వివాహేతర సంబంధాలు నేరాలకు, ఘోరాలకు కారణమవుతున్నాయి. ఓ కన్నతల్లి కన్నబిడ్డను వివాహేతర సంబంధం కోసం పొట్టనబెట్టుకుంది. ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డంకిగా ఉందని భావించి తన కూతురును కన్నతల్లి చంపేసుకుంది. అనంతరం మృతదేహాన్ని బావిలోకి పడేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రాయ్‌బరేలీలోని దాల్మయి కోట్‌వాలీ మండలం సుర్సానా గ్రామానికి చెందిన సంతోశ్‌కుమార్ భార్య, కూతురు (5)తో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల హోలీ సందర్భంగా భార్య కూతురును తీసుకుని పుట్టింటికి వచ్చింది. పండుగ అనంతరం ఆమె తిరిగి రాలేదు. అనంతరం ఆమె అదృశ్యమైంది. ఆమె కోసం గాలిస్తుండగా ఆచూకీ లభించలేదు.
ఈ సమయంలో ఆమె గురించి తెలిసిన వారు ఒకరు సమాచారం అందించారు. ఆమె తన ప్రియుడితో కలిసి పక్క ఊరిలో ఒక ఇంట్లో ఉంటోందని తెలిసింది. దీంతో భర్త వెంటనే అక్కడకు వెళ్లి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. అయితే కూతురి విషయం అడగ్గా ఆమె సమాధానం ఇవ్వలేదు. కుటుంబసభ్యులు అంతటా గాలించారు పాప ఆచూకీ లభించలేదు.
ఈ సమయంలో బావిలో బాలిక మృతదేహం కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు చేరుకుని మృతదేహం బయటకు తీయగా బాలిక కనిపించింది.
వివరాలు సేకరించి బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా తానే బాలికను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు.. ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు బావిలో పడేసినట్లు చెప్పింది. దీంతో భర్త, ఆమె కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. వెంటనే ప్రియుడితో పాటు ఆమెను జైలుకు తరలించారు.