Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిటిష్ వారిని వ‌ణికించిన‌ చంద్రశేఖర్ ఆజాద్ జయంతి నేడు!

బ్రిటిష్ వారిని వ‌ణికించిన‌ చంద్రశేఖర్ ఆజాద్ జయంతి నేడు!
, శుక్రవారం, 23 జులై 2021 (15:56 IST)
భారత జాతి మ‌ద్దు బిడ్డ, బ్రిటిష్ వారిని వ‌ణికించిన‌ చంద్రశేఖర్ ఆజాద్ జయంతి నేడు. స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం భగత్ సింగ్ రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడిగా బ్రిటీషువారి గుండెల్లో రైల్లు పరిగెత్తించి, సాయుధ పోరాటం చేసి అమరుడైన వీరుడు చంద్రశేఖర్ అజాద్ జయంతి నేడు.
 
భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తిపేరు చంద్రశేఖర సీతారామ్ తివారి. ఈయన పండిత్‌జీగా కూడా పిలువబడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లా, బావ్రా గ్రామంలో పండిట్ సీతారామ్ తివారి, జగరానీ దేవీలకు 1906 జూలై 23న‌  చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసిన ఈయన వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు.
 
1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలతచెందిన ఆజాద్.. ఆ తరువాత 1921లో మహాత్మాగాంధీ నడిపిన సహాయ నిరాకరణోద్య మంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నేరానికి ఆయన తన పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్టయ్యారు. విచారణ సందర్భంగా కోర్టులో "నీ పేరేంటి?" అని మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు ఆయన పెద్ద శబ్దంతో "ఆజాద్" అని అరచి చెప్పారు. దాంతో ఆయనకు మెజిస్ట్రేట్ 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. అయితే ప్రతి కొరడా దెబ్బకు ఆయన భారత్ మాతాకీ జై (వందేమాతరం) అంటూ గొంతెత్తి నినదించారు. ఇక అప్పటి నుంచి చంద్రశేఖర్ ఆజాద్‌గా ఆయన పేరు స్థిరపడిపోయింది.
 
సహాయ నిరాకరణోద్యమం ఆజాద్‌లో దాగి ఉన్న విప్లవవాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని బ్రిటీష్‌వారి కబంధ హస్తాల నుంచి విడిపించాల్సిం దేనని ఆయన బలంగా నిశ్చయిం చుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను స్థాపించారు. భగత్ సింగ్, సుఖదేవ్, తదితరులకు మార్గనిర్దేశకుడిగా మారారు.
 
1928వ సంవత్సరంలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి కన్నుమూసిన 'పంజాబ్ కేసరీ లాలాలజపతిరాయ్ మృతికి ప్రతికారంగా రాజ్ గురు, భగత్ సింగ్, బ్రిటీష్ పోలీస్ అధికారి సాండర్స్ ను కాల్చి చంపగా, సాండర్స్ వెంట వచ్చిన హెడ్ కానిస్టబులు రాండ్ ను అజాద్ కాల్చి చంపాడు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ప్రభుత్వాలు ఆజాద్ ను సజీవంగా పట్టుకునే ప్రయత్నం చేశాయి. అతనిని ప్రాణాలతో తీసుకువచ్చినా లేక చంపి తెచ్చినా 30 వేల రూపాయలు బహుమతిగా ప్రకటించారు.
 
అ రోజు 1931, ఫిబ్రవరి 27, శుక్రవారం అలహాబాదులోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా, ఒక్కడే పోరాడుతూ ముగ్గురు పోలీసులను హతమార్చారు. అలసిపోయేదాకా పోరాడిన ఆయన చివరి క్షణంలో తన వద్ద మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్‌తో తనను తానే కాల్చుకుని అశువులు బాసారు. తన చివరి క్షణం వరకూ భారతమాత కోసం పోరాడి శత్రువుకు చిక్కకుండా ఎంతో నిబ్బరంగా తననుతాను కాల్చుకోని వీరమరణం పొందాడు అజాద్ . ఈయన త్యాగం అజరామరంగా నిలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ స్టీల్ ప్లాంట్ పైన సీబీఐ మాజీ జేడీ పిటిష‌న్: హైకోర్టు విచార‌ణ‌