Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధాని పరిధిలో నిర్మాణాలు కొనసాగించండి : సీఎం జగన్ ఆదేశం

రాజధాని పరిధిలో నిర్మాణాలు కొనసాగించండి : సీఎం జగన్ ఆదేశం
, మంగళవారం, 26 నవంబరు 2019 (13:32 IST)
సీఆర్‌డీఏ పరిధిలోని ప్రభుత్వ నిర్మాణాల సముదాయం, భవనాల నిర్మాణ విషయంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు చేపట్టాలని సీఎం వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు తగినట్టుగా ప్రాధాన్యతా క్రమంలో వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 
 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులును దృష్టిలో పెట్టుకుని, అనవసర ఖర్చులకు పోకుండా నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్లాలన్నారు. పూర్తికావొస్తున్న వాటిపై ముందు దృష్టిపెట్టాలని, ఇందుకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. పనుల నిర్మాణంలో రివర్స్‌ టెండరింగ్‌కు వెళితే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందన్నారు. 
 
సీఆర్డీఏ పరిధిలో ఇంతవరకూ జరిగిన పనులు, చేసిన ఖర్చులు, వివిధ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయన్నదానిపై సీఎం సమగ్రంగా అధికారులతో సమీక్షించారు. సీఆర్‌డిఏ పరిధిలో రోడ్ల డిజైన్‌ గురించి అధికారులను పూర్తి వివరాలు అడిగిన సీఎం, ప్లానింగ్‌లో ఎక్కడా తప్పులుండకూడదన్నారు. రహదారుల ప్రతిపాదనల విషయంలో ఖర్చు, డిజైన్లు తదితర అంశాలపై ఐఐటీ లాంటి ప్రముఖ సంస్థల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. 
 
కృష్ణా నది సమీపంలో కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రవాహ పరిస్ధితిపై అధికారులతో చర్చించారు. వైకుంఠపురం రిజర్వాయర్‌ నిర్మాణం, నీటి వినియోగం వంటి అంశాలపై ఆరా తీశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం చేయగా మిగిలిన భూమిని ల్యాండ్‌స్కేపింగ్‌ చేసి సుందరీకరించాలన్నారు. మౌలికసదుపాయాల కల్పనలో అనవసర వ్యయం తగ్గించి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
 
రాజధానిలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేసి.. వారికి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యన్నారాయణ,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, సీఆర్‌డిఏ కమీషనర్‌ లక్ష్మీ నరసింహం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినీతి నిర్మూలనపై ఏపి ప్రభుత్వం మరో చర్య... ఏంటది?