థియేటర్లలో బ్లాక్ టిక్కెట్ల అమ్మకాలను నియంత్రించాలన్న ఏకైక ఉద్దేశ్యంతో సినిమా టిక్కెట్ల అమ్మకాలను ఆన్‌లైన్‌లో విక్రయించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ విధానాన్ని సినీ నిర్మాతల, చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ అంశం కోర్టుకు చేరింది. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు.. ప్రస్తుతానికి సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అమ్ముకునేందుకు అనుమతిచ్చింది. కొంతకాలం ఆన్‌లైన్‌లో జరిగే టిక్కెట్ల అమ్మకాన్ని పరిశీలించిన తర్వాత తుది ఆదేశాలు జారీచేస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా టిక్కెట్ల విక్రయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఎలా ఉంటుందో కొన్ని రోజులు పరిశీలిద్ధామని పేర్కొంది. ముఖ్యంగా, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు తమ సొంత వేదికలపై టిక్కెట్లు అమ్ముకునేందుకు ప్రస్తుతానికి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. అదేసమయంలో మల్టీప్లెక్స్ యాజమాన్యాల అభ్యర్థలను తదుపరి విచారణలో పరిశీలిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది.