Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూబ‌కాసురుడు మంత్రి గుమ్మనూరు జయరాం: మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (07:34 IST)
మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమాలు తారాస్థాయికి చేరాయి. సొంత గ్రామంలో భారీ ఎత్తున పేకాట డెన్లు నడుపుతూ ఇటీవలే దొరికిన మంత్రి బంధువులు ఘటన మరువకముందే.. ఈఎస్ఐ స్కాంలో బెంజ్ కారుతో అడ్డంగా బుక్కయిన మంత్రి పాత్ర సంచలనం రేపుతోంది.

మంత్రి సొంత నియోజకవర్గమైన ఆలూరులో దాదాపు 450 ఎకరాలు కబ్జా చేసేందుకు మంత్రి గుమ్మనూరు జయరామే నేరుగా రంగంలో దిగడం కలకలం సృష్టిస్తోంది. ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించి, భయపెట్టి ఇప్పటికే మంత్రి తన భార్య, మరదలు, బంధువులు పేరుతో వందల ఎకరాలు లాగేశారు. మిగిలిన భూములు అనుచరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మంత్రి స్కాంని ఆధారాల‌తో స‌హా విశాఖ‌లో మాజీ మంత్రి అయ్య‌న్నపాత్రుడు వెల్ల‌డించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
 
కంపెనీ చైర్మన్ కి తెలియకుండానే భూకబ్జా
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన గుమ్మనూరు జయరాం జగన్రెడ్డి ప్రభుత్వంలో కార్మికశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదవి చేపట్టిన నుంచీ వివాదాలకు కేంద్రబిందువుగా వుంటున్న మంత్రి..తాజాగా స్కాంలలో కింగ్ గా మారారు.  కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకి చెందినవారు  993లో మ‌హాబ‌లేశ్వ‌ర‌ప్ప , మంజునాథ్ అనే సోద‌రులు కంపెనీని ఆరంభించారు.

పంటలు, తోటలు పెంపకం, మార్కెటింగ్ వంటి లక్ష్యాలతో ఆరంభమైన  కంపెనీ విస్తరణలో భాగంగా ఆలూరు నియోజకవర్గ పరిధి మండలాలలో 450ఎకరాల భూములు కొనుగోలు చేసింది. 2008లో మ‌హాబ‌లేశ్వ‌ర‌ప్ప చ‌నిపోవ‌డంతో ఆయ‌న త‌న‌యులు మ‌నూ, మోనాలు కంపెనీలో చేరారు. 2009లో మంజునాథ్ కంపెనీ నుంచి వైదొల‌గుతున్న‌ట్టు, డైరెక్ట‌ర్‌గా రాజీనామా చేసిన‌ట్టు అధికారికంగా కంపెనీస్ ఆఫ్ రిజిస్ట్రార్‌కి ఫార్మ్ 32 స‌బ్మిట్ చేశారు.

అనంత‌రం కంపెనీ కార్యకలాపాలు కార్యరూపం దాల్చకపోవడంతో మేనేజింగ్ డైరెక్ట‌ర్ క‌మ్‌ చైర్మన్ మ‌నూ  బెంగళూరులో తన ఇతర వ్యాపారాలలో నిమగ్నమయ్యారు. కంపెనీకి వున్న  450 ఎకరాల భూమిపై మంత్రి కన్ను పడింది. ఈ భూములు చేజిక్కాలంటే  కంపెనీ బోర్డు చైర్మన్, డైరక్టర్లంతా కలసి తీర్మానం చేస్తేనే మంత్రి కొనగలరు. కానీ వారు అమ్మరు. అందుకే మంత్రి కొట్టేసేందుకు నిర్ణయించుకున్నారు.

కంపెనీ మాజీ డైరెక్టర్ మంజునాథ్‌ మంత్రి లొంగదీసుకున్నారు.  చైర్మన్, డైరక్టర్లకు తెలియకుండానే వారంతా 2019 మే నెల 10వ తేదీన డైరక్టర్ మంజునాథ్‌కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టు తప్పుడు పత్రాలు సృష్టించారు.  కంపెనీ సీల్ డూప్లికేట్ది చేయించి, చైర్మన్ ఇటినా మను సంతకం కూడా ఫోర్జరీ చేసేశారు. మార్చి 2, 2020న మంత్రి భార్య, మరదళ్ల పేరుతో 92 ఎకరాల 94 సెంట్లు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగిలిన భూములు బంధువులు, బినామీలకు రిజిస్టర్ చేశారు.   450 ఎక‌రాల‌లో 204 ఎక‌రాలు మంత్రి క‌బ్జా చేశారు. 
 
