మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజుకు తెలుగు జాతి నిలువెత్తు నీరజానాలు పలికింది. ఆయన జయంతి వేడుకలను పురస్కరించుకుని అల్లూరి సేవలను స్మరించుకున్నారు.
ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. "ప్రజల హక్కుల కోసం,స్వాతంత్ర్య పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకం. అల్లూరి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా" అని వ్యాఖ్యానించారు.
అలాగే, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ట్వీట్ చేస్తూ, "స్వాతంత్ర్యం కోసం సాయుధపోరాట మార్గాన్నెంచుకుని, పరిమితమైన గిరిజన యోధులతోనే బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన మన్యం వీరుడు, విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నివాళి" అని పేర్కొన్నారు.
జనసేన పార్టీ తరపున కూడా ఆయన సేవలను స్మరించుకున్నారు. "మన్నెం వీరుడు.. తెల్లదొరల దురాగతాలపైన తెగించి పోరాడిన తెలుగు ధీరుడు “శ్రీ అల్లూరి సీతారామరాజు” గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాము" అని పేర్కొన్నారు.