Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరస్పర సహకారం, సంప్రదింపులు:నీతి ఆయోగ్‌ సమావేశంలో జగన్

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:20 IST)
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో (వీడియో కాన్ఫరెన్సు ద్వారా) నీతి ఆయోగ్‌ 6వ పాలక మండలి సమావేశం. జరిగింది. ఈ సందర్భంగా జగన్ ఏమన్నారంటే...!
 
పరస్పర సహకారం, సంప్రదింపులు:
‘కోవిడ్‌ మహమ్మారితో ఆర్థిక పరిస్థితి తలకిందులైన నేపథ్యంలో జరుగుతున్న నీతి ఆయోగ్‌ 6వ పాలక మండలి సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కోవిడ్‌ కారణంగా దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం, సంప్రదింపుల ద్వారా పరిశీలించాలి. అందు కోసం అర్థవంతమైన చర్చలు జరగాలి. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేలా ఒక నిర్దిష్ట విధానాన్ని రూపొందించుకోవాలి’.
 
ప్రస్తుత పరిస్థితుల్లో..:
ఇవాళ్టి సమావేశంలో ప్రస్తావిస్తున్న, చర్చించనున్న ఆరు ప్రధాన అంశాలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకమైనవి.
 
‘మేకింగ్‌ ఇండియా ఎ గ్లోబల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌’:
‘భారత్‌ను ఉత్పత్తి, తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలన్న లక్ష్య సాధనకు సంబంధించి చెప్పాలంటే.. తొలుత ఈ రంగంలో అద్భుత విజయాలు సాధించిన దేశాలు అవలంబించిన విధానాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. అన్ని వాస్తవాలను నిశితంగా విశ్లేషించుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం ఉత్పత్తి, తయారీ రంగంలో భారత్‌ విజయానికి ఐదు రకాల అంశాలు అవరోధంగా మారాయి’.
 
అవి ఈ అంశాలు:
‘‘రుణాలపై అధిక వడ్డీల భారం, విద్యుత్‌ ఖర్చులు అధికంగా ఉండడం, భూ సేకరణలో జాప్యం,  అనుమతుల మంజూరులో సంక్లిష్టత, భారత్‌ దేశంలో ఉత్పత్తి, తయారీ రంగానికి అవరోధంగా మారాయి. కాబట్టి వీటన్నింటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారా సంస్కరణలు తీసుకువచ్చి ఉత్పత్తి, తయారీ రంగంలో ఉన్న అవరోధాల నుంచి గట్టెకాల్సి ఉంది’.
 
మరింత వివరంగా..:
‘పైన ప్రస్తావించిన అంశాలనే మరింత వివరంగా చెప్పాలంటే..మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ వంటి ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలకు కూడా అధిక వడ్డీ, అంటే 10 నుంచి 11 శాతం వరకు వార్షిక వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలకే ఈ పరిస్థితి ఉంటే, ఇక ప్రైవేటు రంగం పరిస్థితి ఏమిటన్నది ఆలోచించండి.

ఇంత వడ్డీల భారం మోస్తూ, ఉత్పత్తి, తయారీ రంగం ఎలా పురోగమిస్తుంది?. ఈ విషయంలో ఇతర దేశాలతో ఎలా పోటీ పడగలుగుతాము?. తయారీ రంగంలో ముందుంటున్న దేశాల్లో పరిశ్రమలకు ఇచ్చే రుణాలకు వడ్డీ రేట్లు 2 నుంచి 3 శాతానికి మించి ఉండటం లేదు. అదే విధంగా విద్యుత్‌ టారిఫ్‌, కొన్ని దేశాలలో యూనిట్‌ విద్యుత్‌ను రూ.3 కంటే తక్కువకే సరఫరా చేస్తున్నారు’.
 
పనితీరు ఆధారంగా రాయితీలు:
‘ఇక రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోంది. భారత్‌ను ఉత్పత్తి, తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను  అనుసరించి, కొత్తగా ఏర్పాటు అయ్యే పరిశ్రమలకు ‘పనితీరు ఆధారంగా రాయితీలు’ (పర్ఫార్మెన్స్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌)ను ప్రోత్సహిస్తోంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జిల్లా వాణిజ్య సంస్కరణ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా 229 సంస్కరణలు అమలు చేస్తోంది’.
 
