అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉండి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కండువాలు మార్చుకుంటున్న ఆయారాం, గయారాంలకు ఇక మీదట పార్టీలో చోటుండదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లా పర్యటలో భాగంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోస్తూ, కష్టపడుతున్నవారికే ప్రాధాన్యం కల్పిస్తాం.. జిల్లాలో పార్టీకి పునర్వైభవం తీసుకురండి.. మీకు గౌరవం తెచ్చే బాధ్యత నాది అంటూ విజ్ఞప్తి కార్యకర్తలు, నాయకులకు సూచించారు.
కడప జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం నగర శివారులోని సాయి శ్రీనివాస కల్యాణ మండపంలో నిర్వహించిన తెదేపా జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలోనే జిల్లాలోని కంబాలదిన్నెలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశామని, ప్రస్తుత ప్రభుత్వం బ్రహ్మణి భూముల్లో పరిశ్రమకు మరోసారి శంకుస్థాపన చేయడానికి అడుగులు వేస్తోందని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం తాము అధికారంలో ఉండి ఉంటే అక్కడ పనులు ముమ్మరంగా జరుగుతుండేవని చెప్పారు. ఉక్కు.. కడప హక్కు అని.. జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం అవసరమైతే పోరాటం చేస్తామన్నారు. ప్రజాప్రతినిధుల నేతృత్వంలో జిల్లాలో వెలికితీసిన ఇసుకను బెంగుళూరుకు తరలిస్తున్నారని, ఇందుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ ప్రారంభమైన కొత్తలో ఇక్కడ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినట్లుగా గుర్తుచేశారు. తెదేపా నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు.