Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవినీతి నిర్మూలనపై ఏపి ప్రభుత్వం మరో చర్య... ఏంటది?

అవినీతి నిర్మూలనపై ఏపి ప్రభుత్వం మరో చర్య... ఏంటది?
, మంగళవారం, 26 నవంబరు 2019 (13:28 IST)
పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక చర్య తీసుకుంది. పౌరులనుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు 14400 కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సీఎం వైయస్‌.జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆ తర్వాత నేరుగా కాల్‌సెంటర్‌కి ఫోన్‌ చేసి ఫిర్యాదులను స్వీకరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. 
 
ఫిర్యాదుల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎంత కాలవ్యవధితో పరిష్కరిస్తారన్న విషయాలపై సీఎం స్వయంగా కాల్‌సెంటర్‌ ఉద్యోగితో మాట్లాడారు. కొన్ని సూచనలు కూడా చేశారు. ఫిర్యాదు అందిన 15 రోజుల నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి దానిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
బాధితుల ఫిర్యాదులపై ఎట్టి పరిస్ధితుల్లోనూ నిర్లక్ష్యం తగదని, కచ్చితంగా జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. వ్యవస్ధపై నమ్మకం కలగాలంటే కాల్‌సెంటర్‌కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతోపాటు సంబంధిత శాఖల అధికారులు కూడా వాటిని పరిష్కరించడంలో చొరవ తీసుకోవాలన్నారు. 
 
ఈ కార్యక్రమంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ, డిజిపి గౌతం సవాంగ్, ఏసీబీ డీజీ కుమార విశ్వజిత్, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ టి. విజయ్‌కుమార్‌రెడ్డి, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌ – అహ్మదాబాద్‌ ప్రొఫెసర్‌ సుందరవల్లి నారాయణమూర్తితో పాటు ఏసీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
 
14400 కాల్‌ సెంటర్‌ వారంరోజులూ 24 గంటలపాటు పనిచేస్తుంది. ఫిర్యాదు చేసినవారి వివరాలను, వారితో కాల్‌సెంటర్‌ ఉద్యోగి చేసిన సంభాషణలను రహస్యంగా ఉంచుతారు. కంప్లైంట్‌ను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. సంబంధిత జిల్లాలకు చెందిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఈఫిర్యాదును పంపిస్తారు. అంతేకాక ఎక్కడ ఉన్నా కంప్యూటర్లో  లాగిన్‌ అయి ఏయే ఫిర్యాదులు వచ్చాయో తెలుసుకునే అవకాశం అధికారులకు ఉంటుంది. 
 
అలాగే ఉన్నతాధికారులు కూడా ఈ వెబ్‌సైట్లో లాగిన్‌ కావడం ద్వారా ఎప్పటికప్పుడు అవినీతిపై ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు తీరును పరిశీలిస్తారు. అవినీతి నిర్మూలన పారదర్శకతకోసం ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వికేంద్రీకరణతో పాటు పాలనలో జవాబుదారీతనం పెంచడానికి బహుముఖ ప్రయత్నాలు చేస్తోంది. 
 
1. గ్రామ సచివాలయాల ఏర్పాటు, వాలంటీర్ల నియామకం
2. జుడిషయల్‌ ప్రివ్యూ
3. రివర్స్‌ టెండరింగ్‌
4. ఇసుక అక్రమాలపై 14500 కాల్‌సెంటర్, తప్పిదాలకు పాల్పడితే రూ.2లక్షల జరిమాన, 2 ఏళ్ల జైలుశిక్ష, టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు
5. ప్రభుత్వశాఖల్లో అవినీతిని తగ్గించడానికి అధ్యయనం, సిఫార్సులకోసం ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్‌ సంస్థ అహ్మదాబాద్‌ ఐఐఎంతో అవగాహన ఒప్పందం ఏర్పాటు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం కేసీఆర్ పెంపుడు కుక్క హస్కీ మృతి కేసు మిస్టరీ వీడింది..