస్సులో ప్రారంభ వక్త అయిన అరణ్య 2030 నాటికి ఈ ప్రపంచం ఎలా ఉండాలనే దానిపై తన ఆకాంక్షలను వెల్లడించారు.
ప్రపంచంలోని మహిళలందరికీ సమాన విద్యావకాశాలు, తమపై తమకు స్వీయ నియంత్రణ, సామాజిక మార్పుకు బాటలు వేసే నాయకత్వంలో ముందుకు నడవడం, తద్వారా జీవితాల్లో మార్పులు చూడడం... ఇలాంటి ప్రపంచం కావాలి.
విద్యే సమానత్వాన్ని తీసుకొచ్చే అతి గొప్ప మార్గం అని జోహర్ అన్నారు. విద్య, సమానత్వం విషయంలో తీవ్రంగా ప్రభావితమైనది మహిళలేనంటూ ఓ పద్యాన్ని చదివి వినిపించారు.
బాలికలందరూ పాఠశాలకెళ్లి చదువుకుంటే దానివల్ల ప్రపంచానికే మేలు జరుగుతుందని ఆమె అన్నారు.
భవిష్యత్తుకి తగ్గట్లుగా ఇప్పుడున్న విద్యార్థులను సిద్ధం చేయాలి
భవిష్యత్తు పాఠశాలలు అనే అంశంపై రాయా బిద్శహరీ తన అభిప్రాయాలను ఈ సదస్సులో పంచుకున్నారు.
భవిష్యత్తు పాఠశాలలు ఎలా ఉండాలో, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ భవిష్యత్తు అంతా కృత్రిమ మేధదే అని ఇరానియన్ విద్యావేత్త, ఆకాడెమీ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపక సీఈఓ రాయా వ్యాఖ్యానించారు.
"గ్రేడ్లు, విజ్ఞానం.. ఈ రెండూ వేర్వేరు అంశాలు. మేధోపరమైన, సామాజిక, నైతిక పరమైన అభ్యసనం జరిగితేనే అది అర్థవంతమైనదిగా భావించాలి. కేవలం గ్రేడ్లు, సర్టిఫికెట్ల కోసం నేర్చుకునేది విజ్ఞానం కాదు" అని ఆమె అభిప్రాయపడ్డారు.
రాయా ఇంకా ఏమన్నారంటే...
భవిష్యత్తుల్లో పాఠశాలలంటే భవనాలేమీ ఉండవు, అభ్యసనం మొత్తం క్లౌడ్ సెషన్ల ద్వారానే జరుగుతుందని రాయా అంటున్నారు.
ప్రస్తుతం ఉనికిలో లేని అలాంటి ప్రపంచం కోసం ప్రస్తుత తరాన్ని ఇప్పుడున్న పాఠశాలలు, యూనివర్సిటీలు ఎలా సిద్ధం చేస్తాయో చూడాలి.
వేగంగా మార్పు చెందుతున్న ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. కానీ దానికి తగినట్లుగా విద్యావ్యవస్థలో మార్పులు చేయడానికి మనం ఏమాత్రం తొందర పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆటోమేషన్ కారణంగా 2030 నాటికి 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముంది. అలాగే భవిష్యత్తులో ఉండబోయే ఉద్యోగాల్లో 65శాతం ఇప్పుడున్న ఈ ప్రపంచంలో లేనేలేవు. ఇవి ప్రపంచ ఆర్థిక ఫోరమ్ అంచనాలు.
అందుకే మారుతున్న, భవిష్యత్ ప్రపంచానికి తగ్గట్లుగా ఇప్పుడున్న విద్యార్థులను సిద్ధం చేయడమే మన ముందున్న పెద్ద సవాలు.
'పురుషుల్లో సంతానసామర్థ్య సమస్యను పరిష్కరించలేమా?'
డాక్టర్ సారా మార్టిన్స్ డ సిల్వా స్కాట్లాండ్‌కు చెందిన గైనలాజిస్ట్, సంతానసాఫల్య వైద్య నిపుణురాలు. యూనివర్శిటీ ఆఫ్ దుండీలో ఆమె రిప్రొడక్టివ్ మెడిసిన్ అనే అంశాన్ని బోధిస్తారు.
దిల్లీ సదస్సులో పాల్గొన్న ఆమె... సంతానసామర్థ్యం ఆవశ్యకతను వివరించారు.
సైన్స్, టెక్నాలజీ, పెట్టుబడులు, సృజనాత్మక ఆవిష్కరణలతో పురుషుల్లో సంతాన సామర్థ్య సమస్యలను పరిష్కరిస్తే... ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సంతానలేమి సమస్యలను, అసమానతలను తొలగించే అవకాశముందని సారా అభిప్రాయపడ్డారు.
పురుషుల లోదుస్తులే వారి అనారోగ్య సమస్యలను వెల్లడించే వ్యవస్థ ఏదైనా ఉంటే ఎలా ఉంటుంది? అంటూ సారా పురుషుల్లో సంతానసామర్థ్య సమస్యల పరిష్కారంపై ఆలోచనలకు తెరతీశారు.
సంతానలేమి అనగానే మహిళలకే ఎందుకు అనవసరమైన, తీవ్రమైన చికిత్సలు చేస్తారని ఆమె ప్రశ్నించారు.
పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతోందని, దీంతో వారు తండ్రులయ్యే అవకాశాలు క్లిష్టంగా మారుతున్నాయని ఆమె వెల్లడించారు. దీనిపై తక్షణం దృష్టిసారించాల్సిన అవసరం ఉందని డాక్టర్ సారా అన్నారు.
దీనిపై ఎన్నో సంవత్సరాలుగా చేసిన పరిశోధనలతో ఎన్నో ఆధారాలున్నాయని తెలిపారు. దీనికి గల కారణాలను అన్వేషించాలని, వీర్యకణాల సంఖ్యలో తగ్గుదల నివారణకు మార్గాలు సూచించాలని పరిశోధకులను ఆమె కోరారు.
మహిళలు, ఆర్థికవ్యవస్థ
మహిళలు వేతనం లేకుండా చేసే పనుల విలువ గురించి మార్లిన్ వేరింగ్, శుభలక్ష్మి నంది ప్రసంగించారు. 'మహిళా ఆర్థిక వ్యవస్థ' ప్రాముఖ్యత గురించి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 'ఫెమినిస్ట్ ఎకనామిక్స్'ను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మార్లిన్ చెప్పారు.
మహిళల నేతృత్వం ఉండే భవిష్యత్తులో ఆర్థిక ప్రదర్శన కోసం లైంగిక సమానత్వం, సుస్థిర అభివృద్ధి, మహిళల హక్కులు ముఖ్యమైన భాగాలుగా ఉండాలని లైంగిక సమానత్వ కార్యకర్త శుభలక్ష్మి నంది అన్నారు.
"పంటలు, ఆహార పదార్థాలపై ఎంతో పెట్టుబడి పెడుతున్నప్పుడు, ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఆహారాన్ని( పిల్లలకు పాలు) ఉత్పత్తి చేసే మహిళకు పరిహారం ఎందుకు ఇవ్వకూడదు" అని ఆమె ప్రశ్నించారు.
"అది ఒక బిడ్డ భవిష్యత్తు కోసం అత్యంత ముఖ్యమైన పెట్టుబడి అవుతుంది" అన్నారు.
"చాలా పనుల్లో మహిళలకు పనిచేసే సామర్థ్యం ఉంటుందని భావించడం లేదు. వ్యవసాయం విషయానికే వస్తే, ఎంత చెమటోడ్చి పనిచేసినా మహిళను రైతు అనరు" అని శుభలక్ష్మి అన్నారు.
అంతరిక్ష రంగంలో మహిళల విషయానికి వస్తే
'స్పేస్ వుమన్' అనిపించుకున్న సుశ్మితా మొహంతి భూమి గురించి మాట్లాడుతూ "మనమంతా ఇప్పుడు నీలంగా ఉన్న ఒక స్పేస్ షిప్‌లో కూర్చుని వేగంగా విశ్వంలోకి ప్రయాణిస్తున్నాం" అని చెప్పారు.
