చలోరే చలోరే చల్ - జనంలోకి జనం కోసం జనసేనాని.. పాట (వీడియో)
భారత రాజ్యాంగ నిర్మాత, భారత జాతి స్ఫూర్తి ప్రదాత స్వర్గీయ అంబేద్కర్ 61వ వర్థంత సందర్భం గా ఆయనకు నా తరపున, జనసేన శ్రేణుల తరపున శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను. ఆయనకు నివాళిగా ఆయన ఆశలు, ఆశయాలకు అ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన కార్యకర్తలు, ప్రజలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఓ లేఖను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ లేఖలో ఎలాంటి వివరాలున్నాయంటే..
బలిదానాలు బాధాకరం
రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటనలో భాగంగా రేపటి నుంచి మీ ముందుకు వస్తున్నాను. ముందుగా విజయనగరం, ఉస్మానియా యూనివర్శిటీలలో ఆత్మార్పణం చేసుకున్న యువకులు వెంకటేష్, మురళి, కృష్ణ నదిలో జరిగిన ప్రమాదంలో ఆశువులు బాసిన వారి కుటుంబాల వారిని పరామర్శించడం నా విధిగా భావిస్తున్నాను. అయితే ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి మురళి కుటుంబాన్ని ప్రత్యక్షంగా పరామర్శించడానికి పోలీస్ ఆంక్షలు అడ్డంకిగా వున్నందున ఈ సందర్భంగా నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. మురళి సోదరుడు రాజుతో మాట్లాడినప్పుడు అతని దుఃఖం నన్ను తీవ్రంగా కలచి వేసింది. పోలీసులు ఆంక్షలు సడలించిన తర్వాత నేను స్వయంగా వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించుకున్నాను.
యువతలో రాజకీయ పక్షాలు, పభుత్వాలు ఆశలు రేకెత్తించి వాటిని అమలు చేయకపోతే వచ్చే దుష్పరిమాణాలకు వెంకటేష్ మురళీల ఆత్మహత్యలే నిదర్శనం. యువతలో నిర్వేదం, నిరాశ చోటుచేసుకోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై వుంది. ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వాల విధి. ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. యువత నిరాశ నిస్పృహలకు లోను కావద్దని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. విలువైన మీ ప్రాణాలను తీసుకొని తల్లిదండ్రులకు శోకం మిగల్చకండి. పోరాడండి.. సాధించండి.. నేను, నాతో పాటు జనసేన సైతం మీకు అండగా ఉంటాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పర్యటించాలని నిర్ణయించుకున్నాను. తొలి విడత పర్యటన సమస్యలపై పరిశీలన, అధ్యయనం, అవగాహన కోసం కాగా రెండో విడత పర్యటనలో ఆయా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే సరే, లేని పక్షంలో ప్రభుత్వ బాధ్యతను (పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ) గుర్తు చేస్తాము. అప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకుంటే మూడో విడత పర్యటనను పోరాట వేదికగా మారుస్తాము.
నేను ఇటీవల జరిపిన ఇంగ్లాండ్ పర్యటనలో నన్ను అంతర్మథనంలో పడవేసిన సంఘటన ఒకటి జరిగింది. విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణ నదిలో జరిగిన పడవ ప్రమాదాన్ని ప్రస్తావించాడు. తెలుగు దేశం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పడవ ప్రమాదంలో 21 ప్రాణాలు కోల్పోయారు.
తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నికల సమయంలో మీరు ప్రచారం చేసినందున మీరు కూడా బాధ్యులు కాదా అని ప్రశ్నించాడు. ఆలోచిస్తే ఆ యువకుడు అడిగిన ప్రశ్నలో సహేతుకత ఉందనిపించింది. అందువల్ల కృష్ణ నది పడవ ప్రమాదం, బీజేపీ ప్రభుత్వం తీసుకున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ కారణంగా ఆ సంస్థ ఉద్యోగి వెంకటేష్ ఆత్మహత్య ఉదంతంలో నా వంతు బాధ్యత కూడా ఉందని అంగీకరిస్తున్నాను. వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపే బయల్దేరి వెళుతున్నాను.
ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు.. కలల ఖనిజాలతో చేసిన యువత.. వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు.. అన్నాడు మహా కవి గుంటూరు శేషేంద్ర శర్మ. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువత నిరాశ నిస్పృహలతో వున్నారు. ఇది దేశానికి క్షేమకరం కాదు. ఇటు బాసర ఐ.టి.ఐ., ఉస్మానియా విద్యార్థులు, అటు కడపలోని ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు తీవ్ర ఆవేదనతో వున్నారు.
వారి సమస్యను పరిష్కరించడానికి జనసేన తనవంతు ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగ హామీ ఇస్తున్నాను. యువతను జాగృత పరచడానికి జనసేన రూపొందించిన ఛలో రే ఛలో గీతాన్ని ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నాము. గుంటూరు శేషేంద్ర శర్మ సాహిత్యాన్ని ఈ గీతంలో నేను పలకటం మహద్బాగ్యంగా భావిస్తున్నాను.
అంబేద్కర్‌కు నివాళి
భారత రాజ్యాంగ నిర్మాత, భారత జాతి స్ఫూర్తి ప్రదాత స్వర్గీయ అంబేద్కర్ 61వ వర్థంత సందర్భం గా ఆయనకు నా తరపున, జనసేన శ్రేణుల తరపున శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను. ఆయనకు నివాళిగా ఆయన ఆశలు, ఆశయాలకు అనుగుణంగా జనసేన పయనం సాగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆశలకు వాస్తవాలకు పొంతన లేక కునారిల్లిపోతున్న ప్రస్తుత యువత పరిస్థితి ఇలా వుంటుందని ఆయన ఊహించి ఉంటే రాజ్యాంగంలో ఓ అధ్యాయాన్ని యువత భవిష్యత్తు కోసం రాసి వుండేవారని అనిపిస్తోంది. ఆ మహానేతకు జనసేన వినమ్రగా అంజలి ఘటిస్తోంది.
పవన్ కల్యాణ్
(అధ్యక్షులు - జనసేన పార్టీ)