ప్రత్యేక హోదా వల్లనే..:
‘వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు పూర్తిగా సానుకూల పరిస్థితులు కల్పించడంతో పాటు, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. ‘ముఖ్యంగా విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఎంతో నష్టపోయింది.

రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. ఏపీలో కనీసం టయర్‌–1 నగరం కూడా లేదు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ అవకాశాల కల్పన, ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు, పారిశ్రామికంగా వేగంగా ఎదగడం కేవలం.. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ వల్లనే సా«ధ్యమవుతుంది. రాష్ట్రానికి బేషరతుగా ప్రత్యేక హోదా ఇస్తామని విభజనకు ముందు పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు.
 
‘వ్యవసాయ రంగం’:
‘దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోంది వ్యవసాయ రంగం. దేశ వ్యాప్తంగా దాదాపు 60 శాతం ఈ రంగంపై ఆధారపడగా, రాష్ట్రంలో దాదాపు 62 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఈ రంగంలో కూడా పలు అవరోధాలు ఉన్నాయి. వాటన్నింటినీ గట్టెక్కిస్తే ఈ రంగాన్ని ఎంతో ప్రోత్సహించినట్లు అవుతుంది. అందు కోసం వ్యవసాయం, అనుబంధ రంగాలలో అయిదు రకాల చర్యలు చేపట్టాల్సి ఉంది’.
 
ఏమేం చేయాలి?:
‘పంటల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, నాణ్యమైన విత్తనాలు, సర్టిఫై చేసిన ఎరువులు, పురుగు మందులను మాత్రమే రైతులకు అందుబాటులో తీసుకు రావడం, పంటల స్టోరేజీ, గ్రేడింగ్, ప్రాససింగ్‌లోకొత్త టెక్నాలజీని అలవర్చుకోవడంతో పాటు, రైతులు తమ పంటలను సరైన ధరకు ఫాం గేట్‌ వద్దే అమ్ముకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

రైతుల ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర రానప్పుడు ప్రభుత్వమే ఆదుకునే విధంగా కచ్చితంగా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. ఆ నిధి ఏర్పాటు కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తక్కువ రుణానికే రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు అందేలా చూడాలి’.

‘ఇంకా ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోయిన పక్షంలో సకాలంలో వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కచ్చితంగా సాగు చేసే భూమి విస్తీర్ణం కూడా పెరగాలి. ఈ చర్యలన్నింటి వల్ల వ్యవసాయ రంగం మరింత బలోపేతం కావడంతో పాటు, రైతుల ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది’.
 
రైతు భరోసా కేంద్రాలు:
‘రైతులకు సహాయకారిగా, అండగా ఉండేందుకు రాష్ట్రంలో 10,731 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. విత్తనాలు మొదలు పంటలు అమ్ముకునే వరకు రైతులకు అడుగడుగునా చేదోడుగా ఉండేలా ఆ కేంద్రాలు పని చేస్తున్నాయి. మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం.

వాటిలో డ్రై స్టోరేజీలు, డ్రై ప్లాట్‌ఫామ్స్, కలెక్షన్‌ కేంద్రాలు, ప్రైమరీ ప్రాససింగ్‌,ఎస్సేయింగ్‌ ఎక్విప్‌మెంట్‌, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, ఆటోమేటిక్‌ పాల సేకరణ కేంద్రాలు, ఫుడ్‌ ప్రాససింగ్‌యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేయడాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను’.

రాష్ట్రంలో ఇంకా ‘సేంద్రీయ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నాం. ప్రతి ఆర్బీకేలో సేంద్రీయ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తూ, ఆ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం’. ‘ఇంకా రాష్ట్రంలో సాగునీటి రంగానికి ఎంతో అండగా నిల్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులో సవరించిన అంచనాలకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నాను’.
 
‘ఫిజికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి’:
‘దారిద్య్ర నిర్మూలన, ఆర్థిక పురోగతిలో ఇది ఎంతో కీలకమైన అంశం. అందుకే విద్యుత్, రహదారులు, నౌకాశ్రయాల వంటి వాటితో పాటు, సామాజిక మౌలిక సదుపాయాలైన విద్య, ఆరోగ్యం, శానిటేషన్‌ వంటి ముఖ్యమైన అంశాలలో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదు’. 
 
