Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి అడుగడగునా అన్యాయమేనా?: రాజ్యసభలో విజయసాయి

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:20 IST)
పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరచిన హామీలను ఎన్డీయే ప్రభుత్వం తుంగలో తొక్కిందని రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కేటాయింపు మొదలుకుని వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ఆర్థిక ప్యాకేజీ, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల వలన రాష్ట్రానికి వాటిల్లే నష్టం, పోలవరం జాతీయ  ప్రాజెక్ట్‌కు నిధుల విడుదల, విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌, విశాఖ రైల్వే జోన్‌, వాల్తేరు డివిజన్‌ తరలించే ప్రయత్నాల వరకు పలు కీలక అంశాల విషయంలో రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య, సవతి తల్లి వైఖరిని ఆయన ఎండగట్టారు. 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో చేసిన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రపతి తన ప్రసంగంలో ఆకాంక్షించారు.

అందుకే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తున్నాను. రాష్ట్రపతి ప్రసంగం పునర్విభజన చట్టం, అందులో పొందుపరచిన హామీల అమలు విషయంలో ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో అయిదు కోట్ల మంది ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలపై నీళ్ళు గుమ్మరించినట్లయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రాల ఆర్థిక, ద్రవ్య పరిస్థితిపై కేంద్రం మరింతగా దృష్టి సారించాలి. నిధుల కేటాయింపు విషయంలో ముఖ్యంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌ వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలి. జమ్మూ, కాశ్మీర్‌, లధాఖ్‌ వంటి ప్రాంతాల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వాటికి అదనపు నిధులు మంజూరు చేసింది.

అందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉండదు కూడా. కానీ అదే సందర్భంలో  ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రత్యేక అవసరాలను మాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం విస్మరించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జమ్మూ-కాశ్మీర్‌లో ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను త్వరితగతిన ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్రపతి తన ప్రసంగంలో ఉద్ఘాటించారు. కానీ విశాఖపట్నంలో మూడేళ్ళ క్రితం ప్రారంభించిన ఐఐఎం ఇంకా తాత్కాలిక క్యాంపస్‌లోనే నడుస్తున్నా శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అన్నారాయన.
 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయానికి వస్తే రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీ ఇది అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించినపుడే  మాత్రమే పునర్విభజన చట్టానికి సార్థకత చెప్పారు.

హోదా ఇవ్వనపుడు పునర్విభజన చట్టానికి అర్థమే లేదని ఆయన వాదించారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం అంగీకరించడం లేదని చెబుతూ ఎన్డీయే మంత్రులు పదేపదే పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించి సభను తప్పుదోవ పట్టించారు.

14 లేదా 15వ ఆర్థిక సంఘాల విధివిధానాలు ఖరారు చేసేటపుడు ప్రత్యేక హోదా అంశం వారి పరిధిలోకి తీసుకురాలేదన్నది వాస్తవం. ఇక ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వానికి తాము ఎలాంటి సిఫార్సు చేయలేదని 14వ ఆర్థిక సంఘం అధ్యక్షులు గోవిందరావు, డాక్టర్‌ అభిజిత్‌ సేన్‌ గతంలోనే రాతపూర్వకంగా ప్రకటించారు.

ప్రత్యేక హోదా గురించి 15వ ఆర్థిక సంఘం నివేదిక కూడా అదే చెప్పిందంటూ ఆ  నివేదికలోని ఒక పేరాను ఆయన  చదివి వినిపించారు.  'కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా గురించి విజ్ఞప్తి చేశాయి. కానీ అది మా విధివిధానాల్లోకానీ  పరిధిలో కానీ లేదు.

ప్రత్యేక హోదా కోసం రాష్ట్రాల నుంచి వచ్చే విజ్ఞప్తులు, డిమాండ్లను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునే సంపూర్ణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది' అంటూ 15వ ఆర్థిక సంఘం నివేదిక స్పష్టం చేస్తోంది.

అయినప్పటికీ కొందరు కేంద్ర మంత్రులు ఇంకా పార్లమెంట్‌ లోపల వెలుపల కూడా ఆర్థిక సంఘం పేరును అడ్డు పెట్టుకుని  ప్రత్యేక హోదా ఇవ్వడానికి అది అంగీకరించలేదని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదని ఆయన హెచ్చరించారు.

'మేం అడిగేదల్లా ఒక్కటే రాష్ట్ర విభజన నిర్ణయానికి వచ్చినప్పుడు అప్పటి కేంద్ర కేబినెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలు, హామీలను అమలు చేయమని. 2014 ఫిబ్రవరి 14న కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను అమలు చేయమన్నదే మా డిమాండ్‌' అన్నారు.