మంజునాథ్‌కి రూ.1,63,63,000 (1 కోటి, 63 లక్షల, 63 వేల రూపాయలు) చెల్లించి ఇట్టినా భూముల్ని మంత్రి గుమ్మనూరు జయరాం భార్య , మరదలు (తమ్ముని భార్య) ఇతర కుటుంబ సభ్యులు పేర్లతో కొనుగోలు చేశారు. 
 
ఆస్పరి మండలం ఆస్పరి గ్రామంలో సర్వే నెంబర్లు 674/E, 728, 666/2, 668/C, 669/C, 713/Aలలోని 30 ఎకరాల 83 సెంట్లను  54 లక్షల 28 వేలకు నగదు చెల్లించడం ద్వారా  గుమ్మనూరు జయరాం భార్య పెంచులపాడు రేణుకమ్మ పేరున మార్చి 2,  2020న రిజిస్టర్ చేశారు. 

సర్వే నెంబర్లు  685, 759, 685, 695/E, 695/F, 657/A,  666/2లలోని 30 ఎకరాల 53 సెంట్ల భూమిని 53 లక్షల 75 వేలకు మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు పెంచులపాడు శ్రీనివాసులు భార్య పెంచులుపాడు ఉమాదేవి పేరున మార్చి 2,  2020న రిజిస్టర్ చేసిందీ మంజునాథే.

సర్వే నెంబర్లు 670, 671,673/1, 674/Cలలోని 31 ఎకరాల 58 సెంట్లను 55 లక్షల 60 వేలకు మంత్రి గుమ్మనూరు జయరాం రెండో సోదరుడు పెంచులపాడు నారాయణస్వామి భార్య పెంచులుపాడు త్రివేణి పేరున మార్చి 2,  2020న రిజిస్టర్ చేశారు. 

688-A, 758- A, 760  సర్వే నెంబర్లలోని 12 ఎకరాల 76 సెంట్లను  21 లక్షల 70 వేలకు కె శ్రీదేవి పేరుతో రిజిస్టర్ చేశారు. శ్రీదేవి భర్త అనంత పద్మనాభరావు పేరుతో 664-A1A, 665-C, 682, 713-B, 746, 763 సర్వే నెంబర్లలోని 31 ఎకరాల 32 సెంట్లు, ఆస్పరి మండలం చిన్నహోటూరు గ్రామంలో సర్వే నెంబర్  36 లోని 16 ఎకరాల 75 సెంట్లను 71 లక్షల 68 వేలకు కట్టబెట్టారు. 

చిన్న హొట్టూరులోని 557, 558 సర్వే నంబర్లలోని  19 ఎకరాల 18 సెంట్లను లింగప్ప శశికళకి 21 లక్షల 10 వేలకు కట్టబెట్టారు. శశికళ భర్త ఎర్రిస్వామికి 27 ఎకరాల 30 సెంట్లను 30 లక్షల 3 వేలకు రిజిస్టర్ చేశారు.  

రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో 'నగదు లావాదేవీ' అని రాసి కంపెనీ అకౌంట్ కు నగదు గానీ, డిడి గానీ, చెక్కు గానీ ఇవ్వకుండా నేరుగా వ్యక్తులకు నగదు చెల్లించామని పేర్కొనడంతోనే ఇది స్కాం అని తేలిపోయింది. వందల ఎకరాల భూముల్ని మంజునాథ్‌ అడ్డగోలుగా తప్పుడుపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయిస్తున్న సమాచారం కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టరైన మను దృష్టికి వచ్చింది.

