ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి అభ్యున్నతే లక్ష్యంగా అప్పులు చేసి ప్రజలకు పంచి పెడుతున్నామని ఏపీ ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు అన్నారు. అప్పులు చేయడం తప్పు కాదన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పులు చేయలేదా అంటూ ఎదురు ప్రశ్నించారు.
ఇటీవల ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న ఆయన సోమవారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. గత తెదేపా ప్రభుత్వం అప్పులు చేయకుండానే పాలన చేసిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని పథకాలు సక్రమంగా అమలవుతున్నప్పటికీ రాద్దాంతం చేయడం తెదేపాకు ఓ అలవాటుగా మారిందన్నారు.
ముఖ్యంగా టీడీపీ హయాంలో నిధులు దారి మళ్ళింపు జరగలేదని అప్పటి సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పలేదా? అని నిలదీశారు. నీరు చెట్టు మట్టి తవ్వకాల్లో వేల కోట్ల రూపాయలు ఎక్కడకు వెళ్లాయని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు.