Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉన్నావ్ రేప్ కేసు: 'ఎన్నాళ్లు భయపడతాం? చంపేస్తే చంపేయనీయండి'

Advertiesment
ఉన్నావ్ రేప్ కేసు: 'ఎన్నాళ్లు భయపడతాం? చంపేస్తే చంపేయనీయండి'
, శుక్రవారం, 2 ఆగస్టు 2019 (14:16 IST)
''ఎన్నాళ్లు భయపడతాం? చంపేస్తే చంపేయండి. ఇంతమందిని చంపారు, మమ్మల్నీ చంపుతారు. అయినా ఏమవుతుంది?'' ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి నోటి వెంట వచ్చిన ఈ మాటల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది. ఆమెను లఖ్‌నవూలోని ఆస్పత్రిలో బీబీసీ కలిసింది. ఆ ఆస్పత్రిలోని ఐసీయూలోనే వెంటిలేటర్ మీద ఆమె కుమార్తెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

 
బాధితురాలి పరిస్థితి ఇప్పుడెలా ఉందని మేము అడిగినప్పుడు.. రెండ్రోజులుగా తాను తన బిడ్డను చూడలేదని, తమను దూరంగా ఉండాలని ఆస్పత్రిలో అంటున్నారని ఆమె చెప్పారు. "నా బిడ్డ కళ్లు తెరవట్లేదు. మాట్లాడట్లేదు. ఇప్పుడు బాగుందో, లేదో తెలీదు. ఆ దేవుడికే తెలియాలి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 
ఈ పోరాటమంతా ఎందుకు అని మీకెప్పుడైనా అనిపించిందా? అని అడిగినప్పుడు... "కుల్దీప్ (నిందితుడు) జైళ్లో కూర్చొనే ఇదంతా నడిపిస్తున్నాడు. మేము పోరాడకుండా ఉండిపోయినా వాళ్లు మమ్మల్ని వదలిపెట్టరు. మా పోరాటం ఇప్పుడు కీలకదశలో ఉంది. మా కుటుంబంలో చాలామంది సభ్యులను ఆయన చంపించాడు. మాకు న్యాయం జరుగుతుందన్న ఆశే లేదు. మా ఇంట్లో ఇక మిగిలింది పిల్లలే. మమ్మల్ని పోషించేవాళ్లు ఎవరూ లేకుండా పోయారు. మేమెక్కడికి పోవాలి?" అని ఆమె దీనంగా ప్రశ్నించారు.

 
మీ అమ్మాయి ముఖ్యమంత్రి ఇంటి ముందు నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది కదా అని అన్నప్పుడు.. "మా కుటుంబంలో అందరూ అలాగే అనుకున్నారు. మనకు న్యాయం జరగనప్పుడు మనందరం చచ్చిపోదామని నా కూతురు చెప్పింది. మమ్మల్ని పోషించేవాళ్లెవరూ ఇంట్లో మిగలనపుడు చావు తప్ప మరే దారి ఉంటుంది?" అని ఆమె అన్నారు.

 
ఆత్మహత్యకు యత్నించిన మీ బిడ్డను ఆపేందుకు మీరు ప్రయత్నించారా? అని అడిగితే, "లేదు, ఆపలేదు. నువ్వు చనిపోవాలనుకుంటే, నీతో కలిసి మేమంతా చనిపోతామని చెప్పాం" అని ఆ తల్లి చెప్పారు. ఈ కేసులో నిందితుడు కుల్‌దీప్ సింగ్ సెంగర్‌ను అరెస్టు చేశాక, మీకు ఊరట కలిగినట్టయ్యిందా? అని అడిగితే... "ఏం ఊరట ఉంటుంది? అతను జైళ్లో ఉన్నా కూడా అతని వద్ద మొబైల్ ఫోన్ ఉంది.


జైలు నుంచే అతడు బయటివారితో మాట్లాడుతున్నాడు. నా భర్త చనిపోయారు. ఏదో ఒకరోజు కుల్‌దీప్ బయటకు వచ్చి తన భార్యాపిల్లలను, కుటుంబ సభ్యులను కలుసుకుంటాడు. కానీ, మా కుటుంబ సభ్యులు మాత్రం శాశ్వతంగా దూరమైపోయారు. వాళ్లిక మాకోసం తిరిగి రాలేరు. చనిపోయారు. ఇక వాళ్లను ఎన్నటికీ చూడలేం."

 
"నిరంతరం మమ్మల్ని భయం వెంటాడుతుంది. కానీ ఎలాగోలా బతకాలి కదా. వాళ్లు మమ్మల్ని చంపాలనుకుంటే చంపెయ్యనీ అన్నట్టుగా మా ఆలోచనలు తయారయ్యాయి. రోజూ చస్తూ బతకలేకపోతున్నాం. మాకింకా జరిగేదేముంది? ఇప్పటికే మాలో చాలా మందిని చంపేశారు. మమ్మల్ని కూడా చంపేస్తారు. అంతే కదా." అని ఆమె అన్నారు.

 
అన్ని కేసులనూ దిల్లీకి బదలాయించిన సుప్రీం కోర్టు
ఉన్నావ్ అత్యాచారంతో ముడిపడి ఉన్న అన్నికేసుల విచారణలనూ సుప్రీం కోర్టు దిల్లీకి బదలాయించింది. వీటి విచారణ బాధ్యతలను ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీబీఐ కోర్టు నుంచి దిల్లీ ట్రయల్ కోర్టుకు అప్పగించింది. బాధితురాలి కుటుంబం రాసిన ఓ లేఖపై విచారణ జరుపుతూ గురువారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ నిర్ణయం వెల్లడించారు.

 
అత్యాచారం కేసుపై రోజూవారీగా వాదనలు విని, 45 రోజుల్లోగా విచారణను పూర్తి చేయాలని దిల్లీ ట్రయల్ కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. ఉన్నావ్ అత్యాచారం కేసు సహా మొత్తం ఐదు కేసుల్లో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్ సెంగర్ నిందితుడిగా ఉన్నారు. ఆయనపై న్యాయపోరాటం చేస్తున్న బాధితురాలు ప్రయాణిస్తున్న కారు రాయ్‌బరేలీలో ఆదివారం నాడు ప్రమాదానికి గురైంది. ఆ కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది.

 
ఈ ఘటనలో బాధితురాలు, ఆమె న్యాయవాది తీవ్రగాయాల పాలయ్యారు. ఆమె దగ్గరి బంధువులు ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి సెంగర్ సహా 10 మందిపై హత్య కేసు నమోదైంది. దర్యాప్తు బాధ్యతలను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ దర్యాప్తును కూడా ఏడు రోజుల్లో పూర్తి చేయాలని సీబీఐని సీజేఐ ఆదేశించారు. అవసరమైతే ఈ గడువును మరో వారం పొడగించుకోవచ్చని పేర్కొన్నారు.

 
మరోవైపు అత్యాచార బాధితురాలికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలని, శుక్రవారం లోగా దీన్ని అందజేయాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. బాధితురాలి కుటుంబానికి, న్యాయవాదికి సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో రక్షణ కల్పించాలని కూడా నిర్దేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీశైలానికి కొనసాగుతున్న నీటి ప్రవాహం