కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో చాలా మంది కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక మృత్యువాతపడ్డారు. ఇలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగాయి. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
అయితే, ఈ మృతుల అంశంపై కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తుంది. ఆక్సిజన్ కొరతతో దేశంలో ఎవరూ చనిపోలేదని రెండు నెలల క్రితం చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీలో మాత్రం కొందరు చనిపోయారంటూ తాజాగా ప్రకటించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కొల్లు రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారీ ప్రవీణ్ పవార్ సమాధానమిచ్చారు.
'అవును, ఆక్సిజన్ అందక కొందరు చనిపోయినట్టు ఏపీ ప్రభుత్వం చెప్పింది. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఘటన జరిగింది. 10 కిలోలీటర్ల సామర్థ్యమున్న ఆక్సిజన్ ట్యాంక్ రీఫిల్లింగ్, బ్యాకప్ సరఫరాను అందుబాటులోకి తీసుకువస్తున్న టైంలోనే ఘటన జరిగినట్టు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ఆ గ్యాప్‌లోనే ఆక్సిజన్ పీడనం తగ్గిపోయి ఘటనకు కారణమైందని అందులో చెప్పారు' అని ఆమె జవాబిచ్చారు.