Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీకి కొత్తగా 3 బిలియన్‌ డాలర్ల రుణం: ఏఐఐబీ

Advertiesment
ఏపీకి కొత్తగా 3 బిలియన్‌ డాలర్ల రుణం: ఏఐఐబీ
, గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:10 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త 3 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తంచేసింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు.

ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈడబ్బును ఖర్చు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. సచివాలయంలోని కార్యాలయంలో ముఖ్యమంత్రితో ఏఐఐబీ ప్రతినిధులు సమావేశమయ్యారు. బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ ఇన్వెస్టిమెంట్‌ ఆఫీసర్‌ డి.జె.పాండియన్, డైరెక్టర్‌ జనరల్‌–ఇన్వెస్ట్‌మెంట్‌ ఆపరేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌  యీ–ఎన్‌–పంగ్, ప్రిన్సిపల్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషలిస్ట్‌ సోమనాథ్‌ బసు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తోందని, వీటితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, 62 శాతం మంది ప్రజలు ఆదేరంగంపై ఆధారపడి ఉన్నారని, అలాగే ఎక్కువమందికి ఉపాథి కల్పించేది వ్యవసాయరంగమేనని సీఎం స్పష్టంచేశారు.

అందుకే ఇరిగేషన్‌ ప్రాజెక్టులు తమకు అత్యంత ప్రాధాన్యమైనవని ఏఐఐబీ ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రాధాన్యత అనుకుంటే దానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు అందగానే వెంటనే మంజూరుచేస్తామని బ్యాంకు ప్రతినిధులు స్పష్టంచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నవరత్నాలు సహా పలు కార్యక్రమాలపై ఆరా తీశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, అట్టడుగున ఉన్న వర్గాలవారిని ఆదుకోవడానికి చేపడుతున్న కార్యక్రమాలను సీఎం వివరించారు. స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు – నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలను కూడా సీఎం బ్యాంకు ప్రతినిధులకు సవివరంగా తెలియజేశారు.

ఇంగ్లిషు మీడియంను స్కూళ్లలో ప్రవేశపెట్టడంతోపాటు, కల్పిస్తున్న కనీస సదుపాయాలు, మధ్యాహ్న భోజనంలో  చేపట్టిన మార్పులను కూడా వారికి వివరించారు. నిరక్షరాస్యత నిర్మూలించడానికి, ఆ దిశగా పిల్లలను బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి కింద నేరుగా నగదు బదిలీచేసిన అంశాన్ని కూడా బ్యాంకు అధికారులకు తెలిపారు.

ఉపాథే లక్ష్యంగా ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశపెడుతున్న మార్పులను, ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్‌ ప్రవేశపెడుతున్న విధానాన్ని, ప్రతి పార్లమెంటుకూ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పూర్తిస్థాయి ఫీజు రియింబర్స్‌మెంట్, విద్యా వసతి పథకం వివరాలపై సీఎం సమగ్రంగా మాట్లాడారు.

ఈ కార్యక్రమాలపై ఏఐఐబీ అధికారులు ప్రశంసలు కురిపించారు. నాలెడ్జ్‌ మీద పెడుతున్న పెట్టుబడులుగా అభివర్ణించారు. భవిషత్తు తరాలకు ఇవ్వగలిగే ఆస్తి చదువేనన్న సీఎం వ్యాఖ్యలతో వారు ఏకీభవించారు. 
 
అలాగే వైద్య విద్యపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై బ్యాంకు ప్రతినిధులు సీఎంను ఆరాతీశారు. ప్రతి పార్లమెంటు స్థానానికీ ఒక బోధనాసుపత్రి ఉండేలా చూస్తున్నామని, దీనికోసం మరో 16 మెడికల్‌కాలేజీలు కొత్తగా పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎం ప్రణాళికలు బాగున్నాయని బ్యాంకు అధికారులు వ్యాఖ్యానించారు. 

20 ఏళ్లుగా ప్రైవేటైజేషన్‌ మాటలు విన్నామని, కాని ప్రజల కేంద్రంగా, వారి సంక్షేమం, నాణ్యమైన జీవన ప్రమాణాల సాధన ధ్యేయంగా జరుగుతున్న కార్యక్రమాల గురించి మళ్లీ వింటున్నామని ఏఐఐబీ అధికారులు సీఎంతో అన్నారు.
 
కొత్తగా నిర్మించదలచుకున్న పోర్టులపై సీఎంను ఆరాతీయగా, శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నంలో పోర్టులను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక పోర్టుకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బ్యాంకు అధికారులు వెల్లడించారు.

ఇరిగేషన్, రోడ్లు, వాటర్‌ గ్రిడ్, ఎయిర్‌ పోర్టుల నిర్మాణాలకు తమ సహాయం ఉంటుందని తెలిపారు. గోదావరి – కృష్ణా నదుల అనుసంధానంపైన కూడా సీఎం బ్యాంకు అధికారులకు వివరించారు. సముద్రంలో కలిసిపోతున్న నీటిని తరలించడంద్వారా శాశ్వతంగా ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. 

ప్రభుత్వం నిర్ణయించుకున్న ఏ ప్రాధాన్యతలకైనా తమ సహాయం ఉంటుందని ఏఐఐబీ అధికారులు స్పష్టంచేశారు. తన ప్రణాళికలను వివరించడానికి బ్యాంకు ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఏఐఐబీ బ్యాంకు అధికారులు ఆహ్వానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కియా ఎక్కడికి వెళ్లదు: మేకపాటి