Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 757 కరోనా కేసులు...ఏ జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే?

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (21:05 IST)
రాష్ట్రంలో తాజాగా కరోనా వైరస్‌ అనుమానిత 5022 శాంపిల్స్‌ పరీక్షించగా 35 కేసులు పాజిటివ్‌గా తేలాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 757 కు చేరింది. 

కర్నూలు జిల్లాలలో అత్యధికంగా 184 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 158, కృష్ణా జిల్లాలో 83, నెల్లూరు జిల్లాలో 67, చిత్తూరు జిల్లాలో 53, వైయస్సార్‌ కడప జిల్లాలో 46, ప్రకాశం జిల్లాలో 44, పశ్చిమ గోదావరి జిల్లాలో 39, అనంతపురం జిల్లాలో 36, తూర్పు గోదావరి జిల్లాలో 26, విశాఖపట్నం జిల్లాలో 21 కేసులు గుర్తించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు.

కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 96 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వైయస్సార్‌ కడప జిల్లాలో 19 మంది, విశాఖపట్నం జిల్లాలలో 18 మంది, గుంటూరు జిల్లాలో 15 మంది, కృష్ణా జిల్లాలో 14 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 8 మంది, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 4గురు చొప్పున, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో ఇద్దరు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఒకరు.. మొత్తం 96 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 639 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 22 మంది చనిపోయారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో 6గురు చొప్పున, కర్నూలు జిల్లాలో 5గురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలలో ఇద్దరు చనిపోయారు.  
 
జిల్లాలలో కోవిడ్‌–19 నివారణ చర్యలు:
 
శ్రీకాకుళం జిల్లా:
రాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షను జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ స్వయంగా పరిశీలించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక బర్మాకాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. స్థానిక వాస్తవ్యులు మణికొండ ఆదినారాయణ మూర్తికి  రాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా ఐ.జి.జి మరియు ఐ.జి.ఎం టెస్టులను నిర్వహించి  కరోనా నెగిటివ్‌గా గుర్తించారు.

అనంతరం కరోనా నెగిటివ్‌ వచ్చిన ఆదినారాయణ మూర్తిని కలెక్టర్‌ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు మరింత సులభతరమైందని చెప్పారు. జిల్లాకు 3వేల కిట్లు వచ్చాయని, దీని ద్వారా ఎవరికైతే కరోనా లక్షణాలు ఉన్నాయో అటువంటి వారందరకీ ఈ టెస్టులను నిర్వహించి కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే వ్యాధిని నిర్ధారించడం జరుగుతుందని చెప్పారు.

ఈ టెస్టుల వలన ప్రస్తుతం వ్యాధిని గుర్తించడమే కాకుండా గతంలో కరోనా బారిన పడిన వారిని కూడా గుర్తించవచ్చని తెలిపారు. ఇది కేవలం ప్రిలిమినరీ టెస్టు మాత్రమేనని, పాజిటివ్‌ వచ్చిన వారికి నిర్ధారణ కొరకు మరొక టెస్టు చేయవలసి ఉంటుందని అన్నారు. ఈ కిట్ల వలన ఎక్కువ సంఖ్యలో టెస్టులను నిర్వహించే అవకాశం ఉందని, 60 ఏళ్లకు దగ్గరలో ఉన్నవారు, 60 ఏళ్లు పైబడి మధుమేహం, రక్తపోటు లేనివారికి ముందుగా టెస్టులను చేయడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు.

గతంలో కరోనా నిర్ధారణ కొరకు శాంపిల్స్‌ ను కాకినాడకు పంపే వారమని, ఇకపై జిల్లాలోనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. అలాగే రోజుకు 500 వరకు శాంపిల్స్‌ తీస్తున్నామని, తీసిన శాంపిల్స్‌ ను 24 గంటల్లోగా ఫలితాలను వెల్లడించనున్నామని చెప్పారు. జిల్లాలో కరోనా లక్షణాలు ఉన్నట్లు ఎవరికైనా అనిపిస్తే ఏఎన్‌ఎం లేదా ఆశా వర్కర్లను సంప్రదించడం ద్వారా ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని కలెక్టర్‌ నివాస్‌ వివరించారు.
 
