మద్యం మత్తు ఎంత పనైనా చేయిస్తుంది. మత్తులో చాలామంది తమకే తెలియకుండా చాలానే చేస్తుంటారు. మద్యం మత్తు తలకెక్కితే ఆడవారైనా ,మగవారైనా ఒక్కటే. కొంతమంది చిందులేస్తే మరి కొంత మంది క్రూరంగా ప్రవర్తిస్తారు. అలా ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించిన సంఘటన మంగళగిరి పట్టణంలోని షరాఫ్ బజారులో బుధవారం చోటుచేసుకుంది.
సేకరించిన వివరాల మేరకు... మంగళగిరి పట్టణంలోని షరాఫ్ బజారులో గల ఓ బంగారు నగల దుకాణం ఎదుట ఓ యువకుడు తన వాహనాన్ని నిలిపాడు. ఇది గమనించిన షాపు యజమాని తన దుకాణం ఎదుట నిలిపిన ద్విచక్ర వాహనాన్ని తీసివేయాలని సూచించాడు.
దీంతో అప్పటికే ఊటుగా మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు తన ద్విచక్ర వాహనాన్ని తీయమని చెప్పిన దుకాణ యజమానిపై దురుసుగా ప్రవర్తిస్తూ... నానా దుర్భాషలాడాడు. ఈ క్రమంలో దుకాణంలో పని చేసే కార్మికులు ఆ యువకుడికి దేహశుద్ధి చేసి పట్టణ పోలీసులకు అప్పగించారు.
పట్టణపోలీస్ స్టేషన్ లోనూ రెచ్చిపోయిన యువకుడు.
అలా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన యువకుడికి అప్పటికీ మద్యం మత్తు దిగకపోవడంతో ఆగ్రహంతో మరింత రెచ్చిపోతూ సాక్షాత్తూ స్టేషన్ అధికారి ఎదుటే బిగ్గర కేకలు వేస్తూ భయానక వాతావరణం సృష్టించాడు. ఇంత జరిగినా పాపం ఆ పోలీస్ అధికారి అవేమి పట్టించుకోకుండా.. ఆ యువకుడిని జాగ్రత్తగా కూర్చోపెట్టే ప్రయత్నం చేశారు.
ఈలోగా అక్కడికి చేరుకున్న యువకుడి అనుచర గణం బాధితునితో మాట్లాడి రాజీ యత్నానికి ప్రయత్నించడంతో పాటు.. సదరు పోలీస్ అధికారిని బ్రతిమిలాడుకుంటున్నట్లు సమాచారం. మద్యం మత్తులో ఆ యువకుడు పోలీస్ స్టేషన్ లో సృష్టించిన వీరంగం తలుచుకొని కొందరు పోలీస్ సిబ్బందే భయపడి పోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కాగా బాధితుడు తన ఫిర్యాదును ఉప సంహరించుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. అయితే పోలీస్ స్టేషన్ లో యువకుడు మద్యం మత్తులో చేసిన రచ్చ వ్యవహారంపై పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.