Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్వీన్ ఎలిజబెత్-2 భర్త కన్నుమూత-100వ జన్మదినానికి 2 నెలల ముందు..?

క్వీన్ ఎలిజబెత్-2 భర్త కన్నుమూత-100వ జన్మదినానికి 2 నెలల ముందు..?
, శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (17:51 IST)
Prince Philip
బ్రిటిష్ రాజవంశం చేదు వార్తను ప్రకటించింది. బ్రిటిష్ రాజవంశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రిన్స్ ఫిలిప్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. విండ్సర్ కేజిల్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయనకు కింగ్ ఎడ్వర్డ్-7 హాస్పిటల్, సెయింట్ బరతోలోమెవ్ హాస్పిటల్‌లో చికిత్స జరిగింది. 
 
ఈ వివరాలను బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటించింది. గ్రీస్‌కు చెందిన ప్రిన్స్ ఫిలిప్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ రాచరిక పరిపాలనను ఆధునికీకరించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. క్వీన్ ఎలిజబెత్-2కు అత్యంత నమ్మకస్థుడిగా మెలిగారు. 100వ జన్మదినానికి రెండు నెలల ముందు ఆయన తనువు చాలించారు.
 
డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరో ప్రిన్స్ ఫిలిప్ (99) మరణ వార్తను రాజ వంశ కుటుంబ సభ్యులందరికీ తెలియజేసినట్లు బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటన పేర్కొంది. ఆయన పార్దివ దేహానికి అంత్యక్రియలకు త్వరలో ఏర్పాట్లు జరుగుతాయని తెలిపింది. విండ్సర్ కేజిల్ వద్ద ఫ్రాగ్‌మోర్ గార్డెన్స్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని పేర్కొంది. ప్రిన్స్ మృతికి సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలను అవనతం చేస్తారు.
 
ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్-2 వివాహం 1947లో జరిగింది. వీరికి నలుగురు పిల్లలు - చార్లెస్, అన్నే, ఆండ్రూ, ఎడ్వర్డ్ - ఉన్నారు. ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్-2 వివాహ 73వ వార్షికోత్సవం గత ఏడాది నవంబరులో జరిగింది. వీరిద్దరూ కోవిడ్-19 మహమ్మారి కారణంగా విండ్సర్ కేజిల్‌లో ఏకాంతంగా గడిపేవారు. ఈ ఏడాది జనవరిలో కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మానవ అక్రమ రవాణా అడ్డుకట్టకు కేంద్రీకృత విధానం అవసరం : ఏపీ గవర్నర్