ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయని దుయ్యబట్టారు. జగన్ పథకాలు వెనుక ఉన్న లూటీని ప్రజలు గుర్తించారని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సంక్షేమ పథకాలు కారణం కాదని.. సీఎం జగన్ లూటీ వల్లనే ఈ దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను దెబ్బతీసిన జగన్, తన ఆదాయం పెంచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పారు.
తాము ఏం నష్టపోయామో ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యంపై బహిరంగ దోపిడీ జరుగుతోందన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వ్యక్తుల జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. రైతు వర్గంలో ఇకపై ఒక్క ఓటు కూడా వైసీపీకి పడే ఛాన్సే లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైతులకు ఏడాదికి రూ. 7 వేలు ఇచ్చి.. ఇతరత్రా పూర్తిగా విస్మరించారని విమర్శించారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కోపంతో కాపు సామాజికవర్గాన్ని, టీడీపీపై కోపంతో కమ్మ వర్గాన్ని, రఘరామ కృష్ణరాజుపై కోపంతో మరో వర్గాన్ని టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డిలో ఓ అపరిచితుడు ఉన్నాడని వ్యాఖ్యానించారు.
వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ జీవితంలో అధికారంలోకి రాదనేదే జగన్ ఫ్రస్టేషన్‌కు కారణమని వ్యాఖ్యానించారు. ఫ్రస్టేషన్ వల్లే సీఎం జగన్ భాష మారిందని అభిప్రాయపడ్డారు. కెబినెట్ విస్తరణతో సీఎం జగన్ బలహీనుడని తేలిపోయిందని చంద్రబాబు అన్నారు.