కేరళలోని శబరిమల ఆలయాన్ని మహిళలు వయోబేధం లేకుండా దర్శించుకోవచ్చునని సుప్రీం కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో.. శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్లిన మరో ఇద్దరు మహిళలకు భంగపాటు తప్పలేదు. శబరికొండకు మరో కిలోమీటరు దూరం వుందనగానే.. ఆ ఇద్దర మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో ఆ ఇద్దరు మహిళలు వెనుదిరగక తప్పలేదు.
పంబా నదీ సమీపంలోనే ఆ ఇద్దరు మహిళలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో వారిద్దరూ నిరాశతో వెనుదిరిగారు. పోలీసుల బృందం రక్షణతో వెళ్లినా.. ఆందోళనకారులు మహిళల్ని అయ్యప్ప దర్శనానికి వెళ్లనివ్వలేదు. ఆదివారం తమిళనాడుకు చెందిన మనిత సంస్థ మహిళల బృందం కూడా శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించింది.
కానీ 11 మంది మహిళలతో కూడిన ఈ బృందం బేస్ క్యాంప్ చేరుకోవడంతో.. వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రానున్న రోజుల్లో మరో 40మందికి పైగా మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇందుకోసం భద్రతను పెంచినున్నట్లు పోలీసులు వెల్లడించారు.