Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమాఖ్య పరిరక్షణకే ఆర్థిక మంత్రుల సమావేశం... కేంద్రంపై టార్గెట్...

అమరావతి: సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసమే ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో

Advertiesment
State Finance Ministers
, సోమవారం, 7 మే 2018 (20:12 IST)
అమరావతి: సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసమే ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో సోమవారం  జరిగిన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది రాజకీయ సమావేశం కాదని, రాజ్యాంగ పరంగా, పాలనాపరంగా రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పాటు చేసిన సమావేశంగా పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నియమనిబంధనలు, జీఎస్టీ వల్ల ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా నష్టం వాటిల్లుతోందని,  సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలుగుతోందని చెప్పారు. ఎఫ్ఆర్ బీఎం(ఫిస్కల్ రెస్పాన్సబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్) చట్టం ప్రకారం రాష్ట్రాలు పొందే రుణాలపై ఆంక్షలు, పథకాలకు నిధులు కేటాయించడంలో అనుసరించే పద్దతుల వల్ల ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా నష్టం జరుగుతోందన్నారు. 
 
రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నందున ఆర్థిక మంత్రులు సమావేశమై వివిధ అంశాలను చర్చించి, రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం ఒక ముసాయిదాను కూడా రూపొందించామని, దానిని ఆయా ముఖ్యమంత్రులు అంగీకరించిన తరువాత రాష్ట్రపతికి అందజేస్తామన్నారు. సమావేశం ఇక్కడ నిర్వహిస్తున్నందున అన్ని రాష్ట్రాల వారితో తాను మాట్లాడానని చెప్పారు. ఈ సమావేశానికి రానివారు కూడా 15వ ఆర్థిక సంఘంలోని నియమనిబంధనలపై అభ్యంతరం తెలియజేస్తూ  ప్రధాన మంత్రికి లేఖలు రాశారని తెలిపారు.
 
కేరళ ఆర్థిక మంత్రి డాక్టర్ టీఎం థామస్ ఇసాక్ మాట్లాడుతూ జీఎస్టీలో 9 అంశాలకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల తమకు నష్టం వాటిల్లుతున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఆర్ధిక మంత్రి డాక్టర్ అమిత్ మిత్ర మాట్లాడుతూ ఉదయం జరిగిన సమావేశంలో దేశంలోని దక్షిణ, తూర్పు, ఉత్తర ప్రాంతాలకు చెందిన రాష్ట్రాల ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. సమాఖ్య వ్యవస్థకు అద్దంపట్టేవిధంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మూడు గంటల సేపు పాల్గొన్నాట్లు తెలిపారు. 
 
15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం 30 పథకాలను రద్దు చేసిందని చెప్పారు. దాదాపు 28 పథకాలకు గతంలో 10 శాతం ఉన్న రాష్ట్రాల వాటాను 30 శాతం నుంచి 50 శాతానికి పెంచారన్నారు. కేంద్రం రాష్ట్రాల అధికారాల్లోకి చొరబడుతోందన్నారు. తాము కేంద్రానికి వ్యతిరేకం కాదని, సమాఖ్య వ్యవస్థను పరిరక్షించి, రాష్ట్రాల అధికారాలను కాపాడాలన్నదే తమ ప్రధాన ఉద్దేశం అన్నారు. ఆర్థిక మంత్రుల మొదటి సమావేశం గత నెలలో త్రివేండ్రలో జరిగిందని, రెండవ సమావేశం అమరావతిలో జరుపుకున్నామని, మూడవ సమావేశం ఢిల్లీలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
 
పంజాబ్ ఆర్ధిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ తాను భారతీయునిగా, రాజకీయ నాయకునిగా మంచి సమయంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. 1950 నుంచి 1990 వరకు దేశంలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదని, ఒక శాతం మాత్రం అభివృద్ధిచెందినట్లు చెప్పారు. ఆర్థిక పరంగా సమాఖ్య వ్యవస్థను రక్షించవలసిన అవసరం ఉందన్నారు.  కేంద్రం తన సొంత ఎజండాతో సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తోందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితులలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అధికారాలు పరిరక్షించవలసి ఉందన్నారు. ఢిల్లీ డెప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్షపాత ధోరణితో చూస్తోందన్నారు. ఈ సమావేశంలో ఏపి ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర, ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ తదితరులు  పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిడిపి - బిజెపి గొడవలోకి వేంకటేశ్వరుడిని లాగుతున్నారు.. ఎందుకు...?