సుశ్మితా మొహంతి భారత తొలి స్పేస్ ఎంటర్‌ప్రిన్యూర్. ఆమె స్పేస్ షిప్ డిజైన్ చేస్తారు. పర్యావరణ మార్పు కోసం కృషిచేస్తున్నారు.
"భూమి నివాసానికి యోగ్యంగా లేనప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించగలరా" అని ఆమె ప్రేక్షకులను కోరారు.
"మూడు నాలుగు తరాల తర్వాత మన గ్రహం నివాస యోగ్యంగా ఉండదేమోనని నాకు భయంగా ఉంది. పర్యావరణ పరిరక్షణ గురించి మనిషి ఇప్పటికైనా మేలుకుంటాడనే ఆశిస్తున్నా" అన్నారు.
పర్యావరణ మార్పులపై నిఘా కోసం స్పేస్ టెక్నాలజీ ఉపయోగించడం గురించి సుశ్మితా మొహంతి మాట్లాడారు.
"మానవుడు యుద్ధం, ఆయుధాలకు బదులు స్వచ్ఛమైన శక్తి వనరుల అన్వేషణలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది" అన్నారు.
త్రీడీ ప్రింటింగ్ ఫ్యాషన్ రంగం
దిల్లీలో జరిగిన 100 విమెన్ ఈవెంట్‌లో వ్యవసాయం నుంచి ఫ్యాషన్ వరకూ ఎన్నో అంశాల గురించి మాట్లాడిన వక్తలు తమ ప్రసంగాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
"మనం స్నేహితురాలికి ఒక డ్రెస్‌ను ఈమెయిల్ చేస్తే, ఆమె దాన్ని అప్పటికప్పుడే డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి, వేసుకునే ఒక భవిష్యత్ ప్రపంచాన్ని ఊహించండి"
30 ఏళ్ల కూడా లేని డిజైనర్ దనిత్ పెలెగ్ ఈ మాట చెప్పారు. త్రీజీ టెక్నాలజీ, ఎథికల్ ఫ్యాషన్ మిశ్రమంతో ఒక కొత్త విజన్ వస్తుందని చెప్పారు.
ఇజ్రాయెల్‌కు చెందిన దనిత్ పెలెగ్ 'ఫ్యూచర్ కాన్ఫరెన్స్'లో భవిష్యత్ ప్రపంచంలో త్రీడీ ప్రింటింగ్ ద్వారా దుస్తుల డిజైన్‌ను విప్లవాత్మకం చేయడం గురించి మాట్లాడారు.
2030 గురించి మాట్లాడిన దనిత్, అప్పుడు ఒక ఫ్యాషన్ డిజైనర్ తన కలెక్షన్‌ను నిమిషాల్లో సిద్ధం చేసేస్తుందన్నారు. అవి మన్నిక ఉన్న ప్రత్యామ్నాయ ఫ్యాషన్ అవుతాయని చెప్పారు.
దానితోపాటు ఆమె ముడి టెక్స్‌టైల్ మెటీరియల్‌ను ఎక్కువగా రీసైకిల్ చేయాలనే అంశాన్ని కూడా లేవనెత్తారు.
న్యాయం కోసం డేటా కీలకం
మెక్సికోకు చెందిన కంప్యూటర్ ప్రోగ్రామర్ పావోలా విల్లారియల్, వివక్షకు వ్యతిరేకంగా పోరాడేలా సామాజిక సంస్థలకు సాయం చేసేందుకు డేటా సైన్స్, టెక్నాలజీపై నమ్మకం ఉంచారు.
పావోలా 12 ఏళ్ల వయసులోనే తన సొంత కోడ్ నేర్చుకున్నారు. 15 ఏళ్లకే ఆమె వెబ్ డిజైనర్‌గా పనిచేశారు. అమెరికాకు వెళ్లాక, ఆమె ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో జాతి వివక్షను తొలగించడంపై దృష్టి పెట్టారు.