సంప్రదాయేతర విద్యుత్‌:
‘విద్యుత్‌ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో రాష్ట్రంలో సంప్రదాయేతర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నాం. ఆ దిశలో 10 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇటీవల టెండర్‌ ప్రక్రియను కూడా చేపట్టాం. దీంతో రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2.48కే అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రం ఇప్పుడు యూనిట్‌ విద్యుత్‌ను సగటున రూ.5.2 కు కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు సౌర విద్యుత్‌తో ఆ వ్యయం గణనీయంగా తగ్గనుంది.
 
ఇంకా రివర్స్‌ పంపింగ్‌ టెక్నాలజీ ద్వారా మరో 33 వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా చొరవ తీసుకుని రివర్స్‌ పంపింగ్‌ టెక్నాలజీ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించి జాతీయ స్థాయిలో ఒక విధానం రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా విద్యుత్‌ ఉత్పత్తి కోసం తీసుకున్న రుణాలపై ఇప్పుడు ఉన్న వడ్డీలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’.
 
విద్య–వైద్య, ఆరోగ్య రంగాలు:
‘దేశ సామాజిక, ఆర్థిక పురోగతిలో విద్య, వైద్య రంగాలు ఎంతో కీలకమైనవి. అందుకే ఆ రెండింటిలో సమగ్ర మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం చేపట్టింది. 
 
విద్యా రంగంలో నాడు–నేడు:
‘ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46 వేల ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలతో పాటు, ప్రభుత్వ హాస్టళ్లను పూర్తిగా మారుస్తున్నాం. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు సాధించడంతో పాటు, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపర్చే విధంగా అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంగ్లిషు మీడియంను తీసుకువచ్చాం’.
 
ఆరోగ్య రంగంలో నాడు–నేడు:
‘మీ అందరికీ తెలుసు. విభజన వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. రాష్ట్రంలో కనీసం టయర్‌–1 నగరం కూడా లేకపోగా, మెరుగైన వైద్య సదుపాయం కూడా కొరవడింది. అందుకే వైద్య, ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం నాడు–నేడు కార్యక్రమం అమలు చేస్తున్నాం.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో నాడు–నేడు కింద పలు మార్పులు చేస్తూ, అభివృద్ధి పనులు చేస్తున్నాం’.

‘గ్రామాల్లో 10 వేలకు పైగా విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ప్రారంభిస్తున్నాం. కొత్తగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో మూడింటికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కాబట్టి మిగిలిన 13 వైద్య కళాశాలలకు కూడా అనుమతి ఇవ్వడంతో పాటు, ఆర్థికంగా కూడా సహాయం చేయాలని కోరుతున్నాను’.
 
ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో..:
‘గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు ఉంటే గ్రామాల్లో తప్పనిసరిగా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది తప్పనిసరిగా ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’.
 
‘ఇంప్రూవింగ్‌ గవర్నెన్స్‌’:
‘పరిపాలనలో సంస్కరణలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో ముఖ్యం. అందుకే ఆ దిశలో ఎన్నో చర్యలు తీసుకు వచ్చాం. పరిపాలన వికేంద్రీకరణే కాకుండా సమర్థవంతంగా టెక్నాలజీని కూడా వాడుకుంటున్నాం. ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం. సేవలు అందిస్తున్నాం’.
 
సచివాలయాల వ్యవస్థ:
‘రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించాం. మొత్తం 540 రకాల అత్యవసర సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్నాం’.
 
ఇంటింటికీ ఇంటర్నెట్‌:
‘అన్ని గ్రామాలకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడం ద్వారా ఈ సేవలు మరింత మెరుగవుతాయి. భారత్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ దిశ లోనే  రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చర్యలను చేపడుతుంది. గ్రామస్థాయిలో ప్రతి పౌరుడికీ, ప్రభుత్వ వ్యవస్థకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తాం.

ఇంకా గ్రామాల్లో పబ్లిక్‌ డిజిటల్‌ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకువచ్చి వర్క్‌ ఫ్రమ్‌ హోంను అందుబాటులోకి తీసుకు వస్తాం’. అంటూ వర్చువల్‌ విధానంలో జరిగిన నీతి ఆయోగ్‌ 6వ పాలక మండలి సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం