ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపి, ప్రభుత్వ పాలనా తీరును విమర్శిస్తే బెదిరిస్తారా? ఏం పీకుతారు మీరు అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు.
ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపి, ప్రభుత్వ పాలనా తీరును విమర్శిస్తే బెదిరిస్తారా? ఏం పీకుతారు మీరు అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. వైజాగ్‌లోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణను నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం పాల్గొని తన మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీసీఐ ప్రవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీకి ఓట్లు వేయమని ఆరోజు నేను మిమ్మల్ని అడిగాను. సమస్యలు వస్తే ఎవరినైనా నిలదీయడానికి వెనుకాడబోనని మీకు మాటిచ్చాను. అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చాను అని తెలిపారు.
తన మాట నమ్మి ఓట్లు వేసిన మీరు సమస్యల్లో ఉంటే నేను తప్పించుకుని తిరగలేను. ఇక్కడ లోకల్ ఎంపీ హరిబాబుగారు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌గారు, కేంద్ర మంత్రి అశోకగజపతిరా రాజు, ఇంకా బీజేపీ నేతలు తప్పించుకోవచ్చేమో.. నేను అలా చేయలేను. అందుకే మీ తరపున పోరడడానికి ఇక్కడికి వచ్చాను. మీ బాధలు పంచుకోవడానికి ఎవరు లేకపోయినా జనసేన పార్టీ ఉంది అని ప్రకటించారు.
అంతేకాకుండా, తనకు కులమతాలు లేవన్నారు. తాను టీడీపీ లేదా బీజేపీ పక్షమో కాదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల, దేశ ప్రజల పక్షమన్నారు. ప్రజల కోసం తన ప్రాణాలు సైతం అర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. తన వ్యక్తిగత పనుల కోసం ఏ ఒక్కరి వద్దకూ వెళ్ళలేదన్నారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం సెన్సార్ విషయంలో సమస్య ఉత్పన్నమైతే తాను ఎవరినీ సంప్రదించలేదని గుర్తు చేశారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే నిలదీస్తానని, ఇలాంటి వారు వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఏపీ రాష్ట్రాన్ని విభజన సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయన్నారు. అయితే, తన ప్రయాణంలో పొరపాట్లు జరగొచ్చు. కానీ, తప్పులు చేయనని, అలాగే, తప్పులు చేసే వారిని వెనుకేసుకుని రానని స్పష్టంచేశారు. అదేసమయంలో తనకు అధికార దాహం లేదనీ, కానీ అధికారం విలువ, బాధ్యత తెలుసన్నారు.