తాను నివాసం వుండే బెంగుళూరు నగరంలోని కోరమంగళ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసాడు.  కోరమంగళ పోలీసులు విచారణలో మంజునాథ్ మొత్తం ఈ భూముల అమ్మకం గుట్టంతా విప్పేశాడు.  406/468/471/430 సెక్షన్ల కింద కేసు (నం: 101/2020) మంజునాథ్ను ఏ1 ముద్దాయిగా, శ్రుతిపవన్ అనే వ్యక్తిని ఏ2 ముద్దాయిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో మంజునాథ్ బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. 
 
వాస్తవంగా ఇట్టినా ప్లాంటేషన్ ప్రైవేటు లిమెటెడ్ బోర్డు నుంచి మంజునాథ్ మార్చి 31, 2009 న రాజీనామా చేసారు. నాటి నుంచి నేటివరకూ మంజునాథ్‌కి, ఇట్టినా కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఒక కంపెనీ పేరు మీద ఉన్న ఆస్థులు విక్రయించాలంటే తప్పనిసరిగా కంపెనీ బోర్డు ఛైర్మన్, డైరెక్టర్ల అందరి అనుమతి ఉండాలి. అందరి సంతకాలతో పాటు కంపెనీ బోర్డు తీర్మానం తప్పనిసరిగా ఉండాలి. కంపెనీతో ఎటువంటి సంబంధంలేని మంజునాథ్ బోర్డు చైర్మన్ సంతకాలు, డైరెక్టర్లు సంతకాలు ఫోర్జరీ చేసి, బోర్డు తీర్మానం చేసినట్టు తప్పుడు పత్రాలు సృష్టించినట్టు అన్ని ఆధారాలు పోలీసులకు చిక్కాయి.
 
ఇట్టినా ప్లాంటేషన్  ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ 10-05-2019, 11-12-2019 తేదీలలో బోర్డు మీటింగులు జరిగినట్టుగా, తనకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తూ ఇట్టినా బోర్డు తీర్మానాలు చేసినట్టు తప్పడు పత్రాలు సృష్టించిన మంజునాథ్. డైరెక్టర్లు, చైర్మన్ల సంతకాలు ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు సృష్టించారని  పోలీసులకు మను ఆధారాలు సమర్పించారు. 
 
తప్పుడు పవర్ ఆఫ్ ఆటార్నీ, ఫేక్ కంపెనీ తీర్మానాలు, నకిలీ స్టాంపులతో పత్రాలు సృష్టించిన మంజునాధ మంత్రి జయరాం కుటుంబ సభ్యులకు మొత్తం కంపెనీ భూములన్నీ  రిజిస్టర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
మంత్రి తన భార్య, మరదళ్లు, బంధువుల పేర్లతో కొన్న ఈ భూములపై వ్యవసాయ రుణాలు తీసుకునేందుకు కర్నూలు జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఇట్టినా చైర్మన్ మను కర్నూలు జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సీఈవోకి జూన్ 1, 2020న కంపెనీ లెటర్ హెడ్తో లేఖ రాశారు. కంపెనీ భూములు ఎవ్వరికీ అమ్మలేదని, తమ భూములు కొనుగోలు చేసినట్టుగా పత్రాలు తెచ్చి వాటిపై రుణాలకు దరఖాస్తు చేసినవారికి ఎటువంటి రుణం ఇవ్వొద్దని  అందులో కోరారు.
 
2017-18 లో అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి మంత్రి అయిన గుమ్మనూరు జయరాం మరియు అతని కుటుంబ సభ్యుల ఆదాయం కేవలం రూ. 1,44,000 మాత్రమేనని 2019 మార్చి లో సమర్పించిన ఎలక్షన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. 2020కి వచ్చేసరికి ఏడాది కాలంలో కోటి అరవై మూడు లక్షల రూపాయలతో నగదు పెట్టి వందల ఎకరాలు ఎలా కొనగలిగారు? 
 
పెంచికలపాడు జయరాం అలియాస్ గుమ్మనూరు జయరాం 25-03-2019 తేదీన  నామినేషన్ పత్రాలు సమర్పించిన సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో 2013 నుంచి 2018 వరకూ వేసిన ఐటీ రిటర్న్స్ పొందుపరిచారు. ఇందులో 2014,15 సంవత్సరాలలో ఆదాయం నిల్..2016,17,18 మూడేళ్లకు కలిపి 9,59,458 ఆదాయం చూపించారు. జయరాం భార్యకి అసలు పాన్ కార్డేలేదు. ఆదాయం శూన్యంగా పేర్కొన్నారు. ఇదే అఫిడవిట్లో తన వద్ద నగదు 9 లక్షలుందని, తన భార్య వద్ద ఒక లక్ష వుందని పేర్కొన్నారు.

జయరాం, అని భార్యకి కలిపి బంగారం, ఫిక్స్ డిపాజిట్లు, చేతిలో కేష్, ఇతరత్రా డిపాజిట్లు అన్నీ కలిపి 53 లక్షలుగా పేర్కొన్నారు. వారసత్వంగా వచ్చిన భూమి 8 ఎకరాల 19 సెంట్లు మాత్రమే..8 ఎకరాల 50 సెంట్ల భూమిని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. అఫిడవిట్లో తనకు వ్యవసాయం, ఎమ్మెల్యేగా వచ్చే జీతం తప్పించి ఎటువంటి ఆదాయం లేదని పేర్కొన్నారు.

తన భార్య సాధారణ గృహిణి అని పొందుపరిచారు.  ఏ ఆదాయంలేని మంత్రి, ఆయన భార్య కోట్ల రూపాయలతో వందల ఎకరాలు ఎలా కొనుగోలు చేశారనేది వెలికి తీస్తే... వంద‌ల కోట్ల విలువైన ఈ భూములు రూపాయి ఇవ్వ‌కుండా కొట్టేశార‌నేది అర్థం అవుతోంది.
 
ల్యాండ్ సీలింగ్ చ‌ట్టం ప్ర‌కారం ఒక వ్యక్తి 43 ఎకరాలు మించి రిజిస్ట్రేషన్ చేయకూడదనే నిబంధనలు లేకపోతే .. మొత్తం భూములన్నీ మంత్రి భార్య, మరదలు పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసేవారు. అలా వీలు కాకపోవడంతో భార్య, ఇద్దరు మరదళ్లు, బంధువులు, బినామీలను రంగంలోకి దింపారు. 
 
మంత్రి భార్య, బంధువులకు ఈ భూముల రిజిస్ట్రేషన్ ఆలూరులో చేశారు. డాక్యుమెంట్లు ఎమ్మిగనూరుకు చెందిన డాక్యుమెంట్ రైటర్ రాశారు. చలానాలు కూడా ఎమ్మిగనూరులో చెల్లించారు. అంటే గుట్టుచప్పుడు కాకుండా వందల ఎకరాల రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని అర్థం అవుతోంది. 
 
ఒక మంత్రి తన భార్య, మరదళ్లు, బంధువులు, బినామీల పేర్లతో వందల ఎకరాలు కొంటున్నప్పుడు ఆ భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యక్తి చట్టబద్ధంగానే చేస్తున్నాడా లేదా అనేది పరిశీలిస్తారు. వందల ఎకరాలు, ఓ కంపెనీ తరఫున అయితే న్యాయనిపుణులతో అన్ని డాక్యుమెంట్లు చూపించి వారి సలహా తీసుకున్న తరువాతే కొంటారు. కానీ ఎట్టినా కంపెనీ భూములు వివాదంలో వున్నాయని తెలిసి కూడా ...కొన్నారంటే... మొత్తం మంత్రే మంజునాథ్‌ని అడ్డంపెట్టుకుని..తన అధికారం ఉపయోగించి  తప్పుడు పత్రాలు సృష్టించి, అధికారులను మేనేజ్ చేసి ఈ రిజిస్ట్రేషన్లు అక్రమంగా చేయించుకున్నారని తేలుతోంది.
 
సాధార‌ణ వ్య‌క్తుల పేరుతో అడంగ‌ల్ మారాలంటే 3 నెల‌ల‌కు తిప్పుకుంటే గానీ మార్చ‌ని రెవెన్యూ అధికారులు కంపెనీ భూముల‌న్నీ గంప‌గుత్త‌గా మంజునాథ్ పేరుతో ఒక్క రోజులోనే అడంగ‌ల్‌లో పేర్లు మార్చేశారు. 
 
2 లక్షలు దాటిన నగదు లావాదేవీలు జరిపితే చెక్, డిడీ రూపంలో చేయాలనే నిబంధనలున్నాయి. మంత్రి గారేమో తన భార్య, మరదళ్లు, బినామీల పేరుతో ఒకే రోజున కొన్న వందల ఎకరాలకు 1 కోటి 63 లక్షల 63 వేలు నగదు చెల్లించామని రిజిస్ట్రేషన్ పత్రాలతో పేర్కొనడం ఇది పక్కా అక్రమ వ్యవహారం అని తేలిపోతోంది.
 
ఈ భూములన్నీ మంత్రి తన అధికారం ఉపయోగించి రూపాయి చెల్లించకుండా మంజునాథ్‌ని అడ్డంపెట్టుకుని కొట్టేశారని అర్థం అవుతోంది. ఎందుకంటే ఈ భూములకు నిజంగానే మంత్రి కొనుగోలు చేసి వుంటే...కోట్ల నగదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేవారు. కొట్టేసిన భూములు కావడంతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే అడ్డంగా దొరికిపోతామని, అన్ని లావాదేవీలు నగదు అని పేర్కొన్నారు. దీంతో అడ్డంగా బుక్కయ్యారు.
 
ఇటినా ప్లాంటేషన్ రిజిస్టర్ కంపెనీ...కంపెనీతో లావాదేవీలు చేయాలంటే ఇస్తినమ్మ ..పుచ్చుకుంటినమ్మ అంటే సరిపోదు. ప్రతీ పైసాకి లెక్క వుండాలి. ఇవేమీ లేకుండా మంజునాథ్ని తెరపైకి తెచ్చి, ఫేక్ పవర్ ఆప్ అటార్నీగా సృష్టించి మంత్రి తన అధికారం ఉపయోగించి మొత్తం భూముల్ని లాగేశారని అర్థం అవుతోంది.
 
2005లో ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీ కోసం ఎకరా 24 వేల రూపాయలు రేటు లెక్కన 450కి పైగా ఎకరాలు భూమి కొనుగోలు చేశారు. కార్యకలాపాలు ప్రారంభమయ్యాక భూములు ఇచ్చిన రైతుల ఒక్కో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుంది.

15 ఏళ్లయినా కంపెనీ ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. కంపెనీ కార్యకలాపాలు ఏమీ జరగకపోతే భూములమ్మిన రైతులకే మళ్లీ భూములు అప్పగించాలి. ఒక మంత్రి అయి వుండి తన నియోజకవర్గానికి  చెందిన 170 మంది రైతులు భూములు వాళ్లకి ఇప్పించాల్సింది పోయి ..అవే భూముల్ని తానే కబ్జా చేయడంపై స్థానికులు విస్తుపోతున్నారు.
 
ఇట్టినా కంపెనీ పత్తా లేకపోవడంతో కొందరు రైతులు తమ భూములు సాగు చేసుకుందామని వెళితే మంత్రికి చెందిన ముఠాలు బెదిరిస్తున్నాయని, ఈ భూములు మంత్రివని హెచ్చరిస్తున్నారు. కొందరు రైతులు ధైర్యం చేసి పంటలు వేస్తే ట్రాక్టర్లతో మంత్రి అనుచరులు దున్నేస్తున్నారని లబోదిబోమంటున్నారు. 
 
మంత్రి కోసమే మంజునాథ్ ఇలా చేశాడా?
ఒక రిజిస్టర్డ్ కంపెనీ ఆస్తిని సంస్థ యొక్క ప్రయోజనం కోసం మాత్రమే అమ్మాల్సి వున్నా.. ఇటినా ఆస్తులు అలా కంపెనీ ప్రయోజనం కోసం అమ్మకం జరగలేదు. ఇది కంపెనీ నిబంధనల ప్రకారం చెల్లదు.
 
