తెలుగు వారికి మాత్రమే సొంతమైన విభిన్న అంశాలు, వంటకాలకు భౌగోళిక సూచి పొందగలిగేలా కార్యాచరణ సిద్దం చేయాలని రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను అదేశించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆంధ్ర
తెలుగు వారికి మాత్రమే సొంతమైన విభిన్న అంశాలు, వంటకాలకు భౌగోళిక సూచి పొందగలిగేలా కార్యాచరణ సిద్దం చేయాలని రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను అదేశించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటీపై ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. అధారిటీ ముఖ్య పరిపాలనా అధికారి హిమాన్హు శుక్లాతో పాటు పలువురు అధికారులతో విభిన్న అంశాలను చర్చించారు.
ఈ నేపధ్యంలో మీనా మాట్లాడుతూ తెలుగునాట పోషక విలువలతో కూడిన పసందైన వంటకాలకు కొదవ లేదని, తెలుగుదనం ప్రతిబింబించే వీటిని జన బాహుళ్యంలోకి మరింతగా తీసుకువెళ్లేలా వాటికి భౌగోళిక సూచి పొందాలని సూచించారు. ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి భౌగోళిక సూచి తమదేనంటూ అయా ప్రాంతాలు, దేశాలు పోరాటం చేస్తున్న తరుణంలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేలా భౌగోళిక సూచీలు దక్కించుకోవటం కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు.
ఎవరి స్థాయిలో వారు నిర్ణయాధికారం కలిగి ఉంటారని, ప్రతి చిన్న అంశానికి ఉన్నత స్థాయిలోనే నిర్ణయాలు జరగవలసిన అవసరం లేదన్నారు. ఔత్సాహిక పెట్టుబడిదారులకు అందించవలసిన స్వాగత కిట్‌లో సమస్త సమాచారం ఉండాలని, వారు మరెవ్వరినీ సంప్రదించవలసిన అవసరం ఎదురు కారాదన్నారు. గండికోటను జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపొందించేందుకు నిర్ధేశిత కాల వ్యవధి కార్యక్రమం అమలు జరగాలన్నారు. భవాని ద్వీపంకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్దం చేయటంలో జాప్యం చోటుచేసుకోవటంపై అధికారులను మందలించారు.
ఇండియా బుక్ ఆప్ రికార్డ్సు కోసం అత్యంత పొడవైన పూతరేకును సిద్ధం చేయటం, ఆ కార్యక్రమాన్ని కూడా పర్యాటక ఆకర్షిత భరితంగా తీర్చిదిద్దటంపై సమావేశంలో చర్చించారు. తెలుగు వంటకాలకు సంబంధించి ప్రతి నెల ఒక కార్యక్రమం ఉండాలని, ఇందుకు అవసమైన సాంవత్సరిక క్యాలెండర్‌ను రూపొందించాలని మీనా ఆదేశించారు. వచ్చే నెలలో నిర్వహించతలపెట్టిన ఆంధ్రా పుడ్ ఫెస్టివల్‌కు తగిన ప్రచారం కల్పించాలన్నారు. పోలవరం, మధురవాడ మాస్టర్ ప్లాన్‌లు ఎంతవరకు వచ్చాయన్న విషయంపై లోతైన చర్చ సాగగా, పర్యాటక, వాటర్ స్పోర్ట్స్ పాలసీలకు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో ఓఎస్‌డి లక్ష్మణ మూర్తి, ముఖ్య మార్కెటింగ్ అధికారి శ్రీనివాసరావు, ఎపిటిఎ డైరెక్టర్లు సాంబశివరాజు, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.