కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్. నరసింహారావు గుంటూరు జిల్లాలో పర్యటించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, వాటికి సంబంధించిన పనులను పరిశీలించడానికి వచ్చిన ఎంపీకి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యేలూరు శశికుమార్ ఘన స్వాగతం పలికారు.
పనుల పరిశీలన అనంతరం ఎంపీ జి.వి.ఎల్. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కొండమోడు నుండి పేరేచర్ల, మాచర్ల నుండి దాచేపల్లి, నరసరావుపేట నుండి చిలకలూరిపేట వరకు రోడ్డు విస్తరణకు కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. విజయవాడ రీజనల్ ఆఫీస్ అధికారి దగ్గరికి వెళ్లి గతంలో ఈ విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరామని, వాటి పురోగతిని ఇపుడు పరిశీలస్తున్నట్లు తెలిపారు.
ఇంకా ఏపీలోని వివిధ నగరాలు, పట్టణాలలో రోడ్డు విస్తరణ పనులు పరిశీలించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మన రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం జరిగిందని, అందులో ఒకటి పిడుగురాళ్ల సమీపంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీకి అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరపున దాదాపు రూ. 200 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజికి మంజూరు చేసినట్లు ఎంపీ తెలిపారు.