విజయనగరం జిల్లా:
మహమ్మారిగా రూపొందిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు జిల్లాలో ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ద్వారా సరఫరా చేసిన హోమియో ఔషధం ఆర్సెనిక్‌ ఆల్బం–30 ను పంపిణీ చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డా.ఎం.హరిజవహర్‌లాల్‌ తెలిపారు.

హోమియో విభాగం ద్వారా జిల్లాకు లక్ష డోసుల ఆర్సెనిక్‌ ఆల్బం–30 ఔషధాన్ని సరఫరా చేశారని, దీనిని జిల్లాలో కరోనాను ఎదుర్కోవడంలో ముందు నిలిచి పోరాడుతున్న మునిసిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, హోం గార్డులు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు తదితర వర్గాల వారందరికీ ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని  పెంపొందించడంలో ఆర్సెనిక్‌ ఆల్బం–30 ఔషధం దోహదపడుతుందని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ పేర్కొన్నారు. పెద్దలు ప్రతి రోజూ 6 పిల్స్‌ వంతున మూడు రోజుల పాటు పరగడుపున వేసుకోవాలని, పిల్లలు రోజు 4 పిల్స్‌ చొప్పున వేసుకోవాలని తెలిపారు. కరోనా నిరోధానికి ఈ ఔషదం వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్నారు.

మరోవైపు జిల్లాలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నోడల్‌ అధికారిగా పి.సి.టి.స్వామిని నియమించింది. ఆయనతో పాటు గుడివాడ, రాజమండ్రి హోమియో కళాశాలల్లో పి.జి. స్కాలర్లుగా ఉన్న ఐదుగురిని కరోనా ప్రత్యెక విధుల కోసం నియమించారు.  
 
విశాఖపట్నం జిల్లా:
కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నదని ప్రస్తుత పరిస్థితులలో కరోనాని పారద్రోలడానికి ఆర్థికంగా చేయూతనిచ్చి తమ వంతు సహాయ సహకారాలను అందించాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.

మంగళవారం స్థానిక వుడా చిల్డ్రన్‌ ఎరీనాలో జిల్లాకు చెందిన పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతూ మానవాళిని ఆందోళనకు గురి చేస్తున్నదని, దీనిని కట్టడి చేయడానికి నెల రోజుల నుంచి లాక్‌ డౌన్‌ పాటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక వనరులను అందించే పరిశ్రమలు, రవాణా వ్యవస్థ స్తంభించి పోయిందన్నారు. విపత్కర పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని చెప్పారు.

ఇటువంటి పరిస్థితులలో చాలామంది పారిశ్రామికవేత్తలు ఆర్థిక చేయూతనివ్వడానికి ముందుకు వచ్చి ప్రభుత్వానికి విరాళాలను అందించారని, వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మంత్రి శ్రీనివాసరావు తెలిపారు. అదే విధంగా మిగిలిన వారు కూడా విరాళాలను ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌కు అందజేయాలని ఆయన కోరారు. 

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కంటైన్మెంట్‌ జోన్లు, జీవీఎంసీ, నర్సీపట్నం, ఎలమంచిలి, పద్మనాభం, భీమిలి ప్రాంతాలలో మే 3వ తేదీ వరకు లాక్‌ డౌన్‌ అమలులో ఉంటుందని, మిగిలిన ప్రాంతాలలో కొద్ది సవరణలతో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, భవన నిర్మాణాల పనులను మొదలు పెట్టవచ్చని మంత్రి చెప్పారు. పనులు జరిగే ప్రాంతాలలో కార్మికులు సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్లు, వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. 

నిరు పేదలను ఆదుకునే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన వెయ్యి రూపాయల పంపిణీ లో భాగంగా జిల్లాలో ఇప్పటికే రూ.110 కోట్లు అర్హులైన వారందరికీ అందించామని, ఇంకా నిత్యావసరాలు కూడా సరఫరా చేశామని మంత్రి శ్రీనివాసరావు వివరించారు.

సంస్థలు ముందుకు రావాలి
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ అవినీతి రహిత పాలన అందించే ఉద్దేశంతో ముందుకు సాగుతోందని వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసమే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.

లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయిందని, మరోవైపు ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు వచ్చి కరోనా నియంత్రణ చర్యలకు చేయూతనివ్వాలని ఆయన కోరారు.
 
కృష్ణా జిల్లా:
జిల్లాలో కోవిడ్‌–19 నివారణ, నియంత్రణలో పని చేస్తున్న వైద్య సిబ్బందికి 10 లక్షల మాస్కులు సిద్ధంగా ఉన్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఐ.రమేష్‌ వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి సరఫరా చేయడం కోసం 10 లక్షల మాస్కులతో పాటు, 6900 వ్యక్తిగత భద్రత ఉపకరణాలు (పీపీఈ కిట్లు), 1.60 లక్షల క్లాత్‌ మాస్కులు, 4300 శానిటైజర్లు, 900 వైరల్‌ ట్రాన్స్‌పోర్టు మెడికల్‌ కిట్లు సిద్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇంకా అవసరమైన ఔషథాలు, ఉపకరణాలు కూడా జిల్లాకు రానున్నాయని, వీటన్నింటినీ వెంటనే అన్ని మండలాలకు పంపిస్తామని డాక్టర్‌ ఐ.రమేష్‌ వివరించారు.
 
ప్రకాశం జిల్లా:
జిల్లాలో గుడ్లూరు మండలం మొత్తాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటిస్తున్నామని, జన సంచారం, వాహనాల రాకపోకలతో పాటు, వ్యవసాయ రంగానికి చెందిన పనులన్నింటికీ నిషేధాజ్ఞలు వర్తిస్తాయని కలెక్టర్‌ పోల భాస్కర్‌ ప్రకటించారు. కొత్తగా కరోనా వైరస్‌ కేసులు నమోదైన గుడ్లూరు మండలాన్ని కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. ఉపాధి పనులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన పనులన్నీ 14 రోజుల పాటు  గుడ్లూరు మండలంలో నిషేధిస్తున్నామని కలెక్టర్‌ వెల్లడించారు.
 
గుడ్లూరు ప్రాంతంలో ఇద్దరికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కాగా వారి నివాస ప్రాంతం నుంచి 300 మీటర్లు దూరంలో రెడ్‌ జోన్‌లో 450 కుటుంబాలు, అదే విధంగా మూడు కిలోమీటర్ల పరిధిలోని కంటైన్మెంట్‌ జోన్‌లో 1,598 కుటుంబాలు ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. ఆయా కుటుంబాలను సర్వే ద్వారా నిరంతరం పరీక్షిస్తున్నామని చెప్పారు. ఇంకా ఆ ప్రాంతం నుంచి బఫర్‌ జోన్‌గా ఏడు కిలోమీటర్ల ప్రాంతంలో నిషేధాజ్ఞలు వర్తిస్తాయని కలెక్టర్‌ భాస్కర్‌ స్పష్టం చేశారు.
 
కంటైన్మెంట్‌ జోన్‌లోని ఆ మండలంలో 587 మంది హైరిస్క్‌లో ఉన్నట్లు సర్వేల ద్వారా గుర్తించామని కలెక్టర్‌ చెప్పారు. బఫర్‌ జోన్‌ పరిధిలో మరో 611 మంది ఉన్నారని, ముందస్తుగా క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న వారికి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత కంటైన్మెంట్‌ జోన్‌లో వారికి ట్రూనాట్‌ యంత్రాల ద్వారా పరీక్షలు చేస్తామని తెలిపారు. 

కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి 53 మంది రైతులకు ఎరువులు విక్రయించినట్లు గుర్తించామని, వారందరినీ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తామని కలెక్టర్‌ చెప్పారు. ఇప్పటికే వ్యాధి సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్న 70 మందిని  క్వారంటైన్‌లో ఉంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపినట్లు వివరించారు.

వారికి  సన్నిహితంగా మెలిగిన మరో 17 మందిని హోమ్‌ ఐసోలేషన్‌ ఉంచామని తెలిపారు. గుడ్లూరు మండలంలో ప్రత్యేక బృందాల ద్వారా ట్రూనాట్‌ యంత్రాలతో మరికొందరికి పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వివరించారు.
 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:
కోవిడ్‌–19 నివారణ, నియంత్రణలో అహర్నిషలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ చెప్పారు. నెల్లూరు పట్టణ, గ్రామీణ నియోజకవర్గాల తరపున 1500 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు, కూరగాయలు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ మేరకు మంగళవారం నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు, నిత్యావసరాల కిట్లు అందజేశారు. వాటితో పాటు, ‘మెప్మా’ ఆధ్వర్యంలో తయారైన మాస్కుల పంపిణీని కూడా మంత్రి అనిల్‌కుమార్‌ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా, జిల్లాలో మెప్మా తొలుత తయారు చేసిన 10 వేల మాస్కుల పంపిణీని మంత్రి మొదలు పెట్టారు.  
 
అనంతపురం జిల్లా:
కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయి జిల్లా కేంద్రంలోని కోవిడ్‌–19 జిల్లా ఆస్పత్రి (కిమ్స్‌ సవీరా)లో చికిత్స పొందుతున్న వారిలో 5గురు పూర్తిగా కోలుకున్నారు. హిందూపురంకు చెందిన వారికి రెండు పర్యాయాల పరీక్షలో నెగటివ్‌ రావడంతో, వారిని మంగళవారం సాయంత్రం డిశ్చార్జ్‌ చేశారు. నియమావళి మేరకు వారిని ప్రత్యేక అంబులెన్సులో ప్రభుత్వం ఖర్చుతో ఇళ్లకు సురక్షితంగా పంపించారు. 
 
వైయస్సార్‌ కడప జిల్లా:
జిల్లాలో కరోనా పాజిటీవ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షల నిర్వహణపై.. మంగళవారం స్థానిక విసి హాలు నుంచి  అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపిడివోలు, మున్సిపల్‌ కమీషనర్లు, మెడికల్‌ ఆఫీసర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలపై ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేకమైన పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జిల్లాలోనే వినియోగిస్తున్నారని తెలిపారు. ఈఆర్‌డీకే కిట్స్‌ ద్వారా బ్లడ్‌ శాంపిల్‌ తీసిన 15 నిమిషాల్లోనే కరోనా వ్యాధిని నిర్ధారించవచ్చునన్నారు. ఈ పరీక్షల కోసం జిల్లాకు 7 వేలకు పైగా.. ఆర్‌డీకే కిట్స్‌ను ప్రభుత్వం పంపించడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో ఫివర్‌ సర్వే కేసులు 2401 గా గుర్తించి నమోదు చేయడం జరిగిందని కలెక్టర్‌ హరికిరణ్‌ వెల్లడించారు. వారిలో 60 ఏళ్లు పైబడి హోమ్‌ ఆర్బిట్యూడ్‌ ఉన్న వారు, 60 ఏళ్ల లోపు ఉండి హోమ్‌ ఆర్బిట్యూడ్‌ ఉన్న వారు, 60 ఏళ్ళు పైబడి హోమ్‌ ఆర్బిట్యూడ్‌ లేని వారు, 60 ఏళ్ల లోపు ఉండి హోమ్‌ ఆర్బిట్యూడ్‌ లేనివారు.. అనే నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందన్నారు. 

ఇందులో 3వ కేటగిరీకి చెందిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి 938 మందిని గుర్తించడం జరిగిందన్నారు. 4వ కేటగిరిలోని మిగిలిన 1400 మందికి ఆర్‌డిటి (రాపిడ్‌ డయగ్నాస్టిక్స్‌ టెస్ట్‌) కిట్స్‌ ద్వారా కంటైన్మెంట్‌ జోన్‌లో సర్వే చేపట్టాలన్నారు. మరోవైపు లిప్కోన్‌ కిట్స్‌ ద్వారా హెల్త్‌ వర్కర్స్‌ కోసం మెడికల్‌ అధికారుల ఎంహెచ్‌ఎస్‌ క్రేడెన్సియల్‌ ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. 
 
కర్నూలు జిల్లా:
జిల్లాలో మొత్తం 23 కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌/క్వారంటైన్స్‌లో ఉన్న 1259 మందిలో 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకుని, నిబంధనల ప్రకారం రెండు కరోనా రిపీట్‌ టెస్ట్స్‌ చేయించుకుని నెగిటివ్‌  వచ్చిన దాదాపు 48 మందిని మంగళవారం సాయంత్రం కర్నూలు ఆర్‌.యూ. ఆళ్లగడ్డ, గోస్పాడు, సి.బెలగల్‌ క్వారంటైన్‌  కేంద్రాల నుండి డిశ్చార్జ్‌ చేసినట్లు కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ వెల్లడించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ క్వారంటైన్‌/కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ నుండి డిశ్చార్జ్‌ అయిన వారికి రూ.2 వేల  నగదును ఆర్థిక సహాయంగా అందించామని, వారిని ప్రభుత్వ ఖర్చుతో సురక్షితంగా ఇళ్లను పంపించామని కలెక్టర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments