ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మంగళ, బుధవారాల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన కోనసీమ జిల్లా మీదుగా ప్రారంభమైంది. సీఎం పర్యటనకు సంబంధించి టూర్ షెడ్యూల్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన విషయం తెల్సిందే.
ఈ పర్యటన కోసం సీఎం జగన్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలం పెదపూడికి సీఎం చేరుకున్నారు. అక్కడికి సమీపంలోని పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులతో జగన్ భేటీ అయ్యారు. ఆ తర్వాత అలిగేవారిపేటకు చెందిన వరద బాధితులను కలుసుకుంటారు. అక్కడ నుంచి ఆయన ఊడిమూడిలంకలోని వరద ముంపు బాధితులతో సమావేశమవుతారు.
ఆ తర్వాత అదే మండల పరిధిలోని వాడ్రేవుపల్లికి మధ్యాహ్నం 2.05 గంటలకు ఆయన చేరుకుంటారు. అక్కడ నుంచి రాజోలు మండలం మేకలపాలెంకు వెళతారు. ఆ తర్వాత సయంత్రం 4.05 గంటలకు రాజమండ్రికి చేరుకుంటారు. రాజమండ్రి అతిథి గృహంలో వరదలపై ఉన్నతాధికారులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్ష తర్వాత సీఎం అక్కడే బస చేసి, బుధవారం మరికొన్ని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.