"వివక్షపూరిత సమాజంలో మరింత సమర్థవంతమైన పాలనను అందించడం కోసం డేటా అల్గారిథమ్స్ ఉపయోగించడం చాలా ముఖ్యం" అని ఆమె చెప్పారు.
చారిత్రకపరంగా మరిచిపోయిన వారిలో తిరిగి శక్తిని నింపడానికి డేటా, టెక్నాలజీ సాయం చేస్తాయని ఆమె చెప్పారు.
"వివక్ష, అసమానత్వం లాంటి వాటిని ఎదుర్కోడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చాలా సాయం చేయగలదు" అన్నారు.
అల్గారిథం కోడ్‌ను లింగ వివక్ష ఉన్న కోడర్స్ తయారు చేసినట్లయితే, అవి మహిళా వ్యతిరేక అల్గారిథమ్స్ అయ్యుంటాయని పావోలా చెప్పారు.
ప్రపంచ మతాన్ని పిల్లలే నడిపిస్తారు
భవిష్యత్ ప్రపంచం, దాని మతం అనే దాని గురించి రిలిజియన్ స్కాలర్ గినా జుర్లో పూర్తిగా భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.
మహిళల పాత్ర గురించి మాట్లాడిన గినా పురుషుల కంటే మహిళలు ఎక్కువ మతాన్ని ఆదరిస్తారని పరిశోధనల్లో తేలిందని అన్నారు.
"మతాన్ని కాపాడేవారు, ఈ భూమిని కాపాడేవారు మహిళలే... అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను" అని అన్నారు.
ప్రపంచంలో గతంలోని మతం వర్తమానంతో ఎలా ఇంటరాక్ట్ అవుతోందో, భవిష్యత్తుకు ఎలాంటి రూపాన్ని ఇవ్వనుందో ఆమె వివరించారు.
గినా జుర్లో ప్రపంచవ్యాప్తంగా మతాలకు సంబంధించి గణాంకాలు కూడా సేకరించారు. 1900 నుంచి 2050 వరకూ ప్రపంచంలోని మతాలకు సంబంధించి ఒక చార్టును రూపొందించారు.
ఆ గణాంకాల ఆధారంగా 2030 నాటికి క్రైస్తవులు, ముస్లింల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 59 శాతానికి ఎలా చేరబోతోందో ప్రేక్షకులకు వివరించారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న మతం ఇస్లాం అని చెప్పిన గినా, 100 విమెన్ ఈవెంట్‌ను "పిల్లలు ప్రపంచ మతాన్ని ఎలా నడిపించబోతున్నారు" అనే అంశంపై ఆసక్తికరమైన చర్చగా మార్చేశారు.
"ప్రపంచంలో అన్ని మతాల జనాభాలో జనన రేటు ప్రస్తుతం ఉన్నట్లు ఇలాగే ఉంటే, ఎలాంటి మతమార్పిడులు జరగకపోతే, 2030 నాటికి ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలు ఇస్లాంలోనే ఉంటారు" అని గినా జుర్లో చెప్పారు.
భవిష్యత్ మత చిత్రాన్ని, అందులో మహిళల పాత్రను చూస్తూ కొత్త పద్ధతులను నిర్వచించేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీని ఉపయోగించడానికి ఇది సరైన సమయం అని గినా అభిప్రాయపడ్డారు.
"మహిళల సంతానోత్పత్తి రేటు గుర్తించడాన్ని మించి మరింత ఎక్కువ పరిశోధనలు చేయగలిగే ప్రపంచాన్ని మనం నిర్మించగలం అని ఆశిస్తున్నాను" అన్నారు.
భవిష్యత్తు ప్రేమ
"మీరు కళ్లు మూసుకుని నేను కొన్ని పదాలు చెప్పగానే మీ మనసులో మెదిలే మొదటి ఫొటోను గమనించండి. ఒక ఎగిరే ఏనుగు, ఒక అన్యోన్య బంధం, ఒక రొమాంటిక్ డేట్, పెళ్లి, ఆదర్శ కుటుంబం, ప్రేమ".
డాక్టర్ ప్రగతి సింగ్‌తో జరిగిన ఈ సెక్షన్లో కాన్ఫరెన్సులో ఉన్న ప్రేక్షకులకు ఆమె చెబుతున్నవి చాలా ఆసక్తికరంగా అనిపించాయి.
డాక్టర్ ప్రగతి సింగ్ ఒక హెల్త్‌కేర్ ప్రొఫెషనల్. ఆమె తన సెషన్‌లో సెక్సువాలిటీ, లైంగిక గుర్తింపు గురించి మాట్లాడారు.
సంబంధాలు అనే భావనలకు సవాలు విసిరిన ఆమె మహిళలకు ఒంటరిగా ఉండే హక్కు గురించి చర్చించారు. "మీకు ఒక పార్టనర్ అవసరం ఉందా?" అని ప్రశ్నించారు.
ప్రగతి సింగ్ ఎసెక్సువాలిటీపై వర్క్‌షాప్ నిర్వహిస్తారు. ఆ సమయంలో శారీరక సంబంధాలు కోరుకోకపోయినా, బలవంతంగా అరేంజ్డ్ మ్యారేజ్ చేయించుకున్న యువతుల నుంచి ఆమెకు సందేశాలు అందుతుంటాయి.
ఎసెక్సువాలిటీ ఉన్న వారికి సౌకర్యంగా అనిపించేలా ఒక వాతావరణం సృష్టించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.
"ఒక ఎసెక్సువల్ వ్యక్తికి అన్నిటికంటే ముందు తను ఒంటరిగా లేనని, ఒక సమాజంలో ఉన్నాననే భావన కల్పించాల్సిన అవసరం ఉంది" అన్నారు.
మనల్ని అవహేళన చేసేవారిని ఎదుర్కోవడం, మహిళ నేతృత్వం వహించే భవిష్యత్తులో మన జీవితాన్ని, మన గుర్తింపును స్వయంగా రూపొందించుకోవడం అనేదే దీని వెనుక ఆలోచన.
మహిళలకు సమాన అవకాశాలు
ట్యునీషియాకు చెందిన హైఫా సదిరీ వయసు తక్కువైనా ఆమె ఆలోచన చాలా పరిపక్వత ఉన్నది.
మహిళలు నేతృత్వం వహించే భవిష్యత్తు గురించి మాట్లాడిన హైఫా సదిరి తన ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం Entr@crush గురించి చెప్పారు.
బిజినెస్ ఐడియాలు ఉన్న యువతులు, తమ లాంటి ఆలోచనే ఉన్న వారితో, పెట్టుబడిదారులతో, మిగతా పారిశ్రామికవేత్తలతో నెట్‌వర్క్ ఏర్పరుచుకునేందుకు ఈ ఫ్లాట్‌ఫాం అవకాశం కల్పిస్తుంది.
నగరాల్లో ఉండని మహిళలకు స్కిల్ నేర్చుకోడానికి, బిజినెస్ ప్రారంభించేలా తొలి అడుగు వేయడానికి ఈ ఫ్లాట్‌ఫాం సాయం చేయగలదు. ఎందుకంటే ఇందులో అన్నీ ఆన్‌లైన్లోనే జరుగుతాయి అని హైఫా సదిరి చెప్పారు.
2030 కోసం తన విజన్‌ను అందరితో పంచుకున్న హైఫా "యువతులకు తగిన ఆవిష్కరణ, ఉపాధి అవకాశాలు లభించినప్పుడే అది మహిళల నేతృత్వం వహించే భవిష్యత్తు అవుతుందని" చెప్పారు.
ఒక ఉదయం నిద్రలేచినపుడు.. పురుషులు, మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు లభించే ప్రపంచంలో ఉండాలని అనుకుంటున్నాను.
మహిళలకు సమాన అవకాశాలు
ట్యునీషియాకు చెందిన హైఫా సదిరీ వయసు తక్కువైనా ఆమె ఆలోచన చాలా పరిపక్వత ఉన్నది.
మహిళలు నేతృత్వం వహించే భవిష్యత్తు గురించి మాట్లాడిన హైఫా సదిరి తన ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం Entr@crush గురించి చెప్పారు.
బిజినెస్ ఐడియాలు ఉన్న యువతులు, తమ లాంటి ఆలోచనే ఉన్న వారితో, పెట్టుబడిదారులతో, మిగతా పారిశ్రామికవేత్తలతో నెట్‌వర్క్ ఏర్పరుచుకునేందుకు ఈ ఫ్లాట్‌ఫాం అవకాశం కల్పిస్తుంది.
నగరాల్లో ఉండని మహిళలకు స్కిల్ నేర్చుకోడానికి, బిజినెస్ ప్రారంభించేలా తొలి అడుగు వేయడానికి ఈ ఫ్లాట్‌ఫాం సాయం చేయగలదు. ఎందుకంటే ఇందులో అన్నీ ఆన్‌లైన్లోనే జరుగుతాయి అని హైఫా సదిరి చెప్పారు.
2030 కోసం తన విజన్‌ను అందరితో పంచుకున్న హైఫా "యువతులకు తగిన ఆవిష్కరణ, ఉపాధి అవకాశాలు లభించినప్పుడే అది మహిళల నేతృత్వం వహించే భవిష్యత్తు అవుతుందని" చెప్పారు.
ఒక ఉదయం నిద్రలేచినపుడు.. పురుషులు, మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు లభించే ప్రపంచంలో ఉండాలని అనుకుంటున్నాను.
మహిళలు, పర్యావరణం
పర్యావరణవేత్త, స్టాండప్ కమెడియన్ వాసు పీర్‌మలానీ తన సెషన్‌ను నవ్వులతో ప్రారంభించారు.
కానీ, ఆ తర్వాత ఆమె ప్లాస్టిక్ వల్ల ఏర్పడే కాలుష్యం లాంటి సీరియస్ అంశాలపై చర్చించారు.
"ప్లాస్టిక్ సహజంగా నాశనం కావడానికి ఎన్నేళ్లు పడుతుందో చెబుతారా?" అని ఆమె ప్రేక్షకులను అడిగారు. 500 ఏళ్లు అని సమాధానం లభించింది. "కానీ, ఒక ప్లాస్టిక్ బాటిల్‌తో నీళ్లు తాగడానికి కేవలం ఐదు నిమిషాలే పడుతుంది" అని ఆమె పోలిక చెప్పారు.
పర్యావరణాన్ని పరిరక్షించడానికి రీసైక్లింగ్ మాత్రమే చేయకుండా, వాటి పునర్వినియోగం కూడా ఉండాలి అని పీర్‌మలానీ చెప్పారు.
2015లో వాసు పీర్‌మలానీ రాష్ట్రపతి నుంచి 'నారీ శక్తి' పురస్కారం అందుకున్నారు.
మహిళల భవిష్యత్తు గురించి తన విజన్ చెప్పిన వాసు పీర్‌మలానీ "మన గొంతు విననివ్వండి, మనకోసమే కాదు, మొత్తం భూమి కోసం" అన్నారు.
ఫ్యూచరిజం - పురుషాధిపత్యం సాగుతున్న ఈ ప్రపంచం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా తీర్చిదిద్దాలన్నదే ఫ్యూచరిజం.
ఈసారి మేం ఎంచుకున్న ప్రశ్న: ఒకవేళ మహిళలు సారథ్యం వహిస్తే ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?
బీబీసీ 100 వుమెన్-2019 సీజన్‌లో ప్రధానమైనవి రెండు ఫ్యూచర్ సదస్సులు. వీటిలో మొదటిది అక్టోబర్ 17న లండన్‌లో జరిగింది. రెండో సదస్సు అక్టోబర్ 22న దిల్లీలో జరిగింది.
సైన్స్, కళలు, మీడియా, సినిమా, విద్య, ఫ్యాషన్, మతం, అంతరిక్షం, లింగ సమానత్వం వంటి రంగాల్లో కృషి చేస్తూ.. ఆయా రంగాల భవిష్యత్తును అంచనా వేయగల, మార్చగల సామర్థ్యమున్న ఎందరో మహిళలు ఈ సదస్సులో పాల్గొన్నారు.