ఇక 15వ ఆర్థిక సంఘం వారం క్రితమే తమ సిఫార్సులతో నివేదికను సమర్పించింది. ఆ సిఫార్సుల కోసం అది ఎంచుకున్న ప్రాతిపదిక ఏమిటి? 1971 జనాభా లెక్కలకు బదులుగా 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవడం వలన ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణాది రాష్ట్రాలు దారుణంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.

ఎందుకు ఇలాంటి అన్యాయం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల ఎందుకు ఈ రకమైన సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 2011 జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు కేంద్ర నిధుల పంపిణీ జరగాలన్న సిఫార్సు కారణంగా ఆంధ్రప్రదేశ్‌ వెయిటేజి తగ్గిపోయి కేంద్రం ఇవ్వాల్సిన నిధులలో 1521 కోట్ల రూపాయలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

ఎందుకు ఇలా శిక్షించాలని ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణాది రాష్ట్రాలన్నీ కుటుంబ నియంత్రణను కఠినంగా అమలుపరిచినందుకా ఈ శిక్ష. ఇదే మేం చేసిన పాపమా? అని ఆయన ప్రశ్నించారు.

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి 4.305 శాతం కేంద్రం నుంచి నిధులు పొందగా 15వ ఆర్థిక సంఘం అనుసరించిన 2011 జనాభా  లెక్కల ప్రాతిపదిక వలన కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావల్సిన నిధులు 4.11 శాతానికి తగ్గిపోయిందని అన్నారు.

ఇది ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన మరో అన్యాయం. జమ్మూ, కాశ్మీర్‌, లధాఖ్‌కు ఏ విధంగానైతే ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రకటించిందో ఆంధ్రప్రదేశ్‌కు కూడా అలాంటి ప్రత్యేక సాయం ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇక 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ఆదాయంలో 16075 కోట్లు లోటు ఉన్నట్లు కంప్ట్రోలర్‌ ఆడిట్‌ జనరల్‌ (కాగ్‌) నిర్ధారించింది. దీనిని తిరిగి చెల్లిస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కింది.

16075 కోట్ల బకాయిలకు పెండింగ్‌ బిల్లులు, పీఆర్‌సీ బకాయిలు కూడా కలిపితే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావలసిన మొత్తం 22948 కోట్లు అవుతుంది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 3979 కోట్లు మాత్రమే.

18969 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని వేడుకుంటున్నా అన్నారాయన. పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఇప్పటి వరకు 11868 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా కేంద్ర ప్రభుత్వం 8577 కోట్లు విడుదల చేసింది.

3283 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నా. ఇక సవరించిన పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం విషయానికి వస్తే 55548 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  సమర్పించిన డీపీఆర్‌ను జల శక్తి మంత్రిత్వ శాఖ నియమించిన టెక్నికల్‌ కమిటీ ఆమోదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజిని ఇవ్వాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. ఒడిషాలోని కలహండి-బొలంగీర్‌-కోరాపుట్‌ జిల్లాలు, మధ్యప్రదేశ్‌-ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి ఇచ్చినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లోని వెనకుబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని పునర్విభజన చట్టం విస్పష్టంగా చెబుతోంది.

దీని ప్రకారం రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి మొత్తం 24350 కోట్లు రావాలి. కానీ  ఇప్పటి వరకు ఈ ప్యాకేజి కింద కేంద్ర ఇచ్చింది కేవలం 1050 కోట్లు మాత్రమే. ఇంతకంటే అన్యాయం మరోటి ఉండదని ఆయన అన్నారు.

జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఎలాంటి పారిశ్రామిక రాయితీలు ఉండవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. ప్రజలను తప్పుదారి పట్టించే మరో కుటిలయత్నం.

2017లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో  పారిశ్రామిక రాయితీల కింద 4324 పరిశ్రమలకు 27000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. 2018లో వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి పథకం కింద 3 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించిందని చెప్పారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలన్నది పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ. అనేక ఆందోళనలు, పోరాటల అనంతరం విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి దానిని విజయవాడ డివిజన్‌లో కలుపుతామని ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎట్టి పరిస్థితులలోను ఆమోదించే ప్రసక్తే లేదని విజయసాయి రెడ్డి అన్నారు.
దేశంలోని రెండు అత్యంత వెనుకబడిన జిల్లాలైన మేవత్‌ (హర్యానా), దాహోడ్‌ (గుజరాత్‌)లను కలుపుతూ గురగావ్‌ - ముంబై మధ్య 60 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించే ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

కానీ పునర్విభజన చట్టంలో కచ్చితంగా అమలు చేయాలని నిర్దేశించిన   విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలిపోయింది.

రాష్ట్రపతి తన ప్రసంగలో మైనారిటీ వర్గాల ఆర్థిక, సామాజిక, విద్యా పురోగతి కోసం కృషి చేస్తామని చెప్పారు. అందువలన మైనారిటీలలో ఎలాంటి అభద్రతా భావం కలగకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నేను నమ్ముతున్నానని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments