వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయన్నపాత్రుడు తేరుకోలేని షాకిచ్చారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. దీంతో అసెంబ్లీతో పాటు అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక పాస్‌లు జారీ చేయనున్నారు. అలాగే, మీడియాకు, సందర్శకులు, పోలీసుల సిబ్బందికి కూడా ప్రత్యేక పాస్‌లు జారీచేస్తారు.
బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు భద్రతా కారణాల రీత్యా కేవలం పాస్‌లు ఉన్నవారికే అసెంబ్లీ ప్లాంగణంలోకి అనుమతి ఇస్తారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేలు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ రంగుల్లో పాస్‌లు జారీచేస్తారు. అసెంబ్లీ ఒకటో గేట్ నుంచి మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లతో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు అనుమతి ఇస్తారు.
అసెంబ్లీ రెండో గేట్ నుంచి మంత్రులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. అసెంబ్లీ నాలుగో నంబరు గేట్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతి ఇస్తారు. మండలి చైర్మన్, స్పీకర్, సీఎం వచ్చి వెళ్లే కారిడార్‌లలో ఇతరులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేవలం నాలుగో నంబరు గేట్ నుంచి అసెంబ్లీ హాలులోకి ప్రవేశించాల్సివుంటుంది.