విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించకూడదనే ఉద్యమం తీవ్ర అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. తెలుగు జాతి హక్కుగా పోరాడి తెచ్చుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాలు చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్ పై కోర్టు విచారణ ప్రారంభించింది.
లక్ష్మీనారాయణ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల సమయం కోరింది. కేంద్రం తరఫున ప్రాసిక్యూషన్ న్యాయవాదులు కౌంటర్ దాఖలుకు తాత్సారం చేస్తున్నారని పిటిషనర్ జేడీ తరఫు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు.
ఈనెల 29న బిడ్డింగ్ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు పిటిషనర్ తరపు న్యాయవాదులు. తాము తాత్సారం చేయడం లేదని, అలాంటిదేమీ లేదని, తాము తగు సమయాన్నిఅభ్యర్థిస్తున్నామని కేంద్రం తరఫున న్యాయవాది వివరణ ఇచ్చారు. దీనిపై ఆగస్టు 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
విశాఖ ఉక్కు ఉద్యమం పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పట్టుదలతో ఉన్నారు. ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరఫున ఏంపీగా పోటీ చేసి, గణనీయమైన సంఖ్యలో ఓట్లు తెచ్చుకున్న జేడీ... జనసేనకు రాజీనామా చేసినా... స్థానిక ఎంపీ అభ్యర్థిగా తన వంతు బాధ్యతగా స్టీల్ ప్లాంట్ పై పోరాటం చేస్తున్నారు. దీనిపై న్యాయపరంగా అడుగులు వేయడం సబబని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఏ కారణాలతో, ఏవిధంగా స్టీల్ ప్లాంట్ ని ప్రయివేటు పరం చేస్తారని పిటిషనర్ వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు తలమానికంగా ఉన్న... ఒక్కగానొక్క భారీ పరిశ్రమను ప్రయివేటు పరం చేస్తే, ఇక్కడి అభివృద్ధి, విద్యా ఉద్యోగావకాశాలు ఏం కావాలని? నిరుద్యోగులకు ఉపాధి ఎలా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే విశాఖ ఉక్కు కర్మాగారం పోరాట ఐక్యవేదిక ఉద్యమం కొనసాగిస్తోంది. దీనిని న్యాయపరమైన బలం చేకూర్చేందుకే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తనదైన శైలిలో న్యాయపోరాటానికి దిగారు.