విజయవాడ నగరంలో స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 13 మంది మహిళలతో పాటు ఐదుగురు విటులు కూడా ఉన్నారు. ఈ ఐదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలుగా ప్రచారం సాగుతోంది.
ఈ నెల 22వ తేదీన విజయవాడ నగరంలో ఓ రాజకీయ పార్టీ యూట్యూబ్ చానెల్ కార్యాలయం ఉన్న భవనంలో స్పా సెంటర్ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ భవంతిపై శుక్రవారం అర్థరాత్రి మాచవరం పోలీసులు సోదాలు నిర్వహించారు. నగరంలోని వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో ఉన్న స్టూడియోల 9 స్పా సెంటరుపై మాచవరం సీఐ ప్రకాష్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీస్ బృందం ఈ తనిఖీలు నిర్వహించింది.
యూట్యూబ్ చానెల్ భవనంలో స్పా సెంటరు పేరుతో వ్యభిచారం సాగిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఇందులో 13మంది మహిళలతో పాటు ఐదుగురు రాజకీయ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు. పట్టుబడిన మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరి నుంచి నగదుతో పాటు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.