అమరావతి: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్) విభాగాల్లో మొత్తం 15వేల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలందాయి. వీటిలో పోలీసుశాఖలోని సివిల్, ఏపీఎస్పీ, ఏఆర్ విభాగాల్లో ఎస్సై, ఆర్‌ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 11వేల పోస్టులున్నాయి.
అగ్నిమాపకశాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్‌మెన్, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్, వార్డరు, ఎస్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్ తదితర ఉద్యోగాలకు సంబంధించి 4వేల పోస్టులున్నాయి. విభాగాల వారీగా ఉన్న ఖాళీలను సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
ఉద్యోగాల భర్తీ కోసం ఏటా ప్రభుత్వం విడుదల చేయనున్న క్యాలెండర్‌లో వీటికి చోటు కల్పించి దశల వారీగా భర్తీ చేయనున్నారు. తొలి దశలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే అంశంపై ఈ నెల మూడో వారం తర్వాత స్పష్టత రానుంది.