ప్రకృతి ప్రకోపానికి బలైన కేరళ వాసులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. జల ప్రళయంతో అల్లాడిన ఈ పర్యాటక ప్రాంతం పట్టెడన్నం, గుక్కెడు నీళ్ల కోసం తండ్లాడుతోంది. గత కొద్ది రోజులుగా వరుణుడి విజృంభణతో కకావి
ప్రకృతి ప్రకోపానికి బలైన కేరళ వాసులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. జల ప్రళయంతో అల్లాడిన ఈ పర్యాటక ప్రాంతం పట్టెడన్నం, గుక్కెడు నీళ్ల కోసం తండ్లాడుతోంది. గత కొద్ది రోజులుగా వరుణుడి విజృంభణతో కకావికలమైన కేరళ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. భారీ వర్షాలకు కేరళలో ఆదివారం 13 మంది మృతిచెందారు. దీంతో ఆగస్టు 8 నుంచి ఈ విపత్తు బారినపడి మరణించిన వారి 393కు చేరింది. ప్రకృతి ప్రకోపానికి 7.24 లక్షల మంది గూడు చెదిరి చెల్లాచెదురయ్యారు. వారు 5,645 సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
కేరళలో ఇలాంటి దయనీయ పరిస్థితి ఉంటే కొందరు వ్యాపారులు మాత్రం శవాలతో వ్యాపారం చేసేలా ప్రవర్తిస్తున్నారు. పిడికెలు మెతుకుల కోసం ఆరాటపడుతున్న వరద బాధిత ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీనికి నిదర్శనమే.. కేజీ పచ్చిమిరపకాయలు ధర రూ.400, కేజీ క్యాబేజీ ధర రూ.90కు విక్రయిస్తున్నారు.
వరదల కారణంగా కేరళలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. వర్షాల ప్రభావం కాస్త తగ్గిన ప్రాంతాల్లో కొన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. వీటి ముందు ప్రజలు క్యూ కడుతుండటంతో వ్యాపారులు తమకు తోచిన ధరలకు విక్రయిస్తున్నారు. కొచ్చి నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కేజీ పచ్చి మిర్చి రూ.400కు విక్రయిస్తున్నారు. ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, క్యాబేజ్‌లు కిలో రూ.90 చొప్పున విక్రయిస్తున్నారు. ధరలు విపరీతంగా పెంచడంతో కలూర్‌లోని ఓ దుకాణం వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు.