నేడు మన దేశం సుభిక్షంగా పంట, పొలాలతో... వరద ముంపులేని ప్రాంతాలతో తులతూగడానికి కారణం ఓ మహామనిషి. ఊళ్లకు ఊళ్లనే తన గర్భంలో కలిపేసుకునే ఉగ్ర గంగను ఆపిన మహా శక్తివంతుడాయన. ఏడుకొండలవాడా... ఎక్కడున్నావయ్యా.. అంటూ అలసిసొలసిన భక్తునికి వేంకటేశుని పాదాల చెంతకు వెళ్లే అతితేలికైన దారిని చూపించిన మహామేథావి. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సాంకేతిక రంగానికి పుట్టిల్లయినటువంటి కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లాలోని ముద్దెనహళ్లిలో సెప్టెంబరు 15, 1861న జన్మించారు విశ్వేశ్వరయ్య.
ఏడుకొండలవాడిని చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న భక్తుల వ్యధలను చూసి, శ్రీవారిని చేరుకునేందుకు సుళువైన రోడ్డు మార్గానికి సంబంధించిన డిజైన్ రూపొందించిన ఆ మహనీయుడెవరు..? ఒక్కసారి ఆ మహనీయుని చరిత్రను ఈ సెప్టెంబరు 15న ఒకసారి అవలోకిద్దాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన బాల్యంలో అనేక ఆటుపోట్లను చవిచూశారు. సంస్కృతంలో ఉద్దండులైన తండ్రి శ్రీనివాసశాస్త్రిను విశ్వేశ్వరయ్య కేవలం పదిహేనేళ్ల ప్రాయంలోనే పోగొట్టుకున్నారు. నిజానికి విశ్వేశ్వరయ్య తాత ముత్తాతల ఊరు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు సమీపంలోని మోక్షగుండం గ్రామం.
అయితే మూడు దశాబ్దాల క్రితం మోక్షగుండం నుంచి మైసూరుకు వలస పోయారు విశ్వేశ్వరయ్య కుటుంబీకులు. వారి జన్మస్థలి నామధేయమైన మోక్షగుండం మాత్రం వారి వెన్నంటే వెళ్లింది. అందుకే మోక్షగుండం వారి ఇంటిపేరు అయింది. అందుకే ఆ పేరు విన్నప్పుడు చటుక్కున మన ఆంధ్ర రాష్ట్రంలోని గిద్దలూరులోని మోక్షగుండం మదిలో కదలాడుతుంది.
అదలావుంచితే 15 ఏళ్ల ప్రాయంలో తండ్రిని పోగొట్టుకున్న విశ్వేశ్వరయ్య, తన ప్రాథమిక విద్యను బెంగళూరులోని చిక్బల్లాపూర్‌లో పూర్తి చేశారు. 1881 సంవత్సరంలో మద్రాసు యూనివర్శిటీ నుంచి బీఏ పట్టా పొందారు. ఆ తర్వాత పూనెలో సివిల్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత పబ్లిక్‌వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాన్ని సాధించారు. ఆ తర్వాత ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆయనను ఇండియన్ ఇరిగేషన్ కమిషన్‌లోకి ఆహ్వానించింది.
కమిషన్‌లోకి అడుగుపెట్టిన విశ్వేశ్వరయ్య దక్కను ప్రాంతంలో సాగునీటి సమస్యపై తీవ్రంగా కృషి చేశారు. అంతేకాదు దేశంలోనే తొలిసారిగా 1903లో ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్ల పద్ధతిని కనుగొన్నారు. వాటిని పూనెలోని ఖండక్వస్ల రిజర్వాయిర్‌లో నెలకొల్పారు. రిజర్వాయిర్‌లో భారీగా చేరే నీటిని నిలువవుంచగలిగే సదుపాయంతోపాటు డ్యామ్‌కు ఎటువంటి హాని తలపెట్టకుండా చూడటంలో ఈ ఫ్లడ్ గేట్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ సూత్రం విజయవంతం కావడంతో దేశంలో పలుచోట్ల ఇదే తరహా పద్ధతిని ప్రవేశపెట్టారు.
వరద ముప్పుతో అల్లాడే హైదరాబాదు నగరానికి శాశ్వత ప్రాతిపదికన ఆయన రూపొందించిన డిజైన్ సత్ఫలితాలనివ్వడంతో ఆయనకు విశేష గుర్తింపు లభించింది. ఇలా ఆయన దేశంలోని ఆయా ప్రాంతాల్లో పరుగులు తీస్తూ సముద్రంలో వృధాగా కలిసిపోయే గంగను ఆపడమేకాక నగరాలకు నగారలనే తన గర్భంలో కలుపుకునే ఉగ్ర గంగను సైతం బంధించాడు.
ఆ మేథస్సుకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు ఆయనను వెతక్కుంటూ వచ్చాయి. డాక్టరేట్లు, ఎల్ఎల్డీలు... ఇలా ఎన్నో ఆయన ముంగిట వాలాయి. ఇక ఆయన పేరిట మన దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు వెలిశాయి. భారతప్రభుత్వం ఆయనను అత్యున్నత భారత రత్న అవార్డుతో సత్కరించింది. అంతేకాదు ఆయన పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబరు 15ను "ఇంజినీర్స్ డే"గా ప్రకటించి ఆయనపట్ల తమకున్న గౌరవాన్ని చాటుకుంది.