వరంగల్ జిల్లాలో జరిగిన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత అత్యాచారం, హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా తేలిన ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, జూన్ 18వ తేదీన హన్మకొండలోని తన ఇంట్లో నిద్రిస్తున్న శ్రీహిత అనే 9 నెలల చిన్నారిని ప్రవీణ్ అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం జరిపి చంపేశాడు. ఈ హత్యపై వరంగల్ పట్టణం ఆగ్రహంతో ఊగిపోయింది. అలాగే, ప్రవీణ్‌కు ఎలాంటి న్యాయం సహాయం చేయరాదని వరంగల్ బార్ కౌన్సిల్ తీర్మానం చేసి, అలాగే నడుచుకుంది.
ఈ క్రమంలో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. ఫలితంగా ఈ కేసు విచారణ కేవలం 48 రోజుల్లో పూర్తి చేశారు. అలాగే, 30 మందికిపైగా సాక్షులను విచారించారు.
అన్నిటికంటే ముఖ్యంగా, నేరం చేసినట్టు ముద్దాయి ప్రవీణ్ జడ్జి జయకుమార్ ఎదుట అంగీకరించాడు. దీంతో ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ మొదటి అదనపు కోర్టు జిడ్జి జయకుమార్ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.