ఇటినా కంపెనీ ఆస్తులు అమ్మే అధికారం తనకు కట్టబెట్టిందని మంజునాథ్ తప్పుడు పత్రాలు సృష్టించి భూములు అమ్మేశారు. అయితే కంపెనీ నిబంధనల ప్రకారం ఇలా ఒక డైరెక్టర్కి అధికారం ఇవ్వాలంటే..ఆ భూములు అమ్మకం వల్ల కంపెనీకి ఏ ప్రయోజనం చేకూరుతుందో వివరించాలి. అది మంత్రికి భూములమ్మేటప్పుడు జరగలేదు. అసలు మంజునాథ్ డైరెక్టర్ కానప్పుడు తానే డైరెక్టర్ని అని సృష్టించడం మరో నేరం.
 
కంపెనీకి చెందిన వందల ఎకరాల భూముల అమ్మకం పత్రాలలో కంపెనీ తీర్మానం కానీ,  ఆస్తులు అమ్మడం వల్ల కంపెనీకి వచ్చే ప్రయోజనం కానీ, ముందస్తు ఒప్పందం కానీ ఎక్కడా పేర్కొనకపోవడం ఇది చట్టవిరుద్ధమైన వ్యవహారమని నూటికి నూరు శాతం తేలిపోయింది. 
 
ఇటినా కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకున్న వందల ఎకరాలకు లింక్ డాక్యుమెంట్లు లేవు. అమ్మకపు దస్తావేజులపై ఇటినా కంపెనీ ముద్ర లేదు. ఇది పూర్తిగా అక్రమ కొనుగోలు, అమ్మకం అని స్పష్టం అవుతోంది. పట్టాదారు పాసు పుస్తకాలు ట్యాంపర్ చేశారు. ఇటినా కంపెనీ పేరుతో వుండాల్సిన భూముల పట్టాదారు పాసుపుస్తకాలు ఒక వ్యక్తి పేరుపై వుండటం ట్యాంపర్ అయ్యాయనేది తేటతెల్లం అవుతోంది. 
 
ఇటినా కంపెనీ  డైరెక్టర్ పదవికి రాజీనామా చేశానని  31-03-2009న  ఫారం -32 ద్వారా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కి మంజునాథ్ తెలియజేశాడు. కంపెనీతో అన్ని బంధాలు తెంపుకున్ని వెళ్లిపోయిన 11 ఏళ్ల తరువాత అదే కంపెనీ భూములన్నీ అమ్మేశాడంటే..దీని వెనుక మంత్రి గ్యాంగు ఏ స్థాయిలో పనిచేసిందో అర్థం అవుతోంది. 
 
కంపెనీకి చెందిన ఆస్తిని విక్రయించడానికి  జనరల్ బాడీ సమావేశంలో బోర్డు తీర్మానం ఆమోదించాలి. బోర్డు తీర్మానం చెల్లదని, భూమి అమ్మకం చట్టవిరుద్ధం అని కర్ణాటక పోలీసులకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఇది అక్ర‌మ క్ర‌య‌విక్ర‌యాలు జ‌రిగాయ‌ని తేల‌తెల్లం అవుతోంది. 
 
కంపెనీల చట్టం యొక్క సెక్షన్ 293 ప్ర‌కారం  డైరెక్టర్ల బోర్డు స‌మావేశం కాకుండా కంపెనీ ఆస్తుల అమ్మ‌కాల తీర్మానాలు చేయ‌దు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 269 ఎస్టీ ప్రకారం  ఏదైనా నగదు లావాదేవీలు రూ. 2 లక్షలు దాటిన‌వి చేస్తే అవి చ‌ట్ల ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంది. 
 
ఈ కంపెనీ రైతుల్నించి భూములు కొనుగోలు చేసిన‌ప్పుడు  సంబంధిత ప్రాంతంలోని యువతకు  ఉపాధి కల్పించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అస‌లు కంపెనీ కార్య‌క‌లాపాలు ఆరంభం కాని ప‌క్షంలో ఆయా రైతుల‌కే తిరిగి భూములు అప్ప‌గించాల‌ని ఒప్పందంలో వుంది. దీనికి విరుద్ధంగా త‌న నియోజ‌వ‌ర్గంలో దాదాపు 170 మంది రైతుల‌కు అప్ప‌గించాల్సిన భూముల్ని మంత్రి త‌న అధికార‌బ‌లంతో క‌బ్జా చేయ‌డం ఇది అతి పెద్ద కుంభ‌కోణం అని తేట‌తెల్లం అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments